చింతలపూడి బరిలో యువ డాక్టర్

14 Apr, 2014 15:44 IST|Sakshi
చింతలపూడి బరిలో యువ డాక్టర్

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి ఈసారి ఓ యువ వైద్యురాలు అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ సతీమణి డాక్టర్ దేవీప్రియ ఇక్కడినుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయబోతున్నారు. దంతవైద్యురాలైన డాక్టర్ దేవీప్రియ ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. ఆమె తండ్రి రామాంజనేయులు పశ్చిమగోదావరి జిల్లాకు గతంలో జాయింట్ కలెక్టర్గా చేశారు. 1995 బ్యాచ్ కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ భార్యగానే కాకుండా దంతవైద్యురాలిగా, నాయకురాలిగా కూడా దేవీప్రియ ఈ ప్రాంత ప్రజలకు బాగా దగ్గరయ్యారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మిగిలిన పార్టీల్లా పలు విడతలు విడతలుగా అభ్యర్థులను ప్రటించలేదు. ఒకేసారి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటించేశారు. అసెంబ్లీ బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో 170 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు, తూర్పు గోదావరిలో ఒక్కటి తప్ప మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఎవరెవరు పోటీ చేస్తారో విస్పష్టంగా చెప్పేశారు.

ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పులివెందుల నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. సీనియర్ నాయకులు వయోభారంతో పోటీ చేయలేని సందర్భాలలో వాళ్లు సూచించిన వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ గుర్తింపునిచ్చారు.

మరిన్ని వార్తలు