ముంబైలో విషాదం: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట..!

29 Sep, 2017 17:00 IST|Sakshi

సాక్షి, ముంబై : ముంబైలోని స్థానిక రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ఎల్ఫిన్‌స్టోన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాట ఘటనలో 22 మంది మృతిచెందగా.. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జీఆర్‌పీ కమిషనర్ నికెట్ కౌశిక్ తెలిపారు. శుక్రవారం ఉదయం దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. సాధారణంగానే స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో ఉన్న ఈ స్టేషన్‌కు శుక్రవారం భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చారు.

అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇరుకుగా ఉండటమూ తొక్కిసలాటకు ఓ కారణంగా తెలుస్తోంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు