ఉత్సవాలకు వెళుతుండగా విషాదం

31 Mar, 2018 11:25 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

ప్రమాదంలో ఎనిమిది నెలల చిన్నారి,62 ఏళ్ల వృద్ధుడు మృతి..

నిలిపిఉంచిన లారీని  కారు ఢీకొనడంతో ప్రమాదం

సేలం: కుటుంబంతో సహా పళణిలో పంగుణి ఉత్తర ఉత్సవాల్లో పాల్గొనేందుకు కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. నిలిపిఉంచిన లారీని కారు ఢీకొనడంతో కారులో ఉన్న 62 ఏళ్ల వృద్ధుడు, ఎనిమిది నెలల చిన్నారి దుర్మరణం చెందారు. సేలం సమీపంలోని అయోధ్య పట్టణం ప్రాంతానికి చెందిన పెరుమాల్‌ (62). అతని భార్య, పి ల్లలు, కుటుంబీకులు మొత్తం 11 మంది కారులో పళణిలో పంగుణి ఉత్తర ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం వేకువజామున బయలుదేరారు. కారును డ్రైవర్‌ కలైమణి (21) నడిపాడు.

కారు వేకువజామున 3.30 గంటలకు సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై కాలిపట్టి డివైడర్‌ రోడ్డులో వెళుతుండగా అకస్మాత్తుగా రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని వెనుక వైపు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో పెరుమాల్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది కుటుంబీకులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎనిమిది నెలల చిన్నారి రక్షిత మృతి చెందింది. సమాచారం అందుకున్న మగుడంచావడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పెరుమాల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో మూడు గంటల పాటు ట్రాఫిక్‌  స్తంభించింది. 

మరిన్ని వార్తలు