అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు గాయాలు!

12 Nov, 2023 08:18 IST|Sakshi

సాక్షి, అచ్చంపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరోవైపు, ఎన్నికల సందర్బంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. అనంతరం, పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు. 

వివరాల ప్రకారం.. అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్‌ గేట్‌ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు ఆపకపోవటంతో వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేటలోని అంబేడ్కర్‌ కూడలిలో అడ్డుకొని  వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఇక, ఈ రాళ్ల దాడిలో కొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరనన తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, కాంగ్రెస్‌ కార్యకర్తలు తనపై దాడికి చేశారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. 

మరోవైపు.. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ స్పందిస్తూ.. వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారమిచ్చినా అడ్డుకోలేదన్నారు. డబ్బున్న సంచులు పట్టించినా ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు పోలీసులే ప్రత్యేక సెక్యూరిటీ ఇస్తున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు