-

ప్ర‘లాభం’!

27 Mar, 2014 02:21 IST|Sakshi

సత్తుపల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు వారిది సామాన్యకుటుంబం. ఎప్పుడైతే బుకీలుగా అవతారం ఎత్తారో వారి లైఫ్‌స్టైలే మారిపోయింది. ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. వారి ఫాలోవర్స్ (అనుచరుల) సంఖ్య కూడా పెరిగిపోయింది. ఓ రాజకీయపార్టీ అండదండలతో ఏకంగా ఈసారి నగరపంచాయతీ ఎన్నికల బరిలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని నిలబెట్టారు. డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతుండటంతో సత్తుపల్లిలో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లతో వార్డులో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బుకీల సోకులు చూసి సామాన్య ప్రజలు తమ అవసరాలకు డబ్బులు వస్తున్నాయనే ఆలోచనతో వాళ్ల ఇంటిముందు పడిగాపులు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

 ఏడాది నుంచే వ్యూహాత్మకంగా...
 ఏడాది నుంచే ఆ వార్డుపై బుకీ బ్రదర్స్ దృష్టిపెట్టారని సమాచారం. అప్పటినుంచి అక్కడి యువకులను మద్యం మత్తులో ముంచేసి హల్‌చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఇళ్లల్లో ఘర్షణలు పడుతున్నారని..ఈ మాయదారి ఎన్నికలు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకే వచ్చాయంటూ పలువురు మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరు యువకులు వారం, పదిరోజుల నుంచి ఇళ్లకు వెళ్లటం కూడా మానేసి మద్యం మత్తులో జోగుతున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఇప్పటికే లక్షలాది రూపాయలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఎక్కువ ఓట్లున్న పెద్దకుటుంబాలపై దృష్టిసారించి లక్షల రూపాయలు ఎరవేసి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ప్రచారం.
 ఆ పార్టీకి చెందిన

 ఇతర అభ్యర్థుల్లో టెన్షన్..
 బుకీల హల్‌చల్ ప్రభావం తమపై పడుతోందని ఆ పార్టీలోని ఇతర అభ్యర్థులు పైస్థాయి నాయకుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఒక్కో ఓటుకు కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వారు ఖర్చు చేస్తుండటంతో తమను కూడా అడుగుతున్నారంటూ ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడి నుంచి తెచ్చివాలని వాపోతున్నట్లు సమాచారం. తమ కుటుంబీకులకు వైస్ చైర్మన్ పదవి కట్టబెడితే కోటి రూపాయల వరకు ఖర్చుపెడతామని బహిరంగంగానే ఆ బుకీలు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. బుకీల సంబంధీకులు పోటీలో నిలబడి లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతున్నా.. ఎన్నికల నిఘా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యపౌరుడు ఎన్నికల్లో నిలిచే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.
 

మరిన్ని వార్తలు