నోటా...ఎవరి కోటా?

18 May, 2014 16:18 IST|Sakshi
నోటా...ఎవరి కోటా?

సాక్షి, విశాఖపట్నం:నిజంగా అసలు అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతో పోలైన ఓట్లా? లేదంటే ఒకరికి వేయాలనుకున్న ఓట్లు చివరకు నోటాకు పడ్డాయా? అనేదానిపై చర్చ జరుగుతోంది. అసలెందుకిలా జరిగిందనేదానిపై అన్ని వర్గాలు ప్రస్తుతం కిందామీద పడుతున్నాయి.  వాస్తవానికి నోటా ఓట్లపై మైదాన ప్రాంతంలో కొంతవరకు అవగాహన ఉంది. దీంతో శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో చాలా నియోజక వర్గాల్లో కొద్దొగొప్పొ అన్నట్లు 1500 లోపే నమోదయ్యాయి. కాని అసలేమాత్రం విస్తృత ప్రచారం లేని ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరగడంతో అసలేం జరిగిందనేది అంతుపట్టక పార్టీలు,అధికారులు ఆలోచనలో పడ్డారు. అరకు అసెంబ్లీ పరిధిలో 6,350, పాడేరు అసెంబ్లీ పరిధిలో 2,822, అరకు లోక్‌సభ స్థానంలో నోటాకింద 16,245 నమోదయ్యాయి.
 
 దీంతో ఇప్పుడు మన్యంలోని ఈ ఓట్లపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు రకరకాల వాదనలు వినిపిస్తుండగా, కొందరు స్వతంత్ర అభ్యర్థులు సైతం నోటా ఓట్లు తమవిగా చెబుతున్నారు. అరకులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఓటేసేటప్పుడు చివర్లో తనపేరు, గుర్తు ఉంటుందని ప్రచారం చేశారు. అయితే చివర్లో ఈయన పేరుకు ముందు నోటా ఓటు విభాగం ఉంది. దీంతో కుంభాకు వెళ్లాల్సిన ఓట్లన్ని నోటాకు పడ్డాయని పలువురు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఈయనకు మొత్తం 25,548 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి సోమకు 29,485 ఓట్లు వచ్చాయి. నోటాకు 6.350 పోలయ్యాయి. దీంతో ఇవన్నీ తనకు రావలసిన ఓట్లేనని కుంబా వాదిస్తున్నారు.
 
 పోనీ ఈ వాదన సరైందే అనుకుంటే అటు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2,822 నోటా ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి నోటాపై ఏజెన్సీలో కనీసం ప్రచారం లేని నేపథ్యంలో ఈ ఓట్లు ఏదొక అభ్యర్థి అనుకుని వేసి ఉంటారని పలువురు వివరిస్తున్నారు. అటు అరకు పార్లమెంట స్థానం పరిధిలో ఏకంగా 16,245 ఓట్లు పోలవడం రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లుగా చెబుతున్నారు. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన అరకు పార్లమెంట్‌లో ఇన్ని ఓట్లు పోలవడంపైనా అనేక రకాల వాదనలు పెరుగుతున్నాయి. చివరి నుంచి మొదటగా ఉన్న నోటా ఓటు విభాగం ఏదైనా అభ్యర్థిదేమోనని ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో చాలామంది భ్రమపడి ఓట్లు వేశారా అనే అంచనాలు నెలకొన్నాయి.  నోటాపై ప్రచారం లేని మన్యంలో దీనికి ఇన్ని ఓట్లు పోలవడంతో పొరపాటుగా పడ్డవేనని అధికారులు వివరిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు