జీవితాలను కల్తీ చేసిన కాలం

30 Sep, 2015 00:44 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు

 డేట్‌లైన్ హైదరాబాద్
 
సోమవారం నాటి ‘సాక్షి’ దినపత్రిక లోపలి పేజీలలో ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ శీర్షికన ప్రచురించిన వార్తలోనే ఆసక్తి కలిగించే మరో చిన్నవార్త గుండ్రటి బాక్స్‌లో కనిపిస్తుంది. ఆ బాక్స్ ఐటమ్ సారాంశం ఏమిటంటే పది రోజులపాటు కల్తీకల్ల్లు బాధితులతో కిటకిటలాడిన మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల్ల మండలం బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆదివారం తాకిడి తగ్గింది అని.

తిరగబడ్డ వాస్తవం
రోగులు రాకపోతే, రోగాలు తగ్గుముఖం పడితే అదో వార్త కావాలి. ఆస్ప త్రులు ఖాళీగా ఉంటే జనమంతా సంతోషించాలి. కానీ ఇక్కడ అది పూర్తిగా తిరగబడింది. అదే వార్తలో ఇంకా కొంచెం ముందుకుపోయి చదివితే,  కల్తీ కల్లు బాధితుడు ఒక్కరు కూడా ఆదివారం ఆస్పత్రిలో చేరలేదు అని ఉంటుం ది. అంతకుముందు పదిరోజులపాటు ఇదే ఆస్పత్రిలో 13 మంది కల్తీకల్లు  బాధితులు చనిపోయారు. మరో వందమంది దాకా చికిత్స తీసుకున్నారు. వింతచేష్టలు, మరణాలతో అట్టుడికిన ఆస్పత్రి ప్రాంగణం ఆదివారం ప్రశాం తంగా కనిపించడంతో డాక్టర్లు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ చివరి వాక్యం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ వాక్యం గురించే ఇప్పుడు చర్చించుకోవాలి. బాధపడాలి, ఆందోళన చెయ్యాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఇంతకీ ఆ వాక్యం అంతరార్థం ఏమిటి? మత్తు కలిపిన కల్లు, అంటే కల్తీకల్లు మళ్లీ దొరుకుతున్నందు వల్లనే బాధితులు తగ్గిపోయారనే.

కల్తీ కడుపులో పడక చావులా?
గత పక్షంరోజులలో తెలంగాణలో చాలా జిల్లాల నుంచి ఇటువంటి వార్తలు వరసగా ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఇందులో వింతేముంది అని ఎవరైనా అనుకోవచ్చు. మామూలుగా మనం ఏమనుకుంటాం? కల్తీకల్లు, కల్తీ సారా తాగేవాళ్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. దానితో చనిపోతారనే కదా! కల్తీ జరిగిన ఆహారం తింటే మనుషులూ, కల్తీమందులు చల్లితే చెట్లూ, పంటలూ కూడా చనిపోతాయని కదా మన అవగాహన. ఇలాంటి సర్వ సామాన్యమైన మన అవగాహన ఈ సందర్భంలో దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు తెలం గాణలో జరుగుతున్న తంతు ఏమిటంటే జనం కడుపులోకి కల్తీ వెళ్లక అనా రోగ్యం పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. ఏమిటీ విచిత్రం?

‘ఆగని కల్తీకల్లు మరణాలు’ అని వార్తలకు శీర్షికలు ఉంటాయి. సామాన్యులు ఇది చూసి ఏం అర్థం చేసుకుంటారు? ఓహో! కల్తీకల్లు తాగడం వల్లనే జనం చని పోతున్నట్టున్నారు అని కదా అనుకుంటారు. అయినా కల్తీకల్లును నిరోధించ కుండా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈ బాగోతం చూస్తూ కూర్చోడానికేనా ఓట్లేసి గెలిపించింది? అని తిట్టుకుంటారు కూడా. పాపం, ఈ ఉదంతంలో ప్రభుత్వాన్ని నిందించవద్దండీ! ఈ మరణాలూ, అనారోగ్యాలూ కల్తీకల్లు  తాగినందువల్ల కాదు, తాగడానికి ఆ కల్తీకల్లు అందుబాటులో లేనందువల్ల. ఈ వ్యాసం ఆరంభంలో బాదేపల్లి ఆస్పత్రి ప్రస్తావన తెచ్చింది అందుకే.

కల్తీ కల్లును అడ్డుకునేందుకు మన ఆబ్కారీ శాఖ గత కొద్దిరోజులుగా నడుం బిగించి, దాడులు చేసి ఎక్కడికక్కడ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఏళ్ల తరబడి ఆ మత్తుకు బానిసలైనవాళ్లు తీవ్రమైన ఇబ్బందులలో పడిపోయారు. అది దొరక్క అనారోగ్యం పాలై, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఆస్పత్రుల పాలవుతు న్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు కూడా. కల్తీకల్లు ప్రవాహం మీద విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే కల్తీ ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించవలసిందే. కల్తీ ఆహారం, కల్తీ మద్యం, కల్తీ పురుగుల మందులు, కల్తీ ఎరువులు వైగైరా వైగైరా. అన్ని కల్తీలతో పాటు కల్తీ రాజకీయాలను కూడా.  మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీకల్లును అరికట్టేందుకు నడుం బిగించిన ఆబ్కారీ శాఖ సంకల్పం ఏమై నట్టు? మళ్లీ కల్తీకల్లు దొరుకుతున్నందు వల్లనే బాదేపల్లి ఆస్పత్రికి రోగులు రావడం లేదన్న వార్త

అంతరార్థం ఏమిటి?
ఆకస్మిక నిర్ణయాలతో వచ్చిన తంటా  ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం! ఆలోచనారహితమైన, లోపభూయిష్టమైన, ఆకస్మికమైన ప్రభుత్వ నిర్ణయాలు చే టు చేస్తాయని తెలంగాణ  రాష్ర్టంలో మద్యపానం వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు గొప్ప ఉదాహరణగా మిగులుతాయి. ప్రస్తుతం తెలంగాణలో కల్తీకల్లు అందుబాటులో లేక సంభవిస్తున్న మరణాలు, రోగా లతో జనం ఆస్పత్రుల పాలు కావడానికి గల నేపథ్యాన్ని గురించి మాట్లాడు కుంటే ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే జవాబుదారీ అవుతుందని అంతా అంగీకరిస్తారు.

తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యం విషయంలో అనుసరిస్తున్న ధోరణి ఇప్పటి గందరగోళానికి కారణం. అధికా రంలోకి రాగానే కల్లు విధానం ప్రకటించారు. హైదరాబాద్‌లో కల్లు అమ్మ కాలను అనుమతించాలని నిర్ణయించారు. అసలు చుట్టుపక్కల తాడిచెట్లు, ఈతచెట్లు లేనిచోట కల్లు దుకాణాలు తెరిస్తే అక్కడ అమ్మేది కల్తీకల్లే మహా ప్రభో అంటే, మన సర్కార్ కొట్టిపారేసింది. ఇప్పటికే చాలా గ్రామాలలో తాటివనాలు అంతరించిపోయాయి. ఆ వృత్తి మీద జీవిస్తున్న సామాజిక వర్గంలోని తరువాతి తరం చదువుల వైపు చూస్తున్నది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అన్వేషిస్తున్నది. సరైన ఆధారం లేని ప్రమాదకరమయిన ఆ వృత్తిలో ఉండటానికి ఇప్పటితరం అంగీకరించడం లేదు.

అయినా సరే, కల్లు డిపోలూ, దుకాణాల తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కల్తీకల్లు విక్రయాలు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే జరుగుతున్నాయి. ఈ కల్తీకల్లు  తాగడం వల్ల ఎప్పుడో అప్పుడు మనుషులు తీవ్ర అనారోగ్యం పాలై, చివరికి చనిపోవడం ఖాయం. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇది విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.

ఒత్తిడితోనే సర్కారు వెనక్కి తగ్గిందా?
ఇప్పుడు దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం కదా, మళ్లీ విమర్శి స్తారెందుకు అని  ఘనత వహించిన మన సర్కారు వారు దబాయించవచ్చు. ఇప్పుడు ఈ కల్తీకల్లు మీద ఎందుకు విరుచుకుపడ్డట్టు? జనం చనిపోవడం మొదలు కావడంతో మళ్లీ కొంతకాలం చూసీచూడనట్టు వ్యవహరించాలని ఎందుకు అనుకుంటున్నట్టు? ఈ తదుపరి నిర్ణయం ఎవరి స్థాయిలో జరి గిందో కానీ కల్తీకల్లు తయారీదారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం తన సంకల్పం నుంచి వెనక్కు తగ్గిందని మాత్రం ప్రైవేటుగా ఏ అధికారిని అడిగినా చెబు తాడు. సరే, కల్తీకల్లును  అరికట్టాలన్న నిర్ణయం వెనక మతలబు ముందు  తెలుసుకుందాం.

చీప్‌లిక్కర్  ప్రత్నామ్నాయం కారాదు
తెలంగాణ  రాష్ర్టంలో కల్తీకల్లు, సారాయి, గుడుంబా వంటి ప్రాణాంతక మత్తుపానీయాలను అరికట్టడం కోసం చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని అను కుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక టన చేశారు. చీప్‌లిక్కర్ పేరిట జనాన్ని మరింత వ్యసనపరులను చేస్తారా అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విరుచుకుపడటంతో ఆ నిర్ణ యం వెనక్కు తీసుకున్నారు. కల్తీ మద్యం బారి నుంచి జనాన్ని కాపాడటానికి మేం చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనుకుంటే అడ్డుతగులుతారా, మీరే చూడండి ఫలితాలు ఎట్లా ఉంటాయో? అని కల్తీకల్లు మీద దాడులు మొదలు పెట్టిం చింది ప్రభుత్వం. ఎప్పటికైనా ఈ మహమ్మారిని పారద్రోలాల్సిందే కాబట్టి జన బాహుళ్యం దీన్ని సమర్ధిస్తున్నది. కానీ ప్రభుత్వం ఈ చర్య తీసుకో వడానికి ముందు కల్తీకల్లుకు బానిసలైన వారిని బయటకు తీసుకువచ్చి, వాళ్ల ప్రాణాలు  రక్షించడానికి అవసరమైన కార్యాచరణను ముందే రూపొందించి అమలులోకి తెచ్చి ఉంటేఅందరి ప్రశంసలు అందుకునేది. కానీ ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది.

ఇంకా ఎన్ని వైపరీత్యాలు చూడాలో!
మద్యం అలవాటు మాన్పించడం కోసం అవసరమైనన్ని డీ అడిక్షన్ కేంద్రా లను నెలకొల్పవలసిందని న్యాయస్థానాలు ముందే చెప్పాయి. అటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా, అవసరమయిన మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోకుండా, సరైన వైద్య సదుపాయాలు కల్పించకుండా, కల్తీకల్లు  మీద ఒక్కసారిగా విరుచుకుపడితే ఇటువంటి ఫలితాలే ఎదురవుతాయి. కల్తీ మద్యానికి చీప్‌లిక్కర్ ప్రత్యామ్నాయం కాకూడదు. జనాన్ని ఆ దుర్వ్యసనం నుంచి బయటకు తీసుకువచ్చి వారి ఆరోగ్యాలు బాగుచేసే పథకాలు  ప్రభుత్వం రూపొందిస్తే అంతా సంతోషిస్తారు. అది సాధ్యమేనా? రాష్ర్టం నడపడానికి నిధుల కోసం సాగే వేటలో మద్యం ఒక ప్రధాన వనరుగా ఉన్నం తకాలం ఏ ప్రభుత్వానికైనా సాధ్యంకాదు. ప్రభుత్వాలు ఈ సాలెగూడు నుం చి  బయటపడే వరకు ఇంకా ఎన్నో వైపరీత్యాలను మనం చూడవలసిందే.
 
 - దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు