రేవంత్‌ రెడ్డి రాయని డైరీ

29 Oct, 2017 01:09 IST|Sakshi

శుక్రవారం. లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌. హైదరాబాద్‌.
సారూ నేను.. ఇద్దరమే ఉన్నాం. సార్‌ నావైపు సీరియస్‌గా చూశారు. నేనూ సీరియస్‌గా ఏదో ఆలోచిస్తూ సార్‌ వైపు చూశాను.
అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉంటే, ఇద్దరికీ ఒక్కసారిగా నవ్వొచ్చేసింది! పక్కుమని నవ్వుకున్నాం.
శనివారం, పార్టీ ముఖ్య కార్యాలయం, అమరావతి.
సారూ నేను.. ఇద్దరమే ఉన్నాం. సార్‌ సీరియస్‌గా ఏదో ఆలోచిస్తూ నావైపు చూశారు. సార్‌ సీరియస్‌గా ఉన్నప్పుడు నేను మామూలుగా ఉంటే బాగోదని నేనూ సీరియస్‌గా సార్‌ వైపు చూస్తూ కూర్చున్నాను.
అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉంటే మళ్లీ ఇద్దరికీ ఒక్కసారిగా నవ్వొచ్చేసింది. మళ్లీ పక్కుమని నవ్వుకున్నాం.
‘‘ఏంటి రేవంత్‌ వీళ్ల గొడవ?’’ అన్నారు సార్‌... జారిన కళ్లద్దాల పైనుంచి చూస్తూ.
‘‘కొత్తవా సార్‌ కళ్లద్దాలు?’’ అని అడిగాను.
‘‘పాతవే రేవంత్‌.. నీకు కొత్తగా కనిపిస్తున్నట్లుంది! కళ్లద్దాలేనా, నేను కూడా నీకు కొత్తగా కనిపిస్తున్నానా?’’ అని అడిగారు సార్‌.  
‘‘మీరెప్పుడూ కొత్తగానే ఉంటారు సార్‌. అందుకే, మీ దగ్గర ఉండేవి.. అవి ఎంత పాతవైనా కొత్తగానే కనిపిస్తాయి’’ అన్నాను.
సార్‌ నవ్వారు. ‘‘సరే, ఏంటి రేవంత్, వీళ్ల గొడవ?’’ అన్నారు.
‘‘మీడియా వాళ్ల గొడవ సార్‌’’ అన్నాను.
‘‘అదెప్పుడూ ఉండేదే కదా.. మన వాళ్ల గొడవేంటీ అని! రమణ, మోత్కుపల్లి, రావుల, అరవింద్‌ కుమార్‌... ఏమంటారు వీళ్లంతా?! నిన్ను పార్టీలోంచి తోసేయమంటున్నారా?’’ అన్నారు సార్‌.
‘‘నాకు తెలీదు సార్‌. నేను ఢిల్లీ వెళ్లొచ్చినప్పట్నుంచీ వాళ్లు నాతో మాట్లాడ్డం మానేశారు’’ అన్నాను.
‘‘అందరూ అన్నీ చూడలేరు కదా రేవంత్‌. ఆ మాత్రానికే అలిగితే ఎలా వాళ్లు! అయినా వాళ్లింతవరకూ ఢిల్లీ చూడకుండా ఉంటారా?! లేక, ఢిల్లీలో వాళ్లు చూడనిదేదైనా నువ్వు చూసి వచ్చావా?’’ అన్నారు సార్‌.
‘‘ఢిల్లీలో ఎవరైనా కొత్తగా చూసి వచ్చేది ఏముంటుంది సార్‌?’’ అన్నాను. సార్‌ నవ్వారు.
‘‘రాహుల్‌ గాంధీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నట్లున్నాడు కదా ఈ మధ్య’’ అన్నారు.
‘‘గమనించలేదు సార్‌’’ అన్నాను.
‘‘మనవాళ్లు గమనించారయ్యా. రేవంత్‌–రాహుల్‌ పేర్లు కలిశాయని రమణ ఉడికిపోతున్నాడు. ఎంతైనా తెలంగాణలో మన పార్టీ ప్రెసిడెంట్‌ కదా. ఆ మాత్రం బాధ ఉంటుందిలే రమణకి’’ అన్నారు సార్‌.
నవ్వాను.
‘‘కొంచెం సీరియస్‌గా ఉండు రేవంత్‌’’  అన్నారు సార్‌.. నవ్వుతూ!

వ్యాసకర్త
---- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు