నయనతారను బీట్‌ చేసిన త్రిష

16 Nov, 2023 06:53 IST|Sakshi

నటి త్రిష పాన్‌ ఇండియా నటిగా ఎప్పుడో మారారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన త్రిష అగ్రకథానాయకిగా రాణిస్తున్నారు. ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడుతోంది. ఇప్పటికీ అవివాహితగానే ఉన్నారు. అయితే చాలా కాలం క్రితమే నిర్మాత, వ్యాపారవేత్త అరుణ్‌ మణియన్‌తో పెళ్లి, నిశ్చతార్థం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత త్రిష ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా అందుకు సమయం వచ్చినప్పుడు చేసుకుంటానంటూ చెబుతూ వస్తున్నారు. కాగా ఈ మధ్య నటిగా చాలా డల్‌ అయ్యారు. తను నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవడంతో మార్కెట్‌ను కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు.

ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు ఈ బ్యూటీకి అసలు అచ్చిరాలేదు. అలాంటి సమయంలో త్రిషకు దర్శకుడు మణిరత్నం ఆపద్భాందవుడుగా నిలిచారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో అవకాశం కల్పించారు. అందులో యువరాణి కుందవైగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. పొన్నియిన్‌సెల్వన్‌ పార్టు 1, 2 చిత్రాలు విజయవంతం కావడంతో ఆ చిత్రంతో ఎక్కువగా లబ్ధి పొందింది నటి త్రిషనే అని చెప్పవచ్చు. ఈ చిత్రం రెండు భాగాలకు కలిపి త్రిష తీసుకున్న పారితోషికం రూ.2 కోట్లు అని సమాచారం. ఆ చిత్రం విజయంతో త్రిష తన పారితోషికాన్ని రూ.3 కోట్లకు పెంచినట్లు టాక్‌.

కాగా ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రానికి రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె నటించడానికి కారణం విజయే అనే ప్రచారం జరిగింది. ఇంతకుముందు విజయ్‌తో గిల్లీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించిన త్రిష లియో చిత్రంలో నాలుగోసారి నటించారు. నటుడు విజయ్‌తో 15 ఏళ్ల తరువాత నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం హిట్‌ కావడంతో ఈమెకు భారీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అజిత్‌కు జంటగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. తర్వాత కమలహాసన్‌కు జంటగా థక్స్‌ లైఫ్‌ చిత్రంలో నటించనున్నారు.

లియో చిత్రం తరువాత త్రిష తన పారితోషికాన్ని ఏకంగా రూ.12 కోట్లకు పెంచినట్లు తాజాగా జరుగుతున్న చర్చ. అయితే దీని గురించి అధికారిక సమాచారం లేదన్నది గమనార్హం. అయితే ఈ చైన్నె భామ ఇప్పుడు రూ.10 కోట్లకు తక్కువ పారితోషికం తీసుకోవడం లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ నయనతారనే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా పేరుపొందారు. ఇప్పుడు ఈమెను త్రిష బీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది త్రిషనే చెప్పాలి.

మరిన్ని వార్తలు