గింజ రాక గిజగిజ!

29 Oct, 2017 01:10 IST|Sakshi

వరి రైతుకు ‘దోమ’ గండం

దోమపోటు బారిన పడిన పంటను ఆవేదనతో చూస్తున్న ఈ రైతు పేరు దొడ్లె వెంకట్‌రెడ్డి. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్‌కు చెందిన ఆయన.. మూడెకరాల్లో వరి వేశాడు. తొలుత పంట ఆశాజనకంగా కనిపించినా.. గింజ దశకు వచ్చే సరికి దోమపోటు తెగులు ఆశించింది. గత నెల రోజులుగా దాని ఉధృతి మరింతగా పెరిగింది. దాంతో రూ.8 వేలు ఖర్చు చేసి.. నాలుగు సార్లు పురుగుమందును పిచికారీ చేశాడు. అయినా దోమపోటు నియంత్రణలోకి రాలేదు. కోత దశకు వస్తున్న తరుణంలో దెబ్బతిన్న పంటను చూసి కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/హైదరాబాద్‌ :  దోమ కా(పో)టుకు వరి రైతు విలవిల్లాడుతున్నాడు.. పంట చేతికందే దశలో దోమపోటు (సుడిదోమ) తెగులు ఉధృతి పెరగడంతో దిగాలు పడుతున్నాడు.. పురుగు మందుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నా పంట దిగుబడి తగ్గిపోయేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాత జిల్లాల పరిధిలో వరికి దోమపోటు తెగులు సోకింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో దోమపోటు ఉధృతి బాగా పెరిగింది. ముఖ్యంగా బీపీటీ–5204 వంటి సన్నరకాలు సాగు చేసిన రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, ఆమన్, అంకుర, తెలంగాణ సోనా వంటి సన్నరకాలతోపాటు 1010, బతుకమ్మ, కూనారం సన్నాలు వంటి దొడ్డు (స్వల్పకాలిక) రకాల వరికి కూడా దోమపోటు ఆశించింది.

దిగుబడులు భారీగా తగ్గిపోయే అవకాశం ఉండడంతో రైతులంతా ఆందోళనలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరికి దోమపోటు తెగులు ఆశించినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అధిక వర్షాలతో అనేకచోట్ల వరి ధాన్యం రంగు మారింది. దోమపోటుతో ధాన్యంలో తాలు శాతం పెరిగే అవకాశముండడం, వర్షాలతో రంగు మారడంతో మద్దతు ధర దక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సగానికిపైగా పంటకు తెగులు!
ఈసారి ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది. నాగార్జున సాగర్‌ నుంచి నీటి విడుదలకు అవకాశం లేకపోవడం, ఇతర ప్రాజెక్టుల్లోకి ఆలస్యంగా నీరు చేరడంతో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలుకాగా.. ఈసారి 19.07 లక్షల (82%) ఎకరాల్లో మాత్రమే వేశారు. ఇందులోనూ సుమారు ఎనిమిది లక్షల ఎకరాల వరకు బీపీటీ–5204 వంటి సన్నరకాలను సాగుచేశారు. ఈ సన్న రకాలకు దోమపోటును తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీటితోపాటు దొడ్డు రకాల వరికీ తెగులు ఆశించింది.

దీంతో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి వంటి జిల్లాల్లో వరికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సాగైన వరిలో సగానికిపైగా అంటే సుమారు 10 లక్షల ఎకరాల్లో వరికి దోమపోటు ఆశించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారీగా పడిపోనున్న దిగుబడి
దోమపోటు కారణంగా వరి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఎకరానికి సుమారు మూడు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి పడిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా తెగుళ్లను తట్టుకునే శక్తి తక్కువగా ఉండే బీపీటీ–5204 రకానికి ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

సాధారణంగా వరి ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని.. కానీ దోమపోటు కారణంగా 20 నుంచి 22 క్వింటాళ్లే దిగుబడి వస్తుందని చెబుతున్నారు. మిగతా రకం వరి దిగుబడులు కూడా నాలుగైదు క్వింటాళ్ల మేర తగ్గుతాయని స్పష్టం చేస్తున్నారు.

ఎకరానికి ఐదారు వేల అదనపు భారం
దోమపోటు ఉధృతంగా ఉండడంతో రైతులు పురుగు మందులు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. ఇప్పటికే పురుగుమందుల ధరలు పెరగగా.. మొత్తంగా సాగు వ్యయం పెరుగుతోంది. దోమపోటు నివారణ మందులను పిచికారీ చేయడానికి ఒక్కో ఎకరాకు ఒకసారికి రూ.వెయ్యి వరకు ఖర్చు వస్తోంది.

అయితే ఉధృతి ఎక్కువగా ఉండడం, పంట దెబ్బతినే పరిస్థితి ఉండడంతో కొందరు రైతులు ఐదు పర్యాయాలు పురుగు మందును చల్లాల్సి వచ్చింది. దీంతో మొత్తంగా పురుగు మందుల ఖర్చుతోపాటు కూలీల ఖర్చు కలసి సాగు వ్యయం తడిసి మోపెడవుతోంది.

తేమ పెరగడంతో ఉధృతి
నెల రోజులుగా వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా దోమపోటు ఎక్కువగా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉక్కపోత విపరీతంగా పెరగడం, గాలిలో తేమ శాతం 80 నుంచి 85 వరకు ఉండటం వంటివి తెగులు ఉధృతికి దోహదం చేస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. గత నెల రోజులుగా తరచూ కురుస్తున్న వర్షాలు, రైతులు నత్రజని ఎరువులు ఎక్కువగా వినియోగించడం కూడా తెగులు పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.


వర్షాల వల్లే దోమపోటు
ఇటీవల కురిసిన వర్షాలతో దోమపోటు ప్రభావం పెరిగింది. పురుగు మందులు చల్లాలని రైతులకు సూచనలు కూడా చేశాం.. – పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి


5 జిల్లాల్లో అధికంగా..
వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పులు, తేమ శాతం, ఉక్కపోత పెరగడంతో దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ (పాత జిల్లాలు) జిల్లాల్లో ఎక్కువగా సోకింది. ఇటీవల శాస్త్రవేత్తల బృందం ఆ జిల్లాలో పర్యటించి వరి పంటను పరిశీలించింది.

తెగులు కారణంగా దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లు పడిపోయే అవకాశముంది. దీని నియంత్రణకు పంట మొదళ్ల వద్ద మందు పడేలా పొలంలో కాలిబాటలు పురుగుల మందు పిచికారీ చేయాలి.. – ఆర్‌.జగదీశ్వర్, జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త


మరింత అప్పుల పాలవుతున్నాం
నా పేరు సీహెచ్‌ హన్మంతు నిజామా బాద్‌ జిల్లా మందర్న గ్రామం. మూడెకరాల్లో వరి వేశాను. గింజ వేసే సమయంలో దోమ పోటు ఆశించింది. పురుగు మందు పిచికారీ చేసినా.. మళ్లీ తెగులు తిరగబెడుతూనే ఉంది. ఇప్పటికే రూ.ఆరు వేల వరకు ఖర్చు చేశాను. ఇప్పటికే సాగుకోసం చేసిన అప్పులకు ఇది భారంగా మారింది. – సీహెచ్‌ హన్మంతు, మందర్న, నిజామాబాద్‌ జిల్లా


మూడెకరాల్లో దోమపోటు వచ్చింది
నా పేరు బొబ్బిలి సమ్మయ్య, వరంగల్‌ జిల్లా మాది మల్హర్‌ మండలం తాడిచెర్ల. ఐదు ఎకరాల్లో వరి పొలం వేసిన. కౌలుతో కలిపి ఐదు ఎకరాలకు రూ.80 వేల వరకు ఖర్చు వచ్చింది. అందులో పురుగుల మందులు, ఎరువులకే దాదాపు రూ.45 వేల వరకు ఖర్చు పెట్టిన. మొదట్లో ఎకరం పొలంలో అక్కడక్కడ దోమపోటు వచ్చింది. పురుగుమందులు కొట్టిన తగ్గినట్టే తగ్గి మూడెకరాలకు వ్యాపించింది. ఈ మూడెకరాల్లో వడ్లగింజ కూడా చేతికి వచ్చేట్టు లేదు.    – బొబ్బిలి సమ్మయ్య, తాడిచెర్ల, వరంగల్‌ జిల్లా.


రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం   -  9.34 లక్షల హెక్టార్లు
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగైన విస్తీర్ణం        -   7.63 లక్షల హెక్టార్లు
దోమపోటు ప్రభావిత జిల్లాలు:   నిజామాబాద్, మెదక్, కరీంనగర్,  వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి
తెగులు ఆశించిన విస్తీర్ణం:    10 శాతం నుంచి 20 శాతం వరకు.. (సుమారుగా)
దిగుబడిపై ప్రభావం:    ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్లు తగ్గుదల

మరిన్ని వార్తలు