జనహారతి

27 Apr, 2014 04:12 IST|Sakshi
జనహారతి

 రాజన్న తనయుడికి అడుగడుగునా ఆత్మీయస్వాగతం
-ప్రజలకు భరోసానిచ్చిన జగన్ ప్రసంగం
- వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
- అభిమానంతో ఉప్పొంగిన ‘గూడెం’..
- మధిర జనసంద్రం

 
 సాక్షి, ఖమ్మం, ‘జై జగన్.. అన్నా జగనన్న.. వైఎస్సార్ జోహార్..’ అనే నినాదాలతో అటు మధిర, ఇటు కొత్తగూడెం హోరెత్తాయి.  రాజన్న తనయుడు జగనన్నను చూడాలని.. కరచాలనం చేయాలని.. ఆయన మాట్లాడే మాటలు వినాలని భారీగా తరలివచ్చిన ప్రజలు ఉత్సుకతో ఎదురుచూశారు.

జగన్ పర్యటన కొంత ఆలస్యమైనా మండే ఎండను సైతం లెక్కచేయలేదు. సభల్లో జగన్ మాట్లాడిన ప్రతిమాటకు  జనం అపూర్వరీతిలో స్పందించారు. ఇది..జిల్లా ప్రజలు రాజన్న బిడ్డను అక్కున చేర్చుకుంటారని, ఆయన్ను ఆశీర్వదిస్తారని చెప్పకనే చెప్పింది.
 జిల్లాలో రెండురోజుల ఎన్నికల ప్రచారానికి గాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటలకు మధిరకు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద ఆయనకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

 అక్కడినుంచి సభావేదిక సుందరయ్య సెంటర్ వరకు అడుగడుగునా ఇరు పార్టీల శ్రేణులతో పాటు ప్రజలు జగన్‌కు నీరాజనం పలికారు. భారీగా తరలివచ్చిన జనం ఉప్పొంగిన అభిమానంతో జననేతకు జేజేలు పలికారు. సభావేదిక వద్దకు జగన్ చేరుకోగానే ‘జై జగన్ ’ అంటూ కార్యకర్తల నినాదాలు అంబరాన్నంటాయి. రాజన్న తనయుడిని చూసేందుకు ప్రజలు ఉత్సాహంతో వేదిక ముందుకు వచ్చారు.

 జగన్ అభివాదం చేస్తుం డగా అదే ఉత్సాహంతో ప్రజలు కూడా స్పందించారు. సాయంత్రం 6.30 గంటలకు మధిర సభ ముగియగానే వైరా, తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు మీదుగా రాత్రి 8 గంటలకు ఆయన కొత్తగూడెం చేరుకున్నారు. మార్గమధ్యలో వైఎస్సార్ సీపీ, సీపీఎం శ్రేణులు జననేత కాన్వాయ్‌ను ఆపి ఆప్యాయతతో పలకరించారు.
 
 కొత్తగూడెం.. కెవ్వుకేక..

 మధ్యాహ్నం 2 గంటలకే ప్రకాశం స్టేడియం జనసంద్రంగా మారింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా రాజన్న తనయుడిని చూడాలని ప్రజలు నిరీక్షించారు.  6 గంటలు ఆలస్యంగా జగన్ వచ్చినా ఘనస్వాగతం పలికారు.  జగన్ వేదిక పైకి రాగానే జై జగన్ నినాదాలు మిన్నంటాయి. మహానేత పథకాలను జగన్ ప్రస్తావించగానే ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే’ అంటూ  నినాదాలు చేశారు.

జగన్ ప్రసంగిస్తున్నంత సేపు  ప్రకాశం స్టేడియం నినాదాలతో మార్మోగింది.  ఆయనను నేరుగా చూసేందుకు వేదిక వద్దకు చొచ్చుకొని రావడానికి జనం ప్రయత్నించడంతో  నియంత్రించడానికి పోలీసులు శ్రమపడాల్సి వచ్చింది. జగన్ ఉత్సాహభరిత ప్రసంగం చేయడంతో అంతా ఆసక్తిగా విన్నారు. ప్రసంగం అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు సింగరేణి చమాస్, టోపీ అలంకరించడంతో జై సింగరేణి, జై జగన్ అంటూ సభాప్రాంగణం నినాదాలతో దద్దరిల్లింది.

 శీనన్నను కేంద్ర మంత్రిని చేస్తా..
 మధిర,కొత్తగూడెం సభల్లో జగన్ ప్రసంగిస్తూ... ఎంపీ అభ్యర్థిగా శీనన్నను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని పునరుద్ఘాటించారు. జిల్లాలో సీపీఎం, వైఎస్సార్ సీపీ అవగాహన మేరకు 7 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం పోటీచేస్తున్నాయని.. తమ ఫ్యాన్ గుర్తు , సుత్తికొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

మధిరలో ప్రసంగిస్తూ 2009లో ఇదే మధిరలో రూ.150 కోట్లతో పలు అభివృద్ధి పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని.. అప్పటి ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య రాజశేఖరరెడ్డిని గొప్ప వ్యక్తిగా పొగిడారని గుర్తు చేశారు. జిల్లా ప్రజల ఆదరణ, అభిమానం చిరస్థాయిగా తన గుండెలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.

 ఆకట్టుకున్న జగన్ ప్రసంగం...
 ‘రాజకీయమంటే ప్రతి పేదవాడి మనసెరగడం...  రాజకీయమంటే చనిపోయినతర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండటం కోసం ఆరాటపడటం.. ఇది నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నిజంగా నాన్న ప్రతి పేదవాడి గురించి అంతగానే పట్టించుకున్నారు. కులం, మతం, ప్రాంతం ఏమీ పట్టించుకోలేదు.

రాజకీయాలు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేసి పేదవారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు’ అంటూ జగన్ వైఎస్‌ఆర్ పేరు ప్రస్తావించినపుడల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. విశ్వసనీయత, విలువలకు పట్టంకట్టేలా జగన్ ప్రసంగం సాగడం జిల్లా ప్రజలకు భరోసానిచ్చి ధీమా కల్పించింది.

 అవ్వా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్..
 జగన్ ప్రసంగం చివర్లో.. ‘మనది కొత్తపార్టీ.. అందరికీ మన పార్టీ గుర్తు తెలిసి ఉందో లేదో.. మన పార్టీ గుర్తు తెలిసిన వాళ్లు చేతులు ఎత్తండి.’ అనగానే సభికులు అంద రూ చేతులు పెకైత్తగానే గుర్తు తెలిసినవారు గుర్తు తెలియని వారికి చెప్పాలని ఆయన అన్నారు. అలాగే అవ్వా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్.. తమ్ముడూ ఫ్యాన్.. తాతా ఫ్యాన్ అంటూ సీలింగ్ ఫ్యాన్‌ను తి ప్పుతూ జగన్ చూపడంతో ఫ్యాన్ గుర్తుకే మన ఓటంటూ సభికులు నినాదాలతో హోరెత్తించారు.

 ఈసభల్లో ఆయన వెంట వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్‌అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట అసెంబ్లీ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్ సీపీ బలపరిచిన సీసీఎం మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, వైఎస్‌ఆర్ సీపీనేతలు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, మెండెం జయరాజు, దారెల్లి అశోక్, వనమా రాఘవేంద్ర, ఆకుల మూర్తి, భీమా శ్రీధర్, కాసుల వెంకట్, రజాక్, జేవీఎస్ చౌదరి, యర్రంశెట్టి ముత్తయ్య, పీక కృష్ణ,  సీపీఎం నేతలు  కాసాని ఐలయ్య, బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు