ఎన్‌ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు

12 Jan, 2019 03:52 IST|Sakshi
నిందితుడు శ్రీనివాసరావును విజయవాడలోని కోర్టుకు తీసుకువస్తున్న పోలీసులు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో వారం రోజులపాటు కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి

నేడు హైదరాబాద్‌ కార్యాలయానికి తరలించనున్న అధికారులు!

సాక్షి, అమరావతిబ్యూరో/విజయవాడ లీగల్‌/ ఆరిలోవ (విశాఖతూర్పు):  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకోనున్న ఎన్‌ఐఏ అధికారులు విచారణ నిమిత్తం హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించనున్నట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాల మేరకు జగన్‌పై హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావును తమకు అప్పగించమని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత  నిందితుడిని విశాఖ జైలు నుంచి భారీ బందోబస్తు నడుమ విజయవాడ తీసుకువచ్చి శుక్రవారం పూర్తి అదనపు ఇన్‌చార్జి నగర మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి అచ్యుత పార్థసారథి ఎదుట హాజరుపరచగా ఈ నెల 25 వరకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రిమాండ్‌ అనంతరం నిందితుడిని జిల్లా జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించమని కోరుతూ ఎన్‌ఐఏ చీఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారి ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితుడి తరఫున న్యాయవాదులు హాజరు కాకపోవడంతో అధికారులు నిందితుడికి కస్టడీ పిటిషన్‌ కాపీ ప్రతులను అందజేశారు. తనను విచారించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, లాయర్‌ సమక్షంలో విచారించమని నిందితుడు న్యాయమూర్తిని  కోరాడు. దీంతో శ్రీనివాసరావును వారం రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శనివారం  ఉదయం 10 గంటలకు జిల్లా జైలు నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం నేరుగా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలిసింది. అక్కడే వారం రోజులపాటు ఉంచి విచారణ చేపడతారని సమాచారం

మరిన్ని వార్తలు