లంచాల కోసం.. ఏకంగా కార్యాలయం!

9 Sep, 2018 01:01 IST|Sakshi

వేలూరు (తమిళనాడు): లంచాలు వసూలు చేసేందుకు ఏకంగా కార్యాలయాన్నే నడపడంతో పాటు 38 మంది సిబ్బందిని నియమించుకున్నాడు ఓ అధికారి.  విజిలెన్స్‌ తనిఖీల్లో గుట్టు బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని వేలూరు సత్‌వచ్చారిలో టౌన్‌ప్లానింగ్‌ జోన్‌ అసి స్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో సుబ్రమణియన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా పనిచేస్తున్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అనుమతిలేని ఇళ్ల స్థలాలు, పరిశ్రమలకు అనుమతులిస్తూ ఉంటాడు.

అక్కడి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం కార్యాలయంలో విజిలెన్స్‌ డీఎస్పీ శరవణకుమార్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్‌వచ్చారిలోని వివేకానందనగర్‌లో సుబ్రమణియన్‌.. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసి ఓ రిటైర్డ్‌ అధికారిని నియమించుకున్నాడు. ఆయన కింద 37మంది సిబ్బందిని నియమించి లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. సోదాల్లో రూ.3 లక్షల 28 వేల నగదు స్వాధీనం చేసుకుని, సుబ్రమణియన్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు