కోరి తెచ్చుకున్న కొరివి?

22 Nov, 2023 04:43 IST|Sakshi

ఎన్నికలు, ఫలితాలనేవి ఉద్వేగాలను రేపడం సహజం. అయితే, కొన్ని ఎన్నికలు, కొందరి ఎంపికలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. అనుమానాలతో పాటు ఆందోళనలూ రేపుతాయి. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా ఛాందసవాద జేవియర్‌ మిలీ తాజా ఎన్నిక అలాంటిదే. ఓట్ల లెక్కింపులో మిలీ 56 శాతం ఓట్లు సాధిస్తే, అధికార పక్షమైన పెరోనిస్ట్‌ ప్రభుత్వ ఆర్థిక మంత్రి సెర్జియో మస్సాకు 44 శాతం ఓట్లే వచ్చాయి. వర్తమాన అర్జెంటీనా రాజకీయ వ్యవస్థపై నెలకొన్న ప్రజాగ్రహానికి, ‘సరికొత్త రాజకీయ శకం’ తీసుకువస్తానన్న వాగ్దానం తోడై సృష్టించిన ప్రభంజనంలో మిలీ విజయతీరాలకు చేరారు.

అయితే, ఆయన విజయం అర్జెంటీనాలోని ప్రతిపక్షాల్లోనే కాదు... అంతర్జాతీయంగానూ ఆందోళన రేపుతోంది. కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భావిస్తున్నారు. నలభై ఏళ్ళుగా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న దక్షిణ అమెరికా దేశాన్ని కొత్త అధ్య క్షుడు మళ్ళీ వెనక్కి నడిపిస్తారనే భయం నెలకొంది. అదెలా ఉన్నా... అర్జెంటీనా దౌత్య సంబంధాలు, ఆర్థిక భవితవ్యం, ఆ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. 

నాలుగున్నర కోట్ల జనాభా గల అర్జెంటీనాలో నవంబర్‌ 19న జరిగిన ఎన్నికలు, ఫలితాలు ఇంతగా చర్చనీయాంశమైంది అందుకే. ఎన్నికల్లో మిలీకి పట్టం కట్టినమాట నిజమే అయినా, అంత మాత్రాన అర్జెంటీనా ప్రజలందరూ ఆయన భావజాలంతో ఏకీభవిస్తున్నట్టు అనుకోలేం. దశాబ్దాల నిర్వహణ లోపాలు, అవినీతితో ఆ దేశం దీర్ఘకాలంగా ఆర్థిక కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ప్రపంచస్థాయిలోనే ఎక్కువగా ద్రవ్యోల్బణం 150 శాతానికి దగ్గరలో ఉంది. దారిద్య్రం పెరుగుతోంది.

దేశంలో నూటికి 40 మందికి పైగా దారిద్య్రంలో మగ్గు తున్నారు. అధికార కరెన్సీ పెసో విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. మూడేళ్ళ క్రితం కరోనా రావడానికి ముందు దాకా 80 పెసోలు ఒక డాలరైతే, ఇవాళ వెయ్యి పెసోలైతే కానీ ఒక డాలర్‌కు సమానం కాని దుఃస్థితి. ఈ ఆర్థిక కష్టాలకు రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా వామపక్షాలు కారణమని మిలీ ఆరోపణ. ఆ ఆరోపణల్ని అధికారపక్ష అభ్యర్థి సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. ఎలాగైనా సరే జీవన పరిస్థితుల్లో మార్పు రావాలని తహతహలాడుతున్న జనం మిలీతో ఏకీభావం లేకున్నా ఆయనకే ఓటేశారు. అందుకే, ఈ ఎన్నిక ‘‘నిరసన ఓటు’’ ఫలితమని నిపుణుల మాట. 

ఆర్థిక నిపుణుడు, మాజీ టీవీ ప్రముఖుడు, తాంత్రిక సెక్స్‌ కోచ్‌ 53 ఏళ్ళ జేవియర్‌ మిలీకి నిజా నికి రాజకీయ అనుభవం లేదు. కానీ, ప్రజలకు ఆయన బాసలు కోటలు దాటాయి. పన్నులు తగ్గిస్తా ననీ, అర్జెంటీనా కేంద్ర బ్యాంకును రద్దు చేస్తాననీ, దేశ కరెన్సీ పెసో స్థానంలో అమెరికా డాలర్‌ను తెస్తాననీ అన్నారు. గర్భస్రావంపై నిషేధం ఎత్తేస్తానన్నారు. కారుణ్య మరణాల్ని వ్యతిరేకించారు. తుపాకులపై నియంత్రణల్ని సడలిస్తానన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ‘సామ్యవాదంపై పోరాటం’ చేయదలచిన దేశాలే అర్జెంటీనాకు మిత్రపక్షాలంటూ తన భావజాలాన్ని కుండబద్దలు కొట్టారు.

అసలే కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆయన అధ్యక్షత మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని వందమందికి పైగా ప్రముఖ ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. పైగా, అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యదేశాలైన బ్రెజిల్, చైనా, అమెరికా, చిలీ నేతల్ని మిలీ దుమ్మెత్తిపోశారు. ఇక, సర్కారు వద్దే డాలర్లు లేని వేళ దేశ కరెన్సీ స్థానంలో డాలర్లను ప్రవేశపెడతాననడం ఆచరణ సాధ్యం కాని పని. ఏ కొద్దిగా ప్రయత్నించినా అది మరో సంక్షోభానికి తెర తీస్తుంది. 

అర్జెంటీనా సంగతి అటుంచితే, మిలీ విజయవార్త మిగతా ప్రపంచానికీ శుభవార్తేమీ కాదు. అందుకు అనేక కారణాలు. టీవీ ప్రముఖుడిగా తెచ్చుకున్న పేరును ఆయన రాజకీయాల్లో మదుపు పెట్టారు. రెచ్చగొట్టే మాటలు, మితిమీరిన హావభావ విన్యాసాలతో ముందుకు సాగుతున్నారు.  సుమారు అయిదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఈ స్వేచ్ఛావాది ప్రపంచ వాతావరణ మార్పు ఓ పెద్ద సామ్యవాద అబద్ధం అంటారు.  ప్రపంచవ్యాప్తంగా అతివాదులకు నచ్చే ఆ మాటల్ని ఐరోపా లాంటివి స్వాగతిస్తున్నాయి.

విజేత మిలీని తక్షణం అభినందించిన వారి జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో తదితరులు ఉండడం గమనార్హం. అమెరికాలో ట్రంప్‌ హయాంలో, బ్రెజిల్‌లో బొల్సొనారో ఏలుబడిలో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే, చూసినదే. మరి, స్నేహితుల్ని బట్టి స్వభావం తెలుస్తుందన్న దాన్ని బట్టి రానున్న రోజుల్లో మిలీ ఎలాంటి పోకడలు పోగలరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలతో నిత్యం పోరాడే అధ్యక్షుడి వల్ల అర్జెంటీనా ప్రజాస్వామ్యం మరింత బలహీనపడే ముప్పుంది.

ఎన్నికల ప్రచార సమయంలో రంపం చేతబట్టి, ఖర్చునూ, కష్టాల్నీ కోసేస్తానని మిలీ చెబుతూ వచ్చారు. విజయోత్సవ ప్రసంగంలోనూ దేశంలో ‘అంచెలంచెలుగా కాక సమూలంగా మార్పు తెస్తా’నని వాగ్దానం చేశారు. అనుభవమే కాదు... భావోద్వేగాలపై అదుపు కానీ, పార్లమెంట్‌లో మెజారిటీ కానీ లేని మిలీ ఏం చేయగలుగుతారు, ఎంతకాలం నిలబడగలుగుతారన్నది సందేహమే! కొద్దికాలమే పదవిలో ఉన్నా దేశానికి నష్టం భారీగా ఉండవచ్చని పలువురి భయం.

అసలు అర్జెంటీనాలో ప్రజాస్వామ్యం బీటలు వారుతోందని ఇప్పటికి మూడేళ్ళుగా అమెరికా, బ్రెజిల్‌ హెచ్చరిస్తూనే ఉన్నాయి. మిలీ హయాంలో ఆ భయాలన్నీ నిజమైతే, ఆ దేశానికి అంతకన్నా విషాదం మరొ కటి ఉండదు. మాటల్లో, చేష్టల్లో ట్రంప్‌కు తీసిపోని మిలీని అంతా ‘ఎల్‌లోకో’ (పిచ్చివాడు) అంటుంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పక్కకుపోయి, అధికారం పిచ్చోడి చేతిలో రాయిగా మారితే కష్టమే! కారణాలేమైనా ఇది మెజారిటీ అర్జెంటీనా పౌరులు కోరి తెచ్చుకున్న కొరివి!! 

మరిన్ని వార్తలు