అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

24 Dec, 2019 09:57 IST|Sakshi
దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న నగలను మీడియాకు చూపుతున్న ఎస్పీ

బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

అనంతపురం సెంట్రల్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్‌రాష్ట్ర దొంగలముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నగరంలో అనంతసాగర్‌కాలనీకి చెందిన షికారి కోటయ్య, షికారి రామకృష్ణ, బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి మెచిలి అలియాస్‌ నాగి, టీవీ టవర్‌కు చెందిన షికారి శీనా, షికారి శీను ఉన్నారు. వీరి నుంచి 62 తులాలు బంగారు, 18 తులాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు.

2018లో నగరంలోని అరవింద్‌నగర్, హౌసింగ్‌బోర్డు 2019లో కక్కలపల్లి పంచాయతీ దండోరాకాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, ఆకుతోటపల్లి, హౌసింగ్‌బోర్డు, తాటిచెర్ల, ఓబుళదేవరనగర్, ఎల్‌ఐజీ కాలనీ, సెంట్రల్‌ ఎక్సైజ్‌కాలనీ, ఆకుతోటపల్లి, కళ్యాణదుర్గం రోడ్డులలో చోరీలు చేశారు. జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, కర్నూలు జిల్లాలో కూడా నేరాలకు పాల్పడ్డారు. ఐదుగురిలో షికారి శీనా మినహా మిగిలిన వారిపై కేసులున్నాయి. దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పక్కా సమాచారం అందుకొని అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి సమీపంలో అశ్వర్థనారాయణస్వామి కట్ట వద్ద ఐదుగురినీ అరెస్ట్‌ చేశారు. వీరిని పట్టుకోవడంలో రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ జాకిర్‌హుస్సేన్, వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐలు రాఘవరెడ్డి, జయపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐ రమేష్, సిబ్బంది జయరామ్, దాసు, రామకృష్ణ, ప్రవీణ్, గిరి, ఆసిఫ్‌ల బృందం కీలకంగా వ్యవహరించింది. ఎస్పీ సత్యయేసుబాబు రివార్డులతో సిబ్బందిని అభినందించారు.  

మరిన్ని వార్తలు