మక్కీకి మక్కీ కాపీ!

8 Apr, 2017 00:11 IST|Sakshi
మక్కీకి మక్కీ కాపీ!

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  సరదాగా ఒక హ్యూమరస్‌ ఔట్‌లుక్‌!

‘‘కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే కొడుకు పుడ్తడు అని అంటరుకదా... అగో అట్లనే అయితున్నది’’ సైకిల్‌ దిగి స్టాండేసి చాయ్‌ హోటళ్లకు ఒచ్చుకుంట అన్నడు యాదగిరి. ‘సామెత మంచిగనే చెప్పినవ్గనీ... అసలు ముచ్చట ఏందో చెప్పు...’ చాయ్‌ సప్పరిచ్చుకుంట అడిగిండు నర్సింగ్‌. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు సారు మస్తు బిజీ అయిండు. అమరావతి గురించి సోచాయించి యించి ఏం సుదరాయిస్తలేదు. ఏం చెయ్యాల్నో తెల్వక ఏదో ఒకటి చెయ్యాలె కదాని వాళ్ల బాబును మంత్రిని చేసిండు’’ అన్నడు యాదగిరి. ‘‘చెంద్రబాబు సారు ఇప్పుడు కొడుకును మంత్రిని చేసిండుగనీ... కేసీఆర్‌ అయితే కేటీఆర్ను మొదట్లనే మంత్రిని చేసి, ఐటి, పంచాయితీరాజ్‌ శాఖ ఇచ్చిండు’’ అన్నడు నర్సింగ్‌.

‘‘వాళ్ల బాబుకు కూడా అవే శాఖలు ఇచ్చిండు చంద్రబాబు’’ అని గొప్ప పోయిండు యాదగిరి.‘‘అరె యాదగిరి! అంటే అన్ననంటరు గనీ. ఇంకెవరు దొరకలేదా బాబుకు. కేసీఆరే దొరికిండా?’’ అని గదమాయించిండు నర్సింగ్‌. ‘‘ఏమైందిరా? ఏం చేసిండు చెంద్రబాబు ?’’ లేసి నిల్చున్నడు యాదగిరి. ‘‘ఏం చేసుడేంది? కేసీఆర్ను మక్కీకి మక్కి కాపీ కొడుతున్నడు. కేసీఆర్‌ ఎట్ల చేస్తే అట్ల చేస్తున్నడు... ఇదేం పద్దతి?’’ గయ్యిమన్నడు నర్సింగ్‌.   ‘చంద్రబాబు కాపీ కొడుతున్నడా? ఏం కొట్టిండు చెప్పు?’’ నిలదీసిండు యాదగరి. ‘‘కేటీఆర్ది ఐటి శాఖ కావట్టి చినబాబుకు కూడా ఐటీ శాఖ ఇచ్చిండు. ఇంతకంటే ఇంకేం కావాలె?’’ అన్నడు నర్సింగ్‌. ‘‘అట్లకాదురా... కేటీఆర్‌ లెక్క విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్త అన్నడేమో చినబాబు. అందుకే ఆయనకుగా శాఖ ఇచ్చిండ్లేమో’’ జేబులో నుంచి బీడీ తీసి నోట్లో పెట్టకున్నడు యాదగిరి. 

‘‘మరట్లయితే కేటీఆర్‌ ఎమ్మెల్యేగా గెలిసి మంత్రి అయిండు... మరి చినబాబు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలే?’’ సల్లారిపోయిన చాయ్‌ తాగుకుంటూ యాదగిరిని కొచ్చన్‌ చేసిండు నర్సింగ్‌.   ‘‘ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా అని కాదు. మంత్రి అయిండా లేదా అన్నదే సూడాలె’’ లాపాయింట్‌ లేవదీసిండు యాదగిరి. ‘‘అయితే కేటీఆర్‌ ఎట్ల చేస్తే చినబాబు అట్ల చేస్తడా...?’’ రెట్టించి అడిగిండు నర్సింగ్‌.‘‘ఆయనకేమన్న భయమా?’’ అన్నడు యాదగిరి. ‘‘లంచం అడుగుతే చెప్పుతోని కొట్టుర్రి అన్నడు కేటీఆర్‌. చినబాబును అట్ల అనుమను సూద్దాం’’ సవాల్‌ చేసిండు నర్సింగ్‌.  ‘‘చినబాబు ఇప్పుడే మంత్రి అయిండు. ఇసొంటి పెద్ద పెద్ద మాటలంటే గా పార్టీ లీడర్లు చానమంది బాధపడ్తరు’’ అని సైకిలెక్కాడు యాదగిరి.
– ఓరుగల్లు శ్రీ
 

మరిన్ని వార్తలు