TS Election 2023: తొమ్మిది మంది 'సిట్టింగ్‌'లకు మళ్లీ చాన్స్‌!

22 Aug, 2023 01:46 IST|Sakshi

వరంగల్‌: బీఆర్‌ఎస్‌లో టికెట్ల ఉత్కంఠకు తెరపడింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఊహాగానాలకు తెరదించేలా ముఖ్యమంత్రి మరోసారి ‘సిట్టింగ్‌’లకే పెద్దపీట వేశారు. ఉమ్మడి వరంగల్‌లో 12 స్థానాలకు 11 స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించిన గులాబీ నేత.. జనగామ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్యకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ములుగు నియోజకవర్గం నుంచి జెడ్పీ ఇన్‌చార్జ్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతిని బరిలోకి దింపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘సిట్టింగ్‌’లను మార్చుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది.

కానీ ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసేలా కేసీఆర్‌ కేవలం ఒకే ఒక ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరి కాగా.. తొమ్మిది మంది సిట్టింగ్‌లకు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కింది. మహబూబాబాద్‌, డోర్నకల్‌, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నుంచి టికెట్‌ వస్తుందని భావించిన మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య ప్రస్తావన లేకుండా పోయింది.

మొదటిసారి నాగజ్యోతి..
ఎనిమిదోసారి రెడ్యానాయక్‌..

తాజాగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో ప్రత్యేకతలు ఉన్నాయి. ములుగు నుంచి అభ్యర్థిగా ఎంపికై న బడే నాగజ్యోతి మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి, డోర్నకల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధరమ్‌సోతు రెడ్యానాయక్‌ ఎనిమిదోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్‌.. ఒక్కసారి మాత్రమే సత్యవతి రాథోడ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇటీవల ఆయనపై కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయనకు బదులు కుటుంబంలో ఒకరికి లేదా మంత్రి సత్యవతికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ రెడ్యానాయక్‌ ఇది నాకు చివరి ఎన్నిక.. భవిష్యత్‌లో పోటీ చేయనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దక్కింది. ఓటమెరుగని నేతగా సుధీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకసారి ఎంపీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మూడు సార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికై , మరో మూడుసార్లు (2009, 2014, 2018లలో) పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దయాకర్‌రావు ఏడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఐదోసారి తలపడనున్నారు.

2014, 2018లలో వర్ధన్నపేట నుంచి గెలుపొందిన అరూరి రమేష్‌ హ్యాట్రిక్‌ దిశగా మూడోసారి బరిలో నిలవనున్నారు. అదే విధంగా పరకాల నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి సైతం ఇదే రేసులో ఉన్నారు. మహబూబాబాద్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బానోతు శంకర్‌నాయక్‌ హ్యాట్రిక్‌ ఆశల్లో ఉన్నారు.

ఉద్యమనేతగా ఎదిగిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట నుంచి రెండుసార్లు పోటీ చేసినప్పటికీ 2018లో గెలుపొందారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది బీఆర్‌ఎస్‌లో చేరిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుపై తొలిసారి పోటీ చేయనున్నారు. వరంగల్‌ తూర్పు నుంచి రెండోసారి నన్నపునేని నరేందర్‌ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు