వలసజీవుల బలిదానం

9 May, 2020 00:23 IST|Sakshi

సమాజంలో పుట్టుకొచ్చే ప్రతి సంక్షోభానికి మొదటగా బలయ్యేదీ, ఆ భారాన్ని చివరంటా మోయక తప్పని స్థితిలో పడేదీ అట్టడుగు నిరుపేద వర్గాలే. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనడానికి 45  రోజులక్రితం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ప్రతిరోజూ దీన్ని నిరూపిస్తోంది. వలసజీవులు పడుతున్న ఈ కష్టాలకు మహారాష్ట్రలోని నాందేడ్‌ డివిజన్‌లో జల్నా–ఔరంగాబాద్‌ల మధ్య రైల్వే పట్టాలపై శుక్రవారం 17 మంది వలస కూలీలు మరణించిన ఉదంతం పరాకాష్ట అని చెప్పాలి. 

మహారాష్ట్రలోని జల్నా నుంచి 850 కిలోమీటర్ల దూరంలోని మధ్యప్రదేశ్‌లో వున్న తమ స్వస్థలానికి పోయేందుకు బయల్దేరిన ఈ వలసకూలీలంతా మార్గమధ్యంలో అలసి, విశ్రమించడానికి రైల్వే ట్రాక్‌ను ఎంచుకుని గాఢనిద్రలోకి జారుకున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఉదంతంలోనే మరో ఇద్దరు గాయపడ్డారని చెబుతున్నారు. మరో నలుగురు ఘటనాస్థలికి దూరంగా వుండటం వల్ల ప్రాణాలతో మిగిలారు. నలభై అయిదు రోజులుగా అర్ధాకలితోనో, పస్తులతోనో కాలంగడిపిన ఆ వలసకూలీలు తమ మరణానంతరమే తమ కుటుంబాలకు సాయపడగలిగారు. 
(చదవండి: కూలీలను చిదిమేసిన రైలు)

చనిపోయిన కూలీల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రకటన వారి వారసులకు ఉన్నంతలో ఓదార్పు. ప్రధాన రహదారులపై నడుచుకుంటూ వెళ్తే చెక్‌పోస్టుల వద్ద పోలీసులు నిలువరించడం, వారిని తాత్కాలిక శిబిరాలకు తరలిస్తుండటం చూసి, ఆ అభాగ్యులంతా రైలు పట్టాలనే నమ్ముకుని వాటిపై నడుస్తున్నారు. అన్నిటితోపాటు రైళ్లు కూడా ఆగి పోయాయని అనుకోబట్టే ఈ పని చేస్తున్నారు. సరుకు రవాణా యథావిధిగా సాగుతోందన్న సమా చారం వారికి లేదు.

సమాజంలో పలుకుబడివున్న వర్గాలకు చెందినవారు, అలాంటి వర్గాలకు సన్నిహితంగా మెలిగేవారు లాక్‌డౌన్‌ ప్రకటించాక కాస్త వెనకో ముందో తమ తమ స్వస్థలాలకు సులభంగా చేరగలిగారు. కానీ కేవలం పని దొరుకుతుందంటే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా వెళ్లడం అలవాటైన వలసజీవులకు అటువంటి అవకాశం లేదు. స్వస్థలాల్లోనే ఎవరికీ కానివాళ్లు, తమది కానిచోట ఎంతటి నిస్సహాయస్థితిలో వుంటారో ఎవరికీ తెలియంది కాదు. కనుకనే లాక్‌డౌన్‌ ప్రకటించాక వారిలో చాలామందికి ఎటువంటి ఆసరా దొరకలేదు. 

ముందే మేల్కొన్నవారు ఎవరినీ నమ్ముకోకుండా, దేన్నీ విశ్వసించకుండా నడకదారి పట్టారు. అది తమ వల్ల కాదనుకున్నవారూ, నేతల మాటలు నమ్మినవారూ ఎక్కడివారక్కడే ఉండిపోయారు. అనంతరకాలంలో వారిలో చాలా మందికి జ్ఞానోదయమైంది. కనుకనే రహదారుల పొడవునా, పట్టాల మీదుగా నిత్యం నడుస్తున్న వారూ... చెట్ల కిందనో, మరొకచోటనో సేదతీరుతున్నవారూ ఇప్పటికీ కనబడుతూనేవున్నారు. వలస కూలీలను చేరేయడానికి రైళ్లు నడుస్తున్నాయని తెలిసినా అందుకోసం విధించిన నిబంధనలు, డాక్టర్‌ సర్టిఫికెట్‌ వగైరాల కోసం చేయి తడపలేక అనేకమంది నడకనే నమ్ముకుంటున్నారు. 

అయినా వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లలో వెళ్లడానికి నమోదు చేయించుకుంటున్నవారి సంఖ్య చూస్తే గుండె గుభేలు మంటుంది. దేశవ్యాప్తంగా 20 లక్షలమంది రైలు ప్రయాణాలకు నమోదు చేసుకున్నారని అయిదారు రోజులక్రితం అధికారులు ప్రకటించారు. ఈసంఖ్య రోజురోజుకూ పెరుగుతూనేవుంది. దీనికి సమాంతరంగా నడకదారిన వెళ్లేవారు వెళ్తూనే వున్నారు. చంటిపిల్లలతో, వృద్ధులతో, గర్భిణిలతో... మోయలేని బరువులతో ఎందరెందరో నడుస్తూనే వున్నారు. సత్తువ సరిపోక, ఆకలిదప్పులు తీరక మార్గమధ్యంలో కొందరు మరణిస్తున్నారు.  

ఈ కష్టకాలంలో దాదాపు అన్ని రంగాలూ వలసజీవుల పట్ల చాలా నిర్దయగా ప్రవర్తించాయి. ఇన్నాళ్లుగా తమ సొంతం అనుకున్న నగరాలు కాస్తా నడిరోడ్డుపై నిలబెడుతుంటే ఆ వలసజీవులు విస్తుపోయారు. ఏ కొద్దిమంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులో, పారిశ్రామికవేత్తలో మానవీయ దృక్ప థంతో వారిని ఉన్నచోటే వుంచి, రెండుపూటలా కడపునింపారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు కూడా రంగంలోకి దిగి ఆదుకుంటున్న ఉదంతాలు లేకపోలేదు. ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. 

కానీ వలసజీవుల సంఖ్య కోట్లలో వున్నప్పుడు ఇంతమాత్రమే చాలదు. వ్యక్తులుగా ఎవరికి వారు స్పందించగలిగితేనే ఏదోమేరకు మెరుగైన సాయం అందుతుంది. కానీ సాయం మాట అటుంచి వున్న గూడును ఖాళీ చేయించి పొమ్మనేవారు, చేయడానికి పనులు లేవు గనుక ఫ్యాక్టరీ ఆవరణ విడిచివెళ్లమనేవారు, పని ఆగిపోయింది గనుక నిర్మాణాలవుతున్నచోటులో వుండొద్దని హుకుం జారీచేసేవారు ఎక్కువయ్యారు.
(చదవండి: 15 నుంచి ‘వందే భారత్‌’ రెండో విడత)

‘నన్ను కాదనుకున్న నగరంలో ఆకలితో చావడానికి సిద్ధంగా లేనని, అందుకే ఇంటిబాట పట్టాన’ని బిహార్‌ కార్మికుడొకరు ఆక్రోశించాడంటే ఈ నలభైరోజుల అనుభవం వారిపై ఎలాంటి ముద్ర వేసిందో అర్ధమవుతుంది. నిర్మాణరంగం పునఃప్రారంభానికి వలస కూలీలు అవసరం గనుక రైళ్లు రద్దు చేస్తున్నామని రెండురోజులక్రితం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన వైనం కూడా వలసజీవులను అవమానించేదే. ఇన్నిరోజులుగా తిండితిప్పలు లేనప్పుడు పట్టించుకోనివారికి వలసజీవుల్ని బలవంతంగా ఆపే హక్కుంటుందా? వారి అవసరం నిజంగా వుందనుకుంటే అద నంగా చెల్లిస్తామని, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తా మని ఒప్పించాలి. 

ఎందుకోగానీ చివరకు ఈ మతిమాలిన చర్యను కర్ణాటక వెనక్కి తీసుకుంది. కష్టాలతో నిండిన వర్తమానం నుంచి తప్పిం చుకోవాలని, కొద్దో గొప్పో మెరుగైన జీవితాన్ని అందుకోవాలని వలసజీవులు నిరంతం పరుగు లెడుతూవుంటారు. కానీ  విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఎవరూ తమను ఆదుకోరని వలసజీవులకు ఈ లాక్‌డౌన్‌ అర్ధం చేయించింది. ఇదంతా సజావుగా ముగిసి ప్రభుత్వాలు వారి జీవితాలకు భరోసా కలిగించే విధానాలను రూపొందించగలిగితే ఇప్పుడు మహారాష్ట్రలో రైలుపట్టాలపై అసువులుబాసిన వలసజీవుల ఆత్మలు శాంతిస్తాయి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు