హన్నన్నా...ఆర్‌ఐఓ గారూ?

13 Nov, 2019 10:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 పెద్దమొత్తంలో డిమాండ్‌ చేసిన అధికారి

వాళ్లు ఎప్పటి నుంచి మామూళ్లు చెల్లిస్తున్నారో? ఈయన గారు ఎన్నాళ్ల నుంచి తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారో గానీ చివరికి బేరసారాల సమన్వయం కుదరలేదు. ఇన్నాళ్లూ ఓపికతో అడిగిందంతా సమర్పించిన వారు విసిగిపోయారు. ఏం జరిగితే జరగనీ అనుకున్నారు. అయ్యగారి అజమాయిషీకి తెరదించాలనుకున్నారు. మంగళవారం అన్నంత పనే చేశారు. ఇంటర్మీడియెట్‌ పర్యవేక్షణ అధికారి ఏసీబీకి పట్టుబడిన ఉదంతమిది.

సాక్షి, శ్రీకాకుళం : జిల్లా ఇంటర్మీడియెట్‌ రీజనల్‌ పర్యవేక్షణ అధికారి (ఆర్‌ఐఓ) గుంతుకు రమణారావు మంగళవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడ్డారు. సోంపేటలోని కృష్ణసాయి ప్రైవేట్‌ జూని యర్‌ కళాశాల యాజమాన్యం ఆయన్ను పట్టించింది. 221 మంది ఇంటర్‌ విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలంటూ గత నెల 30న ఆర్‌ఐఓకు నివేదించగా, పెద్దమొత్తంలో ముడుపులు ముట్టజెప్పాలని డిమాండ్‌ చేశారు. కళాశాల యాజమాన్య కరస్పాండెంట్‌ తమ్మినేని కృష్ణారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఆర్‌ఐఓ కార్యాలయంలో రమణారావును పట్టుకున్నారు. ఇన్నాళ్లూ విద్యార్థుల పరీక్షల అనుమతికి అడిగింది చెల్లించిన యాజమాన్యం ఇంతటి సాహసోపేతమైన చర్యకు పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆర్‌ఐఓ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడమూ ఇదే ప్రథమం కావడం విశేషం.   

ఇది వారికి ‘మామూలే’.. 
ఆర్‌ఐఓ రమణారావు తీరుపై జిల్లాలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నాయి. అడిగినంత ఇస్తే గానీ ఏ ఫైలూ కదలదని అక్కడి ఉద్యోగులే చెబుతుంటారు. విద్యార్థుల భవిష్యత్‌ ముడి పడి ఉండడం, పర్యవేక్షణ కూడా అంతంతమాత్రం కావడంతో అవినీతి అధికారుల ఆటలు సాగేవి. ఇన్నాళ్లకు ఒక యాజమాన్యం ఎదురు తిరగడంతో రమణారావు బండారం బట్టబయలైంది. దీనికి తోడు ప్రభుత్వం తాజాగా ఇంటర్‌ విద్యలో ఆన్‌లైన్‌లోనే ఫీజు లు, రుసుములు చెల్లించేలా సంస్కరణలు ప్రవేశపెట్టింది. తాజా సంస్కరణల వల్లనే అవినీతి అధికారి ఏసీబీకి సులభంగా చిక్కారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

సంస్కరణల ఫలితమే.. 
కొన్నాళ్ల కిందటి వరకు విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలే ఫీజులను వసూలు చేసేవి. నిబంధనలను అతిక్రమించి రెండు మూడు రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసేవారు. అందులోనే ఇంటర్‌ ఉన్నతాధికారులకు మామూళ్లు అందేవి. నిబంధనల మేరకు ఇంటర్మీడియెట్‌ అధికారులు ఏటా కళాశాలను పరిశీలించి, రికార్డులు, సదుపాయాలు తనిఖీ చేసి సంతృప్తి చెందితేనే ఆ కాలేజీ విద్యార్థులను అనుమతించేవారు. జిల్లాలో వంద ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉండగా, అందులో ఎనభై శాతం కాలేజీలకు మౌలిక సదుపా యాలు లేవన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ పర్యవేక్షణ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పడి పరిశీలన లేకుండానే తనిఖీల తంతు పూర్తి చేసేవారు. 

అప్పటి ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చర్యలేమీ తీసుకోకపోవడంతో వసూళ్ల కార్యక్రమం ఆటంకాలు లేకుండా సాగిపోయింది. తాజా గా ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే వెసులుబాటును తీసుకువచ్చింది. ఫలితంగా యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేయడం తగ్గించాయి. పైవారికి మామూళ్లు ఇవ్వడం కూడా తగ్గిపోయింది. అప్పటివరకు బల్ల కింద ఆదాయానికి అలవాటు పడిన అధికారులు అదనపు మొత్తం డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఎదురు తిరగడం మొదలుపెట్టాయి. ఆ ఫలితంగానే ఆర్‌ఐఓ స్థాయి అధికారి ఏసీబీకి దొరికిపోయారు.

మరిన్ని వార్తలు