విదేశాలకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

17 Nov, 2018 13:26 IST|Sakshi
కావలి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో పట్టుబడిన రేషన్‌బియ్యం లారీ

నకిలీ వే బిల్లులతో కృష్ణపట్నం పోర్టుకు తరలింపు

నెలకు 40కుపైగా లారీలను తరలిస్తున్న టీడీపీ చోటా నేతలు

కావలి పోలీసులకు పట్టుబడిన చిలకలూరిపేట లారీ

కృష్ణాజిల్లా, కావలి: కృష్ణపట్నం పోర్టు మీదుగా విదేశాలకు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరుపేట మాఫియాకు చెందిన టర్బో లారీని కావలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కావలి వన్‌టౌన్‌ సీఐ ఎం.రోశయ్య, బిట్రగుంట ఎస్సై నాగభూషణం కోల్‌కత్తా– చెన్నై జాతీయరహదారిపై  కావలి రూరల్‌ మండలం గౌరవం టోల్‌ప్లాజా వద్ద వేకువ జామున 3 గంటల ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చిలకలూరిపేట నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఏపీ27టీటీ 2745 టర్బో లారీలో నకిలీ వే బిల్లులతో అక్రమంగా 27.5 టన్నుల రేషన్‌ బియ్యం తరలిస్తుండడాన్ని గుర్తించి పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ పాశం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. టోల్‌గేట్‌ కావలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కావడంతో లారీ, డ్రైవర్‌ను కావలి రూరల్‌ పోలీసులకు అప్పగించారు. కావలి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

రేషన్‌ బియ్యం మాఫియాగా మారిన టీడీపీ చోటా నేతలు
పోలీసుల విచారణలో కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా విదేశాలకు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మాఫియా వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కారుసూల గ్రామానికి చెందిన ఐలవరపు నాగేశ్వరరావు, నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సలిసం శ్రీనివాసరావు గ్రామస్థాయి టీడీపీ నాయకులు. వీరిద్దరూ కలిసి రేషన్‌బియ్యం అక్రమ తరలింపు వ్యాపారం సాగిస్తున్నట్లుగా సమాచారం. చిలకలూరిపేట నియోజకవర్గంలోని రేషన్‌షాపుల డీలర్ల నుంచి ప్రతి నెలా రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.12 వంతున కొనుగోలు చేసి 50కిలోల బస్తాల్లోకి మార్చి రహస్య ప్రదేశంలో డంపింగ్‌ చేస్తారు.

గతంలో బియ్యాన్ని టర్బో లారీలకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు లోడు చేసి కాకినాడు పోర్టుకు తరలించేవారు. పోర్టుకు బియ్యాన్ని తరలించగానే టీడీపీ చోటా నేతలకు కిలోకు రూ.19 చొప్పున నగదు అందుతుంది. ఈ లెక్కన లోడుకు రూ.4.75 లక్షల నుంచి రూ.5.70 లక్షల వరకు నగదు చేతికందుతున్నట్లు సమాచారం. ఇక పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యాన్ని తరలించే ముఠా కంటైనర్లలో లోడింగ్‌ చేసి ఓడల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఇలా నెలకు 40 నుంచి 50 టర్బో లారీల్లో రేషన్‌బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం.  నకిలీ వే బిల్లులతో టీడీపీ చోట నేతలు నెలకు   రూ.2 కోట్లకుపైగానే వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల కాకినాడు పోర్టుకు రేషన్‌ బియ్యం తరలించడం కుదరకపోవడంతో కృష్ణపట్నం పోర్టును కేంద్రంగా చేసుకుని రవాణా సాగిస్తున్నట్లుగా సమాచారం. కాగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట శాసనసభ్యుడే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు