స్వర్ణముఖినదిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

6 Nov, 2017 01:58 IST|Sakshi

నదీ ప్రవాహం చూసేందుకు వెళ్లి.. 

ఇసుక గుంతలో మునిగిన వైనం

నాయుడుపేటటౌన్‌: స్వర్ణముఖినదిలో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి.. ఇసుక కోసం తవ్విన భారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడునగర్, బేరిపేట, కుమ్మరివీధికి చెందిన మూడో తరగతి విద్యార్థిని తుమ్మూరు మల్లీశ్వరి(8), రెండో తరగతి చదువుతున్న కలపాటి విలియమ్‌ అగస్టస్‌ అలియాస్‌ జాకా (7)తోపాటు అదే ప్రాంతానికి చెందిన వారి స్నేహితులు మన్విత, దాదాఖలందర్‌ మరో బాలుడితో కలిసి స్వర్ణముఖినది వద్దకు వెళ్లారు. నదిలో కొద్దిమేరకు నీరు ప్రవహిస్తుండటంతో ఐదుగురు కలిసి నదిలో నడిచి కొద్దిదూరం వెళ్లారు.

రెవెన్యూ కార్యాలయం సమీపంలో స్వర్ణముఖి నదిలో భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టిన తర్వాత పెద్ద గుంత ఏర్పడి ఉండటంతో అందులో పడిపోయారు. వీరిలో ఇద్దరు పిల్లలు బయటపడి అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్లిపోయారు. ముగ్గురు నీటి గుంతలో మునిగిపోతూ పెద్దఎత్తున కేకలు పెట్టారు. దీంతో సమీపంలో ఓ చోట కూర్చొని ఉన్న యువకులు గమనించి మన్విత అనే బాలికను కాపాడారు. మరో ఇద్దరు చిన్నారులు మల్లీశ్వరి (8), విలియమ్‌ అగస్టస్‌ (7)గుంతలో మునిగి మృతిచెందారు.అనుకోని  విషాదాన్ని నింపిన ఈ సంఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈసమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు