బ్యాలెట్ బరి.. బుల్లెట్ గురి

18 Apr, 2014 01:30 IST|Sakshi
బ్యాలెట్ బరి.. బుల్లెట్ గురి

ఎన్నికల వేళ కుటీర పరిశ్రమగా మారిన ఆయుధాలు, తూటాల తయారీ

ఉత్తరాదిన యథేచ్ఛగా విక్రయాలు

 
పన్యాల జగన్నాథదాసు: బ్యాలెట్ పోరు కోసం బుల్లెట్లకు గిరాకీ పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ముహూర్తాన్ని ప్రకటించిన నాటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్రమ ఆయుధాలపై అధికార యంత్రాంగం ఎంతగా నిఘా పెట్టినా, సోదాలు సాగిస్తున్నా, వాటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమ ఆయుధాలకు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పేరుమోసిన సంగతి తెలిసిందే.
 
ఈసారి తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పాలనలోని పశ్చిమ బెంగాల్‌లోనూ అక్రమ ఆయుధాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలోని మారుమూల ప్రాంతాల్లో అక్రమ ఆయుధాల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. ఇదివరకు నాటు తుపాకులను మాత్రమే తయారు చేసే ముఠాలు, ఇప్పుడిప్పుడే అధునాతన ఆయుధాలనూ సొంతంగా తయారు చేస్తున్నాయి.

మాఫియా ముఠాలకు, తీవ్రవాదులకు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసే ఈ ముఠాలు, ఎన్నికల సీజన్‌లో రాజకీయ పార్టీలకూ సరఫరా చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అక్రమ ఆయుధాల ధరలు కూడా పెరిగాయి. అయినా, రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనుకాడకుండా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో వివిధ ప్రాంతాల్లో చలామణీ అవుతున్న ఆయుధాలు, వాటి ధరవరల వివరాలు...
 
కట్టా (నాటు పిస్టల్): దీంతో ఒకసారి ఒకే తూటా కాల్చేందుకు అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రూ.1,500 వరకు ఉండే దీని ధర కొన్నిచోట్ల రూ.5 వేల వరకు ఎగబాకింది.

పౌనీ తమంచా: ఇది పిస్టల్ కంటే పెద్దగా, రైఫిల్ కంటే చిన్నగా ఉండే నాటు తుపాకీ. దీంతోనూ ఒకసారి ఒకే తూటా కాల్చగలరు. ఇది రూ.1,500 నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది.

మొరేనా పిస్టల్: దాదాపు ఆధునిక రివాల్వర్‌ను పోలిన ఆయుధం, దీనికి కూడా రివాల్వర్ మాదిరిగానే తూటాలతో కూడిన మ్యాగజైన్ ఉంటుంది. ఇది రూ.6 వేల వరకు పలుకుతోంది.

7 ఎంఎం హ్యాండ్‌గన్: పిస్టల్ తరహాలోనే ఉండే దీని ధర గడచిన ఏడాది వ్యవధిలోనే రూ.15 వేల నుంచి రూ.25 వేలకు ఎగబాకింది.
9 ఎంఎం హ్యాండ్‌గన్: ఈ హ్యాండ్‌గన్‌లో వాడే తూటాలు కాస్త పెద్దగా ఉంటాయి. దీని ధర రూ.24 వేల నుంచి రూ.45 వేలకు పెరిగింది.

సింగిల్ బ్యారెల్ గన్: ఏడాది కిందట రూ.8 వేలకే లభించే ఈ తుపాకీ ధర ఇప్పుడు రూ.20 వేలు పలుకుతోంది.
డబుల్ బ్యారెల్ గన్: దీని ధరకూ రెక్కలొచ్చాయి. రూ.30 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది.

.9ఎంఎం పిస్టల్ జేబులో తేలికగా ఇమిడిపోయే దీని ధర రూ.18 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోంది.

తూటాలు: .303 బుల్లెట్ ఒక్కోటి రూ.250-రూ.450, .15 బుల్లెట్ రూ.150-రూ.350, 7ఎంఎం హ్యాండ్‌గన్ బుల్లెట్ రూ.300-రూ.500, 9ఎంఎం హ్యాండ్‌గన్ బుల్లెట్ రూ.400-800 వరకు పలుకుతున్నాయి.
 
మారిన ట్రెండ్...
అక్రమ ఆయుధాల వాడకంలోనూ ఇటీవల శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాలను తయారు చేసే ముఠాలు ఇదివరకు ఎక్కువగా నాటురకం ఆయుధాలనే తయారు చేసేవారు. ఇప్పుడు ఈ ముఠాలు సైతం ఆధునికమైన ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఇదివరకు లాంగ్‌రేంజ్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేసే ముఠాలు, ఇటీవలి కాలంలో 9 ఎంఎం, .76 బోర్ పిస్తోళ్లు వంటి షార్ట్ రేంజ్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేస్తున్నాయని బీహార్ ఐజీ (ఆపరేషన్స్) అమిత్ కుమార్ చెప్పారు. హౌరా సమీపంలోని దాస్‌నగర్‌లో అక్రమ ఆయుధాల కర్మాగారంపై బెంగాల్ పోలీసుల సాయంతో జరిపిన దాడిలో ఇలాంటి ఆయుధాలే ఎక్కువగా దొరికినట్లు ఆయన తెలిపారు.
 
 ఆయుధాలూ ఆస్తులే!
‘సార్వత్రిక’ సమరంలో తలపడుతున్న చాలామంది అభ్యర్థులకు ఆయుధాలూ ఆస్తులే! అందుకే, వివిధ పార్టీలకు చెందిన దాదాపు వంద మంది అభ్యర్థులు తమ ఆస్తుల జాబితాలో పిస్టళ్లు, రైఫిళ్లు, రివాల్వర్లు వంటి వాటిని చేర్చారు.  వీరిలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అభ్యర్థులు మేనకా గాంధీ, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్, కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా, కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడ తదితరులు ఉన్నారు. వీరికి మించిన మరికొందరు అరబ్ జాతి అశ్వాలను, అరుదైన కళాఖండాలను, శిల్పాలను తమ ఆస్తులుగా ప్రకటించారు.
 
 లావాదేవీలన్నీ ‘కోడ్’లోనే...
అక్రమ ఆయుధాల వ్యాపారం బహిరంగ రహస్యమే అయినా, వీటి లావాదేవీలు బాహాటంగా జరగవు. నమ్మకస్తుల ద్వారా వచ్చే వ్యక్తులు ‘బ్యాటరీ, చార్జర్, సామాన్’ అంటూ ‘కోడ్’లో అడుగుతారు. లావాదేవీలన్నీ ‘కోడ్’లోనే జరుగుతాయని, బేరసారాలూ మామూలేనని బీహార్‌లో ఒకప్పుడు నాటు తుపాకీలను తయారు చేసే ఒక వ్యాపారి చెప్పాడు. బీహార్, యూపీలతోపాటు పశ్చిమ బెంగాల్‌లో పలు జిల్లాల్లో అక్రమ ఆయుధాల కర్మాగారాలు ఉన్నాయి.
 
ఎందరో స్వతంత్రులు..
1996 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల సంఖ్య ఏకంగా పదివేలకు మించి పోయింది. లోక్‌సభకు ఏ సంవత్సరంలో ఎందరు స్వతంత్రులు.. పోటీ పడ్డారంటే..?


 

మరిన్ని వార్తలు