విదేశీ భాషల వేదిక.. ఇఫ్లూ

19 Dec, 2013 13:56 IST|Sakshi

‘ది సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్’ కాలక్రమేణా ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)’గా రూపాంతరం చెందింది.. సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఉన్న ఇఫ్లూ.. ఇంగ్లిష్‌తోపాటు మరెన్నో విదేశీ భాషా కోర్సులను  అందిస్తోంది.  2014-15కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
 దేశంలోనే తొలి భాషా కోర్సుల యూనివర్సిటీ.. ఇఫ్లూ. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక బోధన, పరిశోధన-బోధన అంశాల్లో విదేశీ వర్సిటీలతో ఒప్పందం కారణంగా ఇఫ్లూ కోర్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇఫ్లూలోని సుమారు 900 సీట్లకు గతేడాది ఎనిమిది వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
 
 కొత్తగా కేరళలో:
 ఇఫ్లూ యూనివర్సిటీకి ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు లక్నో, షిల్లాంగ్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా కేరళలోని మల్లాపూర్‌లో నూతన క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో తొలుత సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియెన్సీ (సీఓపీ) కోర్సులను మాత్రమే బోధించనున్నారు. ఈ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నాలుగు క్యాంపస్‌లలో ఎక్కడైనా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది.
 
 ప్రశ్నపత్రంలో మార్పులు:
 రాత పరీక్ష ఆధారంగా ఇఫ్లూ ఆఫర్ చేసే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. నిర్దేశించిన కోర్సులకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ ఏడాది నుంచి ప్రవేశ పరీక్ష విధానంలో కీలకమైన మార్పులు చేశారు. ఈసారి నుంచి ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటికి జవాబులను ఓఎంఆర్ షీట్‌లో గుర్తించాలి. పరీక్ష విధానం, సంబంధిత వివరాలను 18603450112 (టోల్ ఫ్రీ నంబర్ 2ను ఎంపిక చేసుకోవాలి), 040-27689447/040-27070046  ఫోన్ నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు.
 
 పెరుగుతున్న విదేశీ విద్యార్థులు:
 ఇఫ్లూలో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య  ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం రెండు వందల మందికి పైగా ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి ఐదు వందల వరకు పెరిగే అవకాశాలున్నాయి. అయితే విదేశీ విద్యార్థులు ఎటువంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకాకుండానే నేరుగా అనుకున్న కోర్సులో అడ్మిషన్ పొందే సౌలభ్యం ఉంది.
 
 ఉపకారవేతనాలు:
ఇఫ్లూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎంచుకున్న కోర్సులను బట్టి ఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి. ఈబీసీ/ఫిజికల్లీ చాలెంజ్డ్ కేటగిరీ కింద విద్యార్థులకు నెలకు రూ. 1,000 స్టైపెండ్ లభిస్తుంది. వీరికి హాస్టల్ ఫీజు నుంచి కూడా మినహాయింపునిస్తారు. అంతేకాకుండా ఎంపిక చేసుకున్న కోర్సులాధారంగా యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (నెలకు రూ. 16,000), యూజీసీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (నెలకు రూ. 18,000), రాజీవ్ గాంధీ నేషనల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు), మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (మైనార్టీ విద్యార్థులకు), యూజీసీ టీచర్ ఫెలోషిప్, ఇందిరా గాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ (పీజీ విద్యార్థులకు), ర్యాంక్ హోల్డర్స్ స్కాలర్‌షిప్ (యూజీ) విద్యార్థులకు, స్కాలర్‌షిప్ ఫర్ పీజీడీటీఏ వంటి ఎన్నో స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి.
 


 లభించే ఉద్యోగాలు:
 ఇఫ్లూ నుంచి కోర్సులు పూర్తి చేసిన వారికి దేశ, విదేశాల రాయబార (అంబాసిడర్) కార్యాలయాల్లో, విదేశీ బహుళజాతి కంపెనీలు, రష్యన్ ఆర్మీ, ప్రత్యేక ట్రాన్స్‌లేటర్ కాల్‌సెంటర్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కళాశాలల్లో అధ్యాపకులుగా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటున్నాయి. అంతేకాకుండా యూనివర్సిటీలోని ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా అధిక శాతం విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
 
 ఆఫర్ చేస్తున్న కోర్సులు:
 బీఏ (ఆనర్స్-ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్), బీసీజే, బీఈడీ (ఇంగ్లిష్).
 ఎంఈడీ, ఎంఏ (ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, జపనీస్, రష్యన్, స్పానిష్), ఎంసీజే, మాస్టర్స్ ఇన్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్.
 పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్
 పీహెచ్‌డీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్స్, కంపేరిటివ్ లిటరేచర్, సోషల్ ఎక్స్‌క్లూజన్ స్టడీస్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఫిల్మ్ స్టడీస్, కల్చరల్ స్టడీస్, హిందీ, అరబిక్ లిటరేచర్), ఫ్రెంచ్ స్టడీస్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్, రష్యన్
 లిటరేచర్.
 
 నోటిఫికేషన్ సమాచారం
 దరఖాస్తు:
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి రెండు కోర్సులకు మించి దరఖాస్తు చేసుకునే వీలు లేదు.
 ఫీజు:    రూ.350 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 150).
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 15, 2014
 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జనవరి 16, 2014
 దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ:
 జనవరి 20, 2014
 రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 21, 22, 23-2014.
 వెబ్‌సైట్: www.efluniversity.ac.in
 
 -సవలం ఉపేందర్,
 న్యూస్‌లైన్, ఓయూ, హైదరాబాద్.
 
 
 ఇఫ్లూ నిర్వహిస్తున్న ఇంగ్లిష్, విదేశీ భాషల కోర్సులకు ప్రతి సంవత్సరం ఆదరణ పెరుగుతోంది. ఖర్చు లేని విద్యను అందిస్తుండడం,  కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడాన్ని దీనికి కారణంగా పేర్కొనవచ్చు. గతంతో పోల్చితే ఈసారి చాలా త్వరగా నోటిఫికేషన్ విడుదల చేశాం. గతేడాది అన్ని కోర్సులకు కలిపి దాదాపు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది 10,000 దరఖాస్తులు అందే అవకాశం ఉంది.
 
 అందివస్తున్న అవకాశాల దృష్ట్యా ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా లాంగ్వేజెస్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈసారి పరీక్ష విధానంలో పలు మార్పులు చేశాం. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నాం.
 ప్రొఫెసర్ సునయన సింగ్,
 వైస్ చాన్‌‌సలర్-ఇఫ్లూ.
 
 హెచ్‌సీయూలో ప్రవేశాలు
 దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) ఒకటి. ఇది 46 విభాగాల ద్వారా ఇంటిగ్రేటెడ్ నుంచి పీహెచ్‌డీ వరకు 150 కోర్సులను ఆఫర్ చేస్తోంది. 2014-15 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో
 ప్రవేశానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
 ప్రవేశ విధానం ఎంపిక చేసుకున్న కోర్సులను బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని కోర్సులకు రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. మరికొన్ని కోర్సులకు రాతపరీక్షతోపాటు ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూలు ఉంటే రాత పరీక్షకు 75 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయిస్తారు (ఈ మార్కులు కోర్సును బట్టి కూడా మారుతుంటాయి).
 
 ఆబ్జెక్టివ్ విధానంలో:
 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు (ఎంఎస్సీ ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హెల్త్ సైకాలజీ, పీజీ డిప్లొమా-కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ మినహా). పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. రాత పరీక్షలో పార్ట్-ఎ, పార్ట్-బి విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో 25 ప్రశ్నలు ఉంటాయి. వీటిని మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో రూపొందిస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కు కోత విధిస్తారు. పార్ట్-బి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటుంది. ఇందులో 75 ప్రశ్నలు ఉంటాయి.
 
 ఎంపీఏ, ఎంఎఫ్‌ఏ, ఎంఏ కమ్యూనికేషన్, పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కమ్యూనికేషన్, థియేటర్ ఎడ్యుకేషన్ కోర్సులకు రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.
 ఎంఎస్సీ ఫిజిక్స్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఎంబీఏ-హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హెల్త్ సైకాలజీ, ఎంఫిల్, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్/పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/పీహెచ్‌డీ-బయోటెక్నాలజీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ పీహెచ్‌డీ కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంటెక్‌లకు యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్, ఆర్‌జీఎన్‌ఎఫ్/ఎంఏఎన్‌ఎఫ్, ఎన్‌బీహెచ్‌ఎం, ఐసీఎంఆర్, ఐసీఏఆర్ వంటి పరీక్షల్లో జేఆర్‌ఎఫ్ సాధించిన వారికి రాత పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు. వీరు ఇంటర్వ్యూకు మాత్రమే హాజరు కావాలి.
 ఎంసీఏ ప్రవేశ పరీక్షలో రీజనింగ్ నుంచి 25 మార్కులు, +2 స్థాయి మ్యాథమెటిక్స్ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
 క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
 
   ఇంటిగ్రేటెడ్ కోర్సులు:
 ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ఎంఎస్సీ కోర్సుల కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులను సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. 10 సెమిస్టర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్ సబ్జెక్ట్‌లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఏ విభాగంలో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు, హ్యుమానిటీస్ కింద తెలుగు, హిందీ, ఉర్దూ భాషా కోర్సులు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ కింద ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 
 ఎంఎస్సీ కోర్సులు:
 పీజీ విభాగంలో ఎంఎస్సీకి సంబంధించి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఏనిమల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్, హెల్త్ సైకాలజీ కోర్సులు ఉన్నాయి. ఇందులోని బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం మాత్రం జేఎన్‌యూ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా కల్పిస్తారు.
 
 ఎంఏ కోర్సులు:
 ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, తెలుగు, అప్లైడ్ లింగ్విస్టిక్స్, కంపేరిటివ్ లిటరేచర్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, కమ్యూనికేషన్ (కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్, ప్రింట్ జర్నలిజం అండ్ న్యూమీడియా, టెలివిజన్ అండ్ రేడియో).
 
 ఇతర కోర్సులు:
 ఎంపీఏ డ్యాన్స్, ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఎఫ్‌ఏ, ఎంపీహెచ్ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్), అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్/పీహెచ్‌డీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీఏ, ఎంఎఫ్‌ఏ, ఎంఏ-కమ్యూనికేషన్, పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కమ్యూనికేషన్, థియేటర్ ఎడ్యుకేషన్ కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి మాత్రమే ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
 ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. మిగతా ఎంటెక్ కోర్సుల్లో కూడా గేట్ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్ ఉంటుంది. వీటిల్లో కొన్ని కోర్సులకు ఇంటర్వ్యూను కూడా నిర్వహిస్తారు.
 
 అర్హతలు:
 ఐఎంఎస్సీ/ఐఎంఏ: 60 శాతం మార్కులతో 10+2.
 ఎంఏ/ఎంఎస్సీ: నిర్దేశించిన మార్కులతో సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ.
 ఎంసీఏ: మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా 60 శాతం మార్కులతో డిగ్రీ.
 పీహెచ్‌డీ/ఎంఫిల్: సంబంధిత విభాగంలో పీజీ.
 
 అవగాహనకు పరీక్ష:
 రాత పరీక్షలో జ్ఞాపక శక్తి కంటే విద్యార్థుల అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఆయా సబ్జెక్ట్‌లలోని ప్రాథమిక భావనల ఆధారంగా ప్రశ్నలను రూపొందిస్తారు. ఇవి అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ఉంటాయి. కాబట్టి సంబంధిత కాన్సెప్ట్‌ను అవగాహన చేసుకుంటూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. డిగ్రీ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దాన్నుంచి ఎన్ని రకాల ప్రశ్నలు అడగొచ్చో ఊహించి ప్రాక్టీస్ చేయాలి.
 
 కటాఫ్ తొలగింపు:
 ఈ ఏడాది నుంచి హెచ్‌సీయూ తీసుకున్న కీలక నిర్ణయం.. కటాఫ్ మార్కుల తొలగింపు. గతంలో ప్రవేశ పరీక్షల్లో కటాఫ్ మార్కులను నిర్దేశించేవారు. దీంతో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. ఈ కారణంగా దాదాపు 15 శాతం సీట్లు ఖాళీగా మిగిలి పోతున్నాయి.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మేరకు ఎన్ని కోర్సులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 3, 2014
 రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 1-7, 2014
 వివరాలకు: www.uohyd.ac.in

మరిన్ని వార్తలు