అసమ్మతిపై హస్తం ముందుచూపు

8 Oct, 2023 03:32 IST|Sakshi

టికెట్ల ప్రకటన తర్వాత రచ్చ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు 

భంగపడిన వారిని బుజ్జగించేందుకు రంగంలోకి కాంగ్రెస్‌ దిగ్గజాలు

సాక్షి, హైదరాబాద్‌: టికెట్ల కేటాయింపు అనంతరం తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ అధిష్టానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నేపథ్యంలో టికెట్లు ప్రకటించిన తర్వాత ఎలాంటి అసమ్మతి ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పార్టీ దిగ్గజాలను రంగంలోకి దించనుంది. కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, అశోక్‌ చవాన్, సుశీల్‌కుమార్‌ షిండే తదితరులను ఇందుకోసం ఎంపిక చేసిందని, వీరంతా తొలి జాబితా వెలువడడానికి ముందే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. 

8 క్లస్టర్లుగా విభజన..
టికెట్ల ప్రకటన తర్వాత జాగ్రత్తలు తీసుకునేందుకు గాను రాష్ట్రాన్ని ఎనిమిది క్లస్టర్లుగా అధిష్టానం విభజించిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ప్రతి 15 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక డివిజన్‌ గా గుర్తించి, ఆయా డివిజన్లలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలతో ఏఐసీసీ దూతలు చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తారని సమాచారం. అభ్యర్థుల ఖరారుకు ఎంపిక చేసుకున్న ప్రాతిపదికలు, సామా జిక సమీకరణలను వారికి ముఖ్య నేతలు వివరించి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తారని తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గ టికెట్‌ విషయంలో జరిగిన రచ్చను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే అధిష్టానం ఈ ఏర్పా ట్లు చేస్తోందని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.   
 

మరిన్ని వార్తలు