అత్యాశకు పోయి దొరికిపోయాడు

13 Apr, 2019 06:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, చిత్రంలో సీఐ సుబాష్‌ చంద్రబోస్‌

మామకు ఇవ్వాల్సిన రూ.50 లక్షలపై కన్నేసిన అల్లుడు

స్నేహితుల సాయంతో డబ్బు కాజేసిన వైనం

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు నిందితుల అరెస్ట్‌

నాంపల్లి: మామకు ఇవ్వాల్సిన డబ్బులు కాజేసిన  అల్లుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుల నుంచి రూ.46.30 లక్షల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 6 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. క్రాంతిలాల్‌ అనే వ్యక్తి వృత్తిరీత్యా హోల్‌సేల్‌ బట్టల వ్యాపారి. బెంగళూర్‌ కేంద్రంగా హైదరాబాద్‌కు బట్టలు సరఫరా చేస్తుంటాడు.హైదరాబాద్‌లో ఉండే అర్జున్‌సింగ్‌ బట్టలను దుకాణాలకు తరలించి డబ్బులు వసూలు చేసి తన మామయ్య అయిన క్రాంతిలాల్‌కు ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల వసూలు చేసిన రూ.50 లక్షలు క్రాంతిలాల్‌కు ఇవ్వాల్సి ఉంది. అయితే అర్జున్‌సింగ్‌ అత్యాశతో రూ.50 లక్షలు కాజేయాలని పథకం వేశాడు. బెంగళూర్‌లో ఉండే క్రాంతిలాల్‌కు ఫోన్‌చేసి డబ్బులు తీసుకెళ్లాలని ఫోన్‌ చేశాడు.

తాను హైదరాబాద్‌ రావడం కుదరదని, తన గుమస్తా శంకర్‌ను పంపిస్తాను డబ్బులు ఇచ్చి పంపాలని అర్జున్‌కు సూచించాడు. ఈ నెల 7న హైదరాబాద్‌కు వచ్చిన శంకర్‌కు డబ్బుల బ్యాగ్‌ను అందజేశాడు. పథకం ప్రకారం డబ్బులు లాక్కోవాలన్న ప్లాన్‌తో తన స్నేహితులు ఉమీద్, భావన్, ప్రవీణ్, విక్రమ్‌లను రంగంలోకి దించాడు. డబ్బుతో బెంగళూరు వెళ్లాల్సిన శంకర్‌కు నాంపల్లిలోని ఓ ట్రావెల్స్‌ బస్సులో వెళ్లేందుకు టికెట్‌ను తీయించారు. అర్జున్‌సింగ్‌తో పాటు మిగతా నలుగురు శంకర్‌ను ఫాలో అయ్యారు. తాము పోలీసులమని శంకర్‌కు చెప్పి బ్యాగులో ఏముందో చూపించాలనీ ఎన్నికల సమయంలో తనిఖీలు చేస్తున్నామంటూ చెప్పి శంకర్‌ చేతిలోని డబ్బున్న బ్యాగును తీసుకెళ్లారు.  ఘటనపై బాధితుడు క్రాంతిలాల్‌ నాంపల్లి పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. సూత్రదారి అర్జున్‌సింగ్‌ అని తేలింది.  దీంతో ఐదుగురు నిందితులను, అర్జున్‌ సింగ్‌ను పోలీసులు  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు