అత్తింటి ఆరళ్లకు మహిళ బలి

8 Jun, 2018 12:05 IST|Sakshi
మృతి చెందిన చాకలి మునెమ్మ

ఎమ్మిగనూరులో వివాహిత ఆత్మహత్య

ఎమ్మిగనూరు రూరల్‌: అత్తింటి ఆరళ్లకు ఓ మహిళ బలైంది. ఆడపిల్లలకు జన్మనిస్తున్నావని, పుట్టింటికి వెళ్లాలంటూ భర్త, అత్తమామలు పెట్టే వేధింపులను ఆమె భరించలేకపోయింది. ఈనేపథ్యంలో ఉరివేసుకుని బలవన్మరణం పొందింది. పట్టణ ఏఎస్‌ఐ కె.సీతారామాంజనేయశర్మ వివరాలు మేరకు..గోనెగండ్ల మండలం బైలుప్పలకు చెందిన తిక్కన్న, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె చాకలి మునెమ్మ(28)ని పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన చాకలి వెంకటేష్‌కు ఇచ్చి పదేళ్ల కిత్రం వివాహం చేశారు. వీరికి సునీత(7), సునంద(4) ఉన్నారు.

అయితే ఆడపిల్లలకు జన్మనిస్తున్నావని భర్త వెంకటేష్‌ నిత్యం వేధించేవాడు. వీరికి అత్త,మామలు కూడ తోడవటంతో వేధింపులు ఎక్కువయ్యాయి. పుట్టింటి వారికి విషయం చెప్పిన వారు వచ్చి చెప్పినప్పుడు మాత్రం సరిగా చూసుకునే వారు. ఆ తర్వాత వేధింపులు కొనసాగించేవారు. దీంతో ఆమె తాను పడుతున్న బాధను పుట్టింటి వారికి చెప్పుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి తిమ్మన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు