సెక్స్‌ రాకెట్‌ వెనుక టీడీపీ పెద్దలు

23 Jun, 2018 10:39 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన నిందితురాలు శోభారాణి

నిందితులతో  టీడీపీ పెద్దలకు సన్నిహిత సంబంధాలు

కేసు నీరుగార్చేందుకు ఒత్తిడి

విజయవాడ జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌ కేసులో నిందితులకు అండగా టీడీపీ పెద్దలు ఉన్నట్లు బట్టబయలైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితురాలు శోభారాణితో మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు, ఇతర నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం బహిర్గతమైంది. 

విజయవాడ : నగరంలోని జక్కంపూడి  కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే  పోలీసులు సెక్స్‌ రాకెట్‌ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే  విమర్శలొస్తున్నాయి.  అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి  ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం పట్ల కూడా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు సూత్రధారులకు రక్షా కవచం..
అసలు సూత్రదారులు అయిన టీడీపీ నేతలలకు పోలీసులు రక్ష కవచంగా నిలిచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెక్స్‌ రాకెట్‌ బట్టబయలవటంతో  అనివార్యంగా పోలీసులు శోభారాణిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు.  జిల్లా ముఖ్యనేత ఒత్తిడితో ఈ కేసులో పోలీసులు వెనుకడుగ వేసినట్లు బహిరంగంగా ప్రజానీకం పోలీసు అధికారుల వద్దే ఆరోపించటం గమనార్హం.  ఈ బహిరంగ విచారణకు వెళ్లిన జాయింట్‌ సీపీ కాంతి రాణా టాటాకు కూడా కొందరు స్థానికులు నిందితులకు రక్షణగా టీడీపీ నేతలు ఉన్నారని ఫిర్యాదు చేశారు. 

లైంగిక వేధింపుల కేసులో  నిందితులు అరెస్టు...
వైస్సార్‌ కాలనీలో ఓ యువతి ఇచ్చిన పిర్యాదుపై లోతైన విచారణ చేయటానికి సీపీ గౌతం సవాంగ్, జాయింట్‌ సీపీ కాంతిరాణా టాటాను నియమించారు. దాంతో ఆయన  శుక్రవారం జక్కంపూడి కాలనీకి వెళ్లి బహిరంగంగా విచారణ జరిపారు. ఈ విచారణలో శోభారాణి ప్రవర్తనపై స్థానికులు పిర్యాదు చేశారు. గతంలో శోభారాణిపై తాము టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసు అధికారులు పట్టించుకోలేదని జాయింట్‌ సీపీకి చెప్పారు. దీంతో ఆయన స్థానికులతో మాట్లాడుతూ విచారణ జరిపి  సంబందిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం  జాయింట్‌ సీపీ  బాధితురాలి నుంచి వాంగ్మూలం  తీసుకున్నారు. ఆమెకు  వైద్యపరీక్షలు జరిపించి పునరావాసకేంద్రానికి తరలించారు.  ఈ సందర్భంగా జాయింట్‌ సీపీ ఓ ప్రకటన విడుదల చేస్తూ మహిళ ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఆటో డ్రైవర్‌  సతీష్, శోభారాణిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేసి కేసును మాఫీ చేయటానికి ప్రయత్నించిన వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు గైకొంటామన్నారు.

మరిన్ని వార్తలు