అంతర్జాతీయ ఉగ్రవాది కుమారుడి అరెస్ట్‌

31 Aug, 2018 03:49 IST|Sakshi

శ్రీనగర్‌: ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్‌ సలాహుద్దీన్‌ కొడుకు షకీల్‌ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షకీల్‌ను రాంబాగ్‌లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. షకీల్‌ తన తండ్రి నుంచి ఉగ్రవాద నిధులు అందుకున్నట్లు 2011 ఏప్రిల్‌లో కేసు నమోదైంది.

ఇదే కేసులో సలాహుద్దీన్‌ పెద్ద కొడుకు షాహిద్‌ను జూన్‌లో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. వీరు హవాలా మార్గం ద్వారా పాక్‌ నుంచి సేకరించిన నిధులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అందించినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఇదే కేసులో పాక్‌ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీతోపాటు మహ్మద్‌ సిద్దిఖి గనాయ్, గులాం జిలానీ లిలూ, ఫరూక్‌ అహ్మద్‌ ఇప్పటికే ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు