జననేత దీక్షలే మాకు శ్రీరామరక్ష

5 May, 2014 23:58 IST|Sakshi
జననేత దీక్షలే మాకు శ్రీరామరక్ష

 వైఎస్సార్ కాంగ్రెస్ పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు
 
 ‘మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రజల కోసం ఎన్నో దీక్షలు, ఉద్యమాలుచేశారు. అవే మా గెలుపునకు శ్రీరామరక్ష కానున్నాయి. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, ఆప్యాయతలను ప్రజలు వైఎస్ జగన్‌పై చూపుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి మళ్లీ స్వర్ణయుగం తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. జననేత జగన్‌ను సీఎంను చేసేందుకు ఎదురుచూస్తున్నారు.’ అని పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఆయనతో సోమవారం న్యూస్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించగా పలు విషయాలు వెల్లడించారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 ప్రజలు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుపొందాలని కోరుకుంటున్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని విశ్వసిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి నేను ప్రత్యేక ప్రణాళిక రూపొందించాను. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే పర్యటించా. ప్రజల అవసరాలు నాకు తెలుసు. వాటికనుగుణంగా ప్రణాళిక తయారుచేయించాను. ఎమ్మెల్యేగా గెలవగానే దీన్ని అమలుచేస్తాను.
 
అభివృద్ధి పనులే ప్రధాన ధ్యేయం
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే బెల్లంకొండ అడ్డరోడ్డు నుంచి అమరావతి వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తా. అమరావతి, నరుకుళ్లపాడు మధ్యలో ప్రమాదభరితంగా ఉన్న చప్టాను హైలెవల్ బ్రిడ్జిగా నిర్మిస్తా. బెల్లంకొండ మండలంలో పులిచింతల నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా. కొందరికి నష్టపరిహారం అందక, మరికొందరికి పునరావాసం ఏర్పాటుకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన నాయకత్వంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాల్లో కృష్ణానదిపై లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటుచేసి రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా నీరందించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాను. పెదకూరపాడులో పేదలకు ఇళ్ల స్థలాలు, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తా. పులిచింతల ప్రాజెక్టుకు వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తా.
 
 యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి
 నియోజకవర్గంలో అత్యధికంగా పత్తి, మిర్చి పంటలు పండిస్తుంటారు. ఈ ప్రాంతంలో రైతుబజార్లు, పరిశ్రమల స్థాపనకు కృషి చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తా. నియోజకవర్గ కేంద్రం పెదకూరపాడుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తా. అమరావతిలో పర్యాటకులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేస్తాను.
 
 విద్యారంగ అభివృద్ధికి చొరవ

 నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మోడల్ పాఠశాలలు నిర్మించేలా చొరవతీసుకుంటాను. ఇతర ప్రభుత్వ రంగ విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అందరి సాయం తీసుకుంటా. ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో పనిచేస్తా.

మరిన్ని వార్తలు