పోలీసులకే దిమ్మతిరిగే దొంగతనం

25 Jan, 2018 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అతి తెలివి తేటలతో దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డట్లు వారి పనైంది. సాధారణంగా దొంగలు పెట్రోల్‌ చోరికి పాల్పడటం అరుదు. అలాంటివి జరిగినా ఏ బైక్‌ల నుంచో లేదంటే ఎవరూ లేని సమయంలో బంక్‌ల నుంచో దొంగతనం చేసిన సందర్బాలుంటాయి. కానీ, ఢిల్లీలో మాత్రం కొందరు దొంగలు ఏకంగా భూగర్భాన వెళుతున్న అతిపెద్ద పెట్రోల్‌ పైపు నుంచి పెట్రోల్‌ తోడేద్దామనుకున్నారు. చిన్నసొరంగంలాంటిదాన్ని తవ్వి పైపుకు కన్నం చేసి ఆయిల్‌ తీసే క్రమంలో కాస్త బాంబు పేలుడిలాంటి శబ్దంతో బద్దలైంది. వారి గుట్టుచప్పుడుకాకుండా చేద్దామనుకున్న పనికాస్త రట్టయింది.

వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలోని కక్రోలాలో జూబీర్‌ అనే వ్యక్తి అయిల్‌ దొంగతరం చేయడానికి కొంతమందితో కలిసి ప్లాన్‌ చేసుకున్నాడు. ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌) కు చెందిన అండర్‌ గ్రౌండ్‌ పైపు లైన్‌ను తమ దొంగతనానికి ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఓ గది తీసుకొని అందులో నుంచి పైపులైన్‌కు సొరంగం లాంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయిల్‌ పైప్‌ లైన్‌కు గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పెట్రోలు దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే, ఇది పెద్ద పైపులైన్‌ కావడం, అందులో నుంచి తీవ్ర ఘాడత గల వాయువులు బయటకు రావడంవంటివి జరుగుతున్న క్రమంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటన జరగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం అర్థమైంది. అలాగే, దానికి దగ్గర్లో కొంత మేర ఇంధనం నింపిన ట్రక్‌ని కూడా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు