తల్లిదండ్రుల జోలికెళ్తే...

13 May, 2018 14:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007కి కీలక సవరణలు చేసింది. తల్లిదండ్రుల(60 ఏళ్లపైబడిన వారిని)ను నిర్లక్ష్యం చేసినా లేక వేధించినా ఇది వరకు మూడు నెలల శిక్ష విధించేవారు. కానీ, తాజా ముసాయిదా చట్టం ప్రకారం దానిని ఆరు నెలలకు మార్చారు. 

అంతేకాదు తల్లిదండ్రులకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నెల రోజుల శిక్ష విధించేలా సవరణలు చేశారు. ఈ మేరకు ట్రిబ్యూనల్స్‌కు అధికారాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. గతేడాది ఓ సర్వేలో వెల్లవైన వివరాల ప్రకారం.. 44 శాతం మంది వృద్ధులు తమ పిల్లలు తమ పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. దుర్భషలాడటం, చెయ్యి చేసుకోవటం లాంటి పరిణామాలు ఎదురయ్యాయని చాలా మంది తెలిపారు. దీంతో ఈ సర్వేను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.

దీంతోపాటు దత్తత తీసుకున్న వారిని, అలుళ్లు, కోడళ్లు, మనవళ్లు-మునిమనవరాళ్లను కూడా వారసుల జాబితా పరిధిలోకి తీసుకురానుంది.ఈ చట్టం అమలులోకి వస్తే గనుక నిస్సహయులైన వృద్ధులకు వారి వారి వారసులు రూ.10 వేల నెలనెలా భరణంగా చెల్లించటం తప్పనిసరి అవుతుంది.

మరిన్ని వార్తలు