చరిత్ర సృష్టించిన ఏక్తా కపూర్‌!..ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు!

22 Nov, 2023 09:11 IST|Sakshi

భారతీయ టెలివిజన్‌ రంగాన్ని మహారాణిలా ఏలుతున్నఏక్తా కపూర్‌ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్‌ కంటెంట్‌ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డ్సులో ఆమెను ‘డైరెక్టరేట్‌ అవార్డ్‌’ వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి  భారతీయురాలు ఏక్తా. మంగళవారం తెల్లవారుజామున (అమెరికాలో సోమవారం రాత్రి) న్యూయార్క్‌లో ఈ అవార్డు బహూకరించారు.

ఏక్తా కపూర్‌ (48)కు ముందు అభినందనలు చెప్పాలి. టెలివిజన్‌ రంగంలో సుదీర్ఘకాలం నిలిచినందుకు, ఢక్కామొక్కీలు తిని విజయం సాధించినందుకు, వేల మందికి ఉపాధి కల్పించినందుకు, టెలివిజన్‌ చానల్స్‌ ప్రైమ్‌టైమ్‌ను ఏదో ఒక కాలక్షేపంతో నింపినందుకు, ఇంకా కొనసాగుతున్నందుకు. ఇప్పటివరకూ ఆమె 17,000 గంటల టెలివిజన్‌ కంటెంట్‌ను ప్రొడ్యూస్‌ చేసిందంటే దాని వెనుక శ్రమను, ప్యాషన్‌ను, వ్యాపార శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... 45 సినిమాలను కూడా ఆమె ప్రొడ్యూస్‌ చేసింది. వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా నాసిరకం/సరసమైన కంటెంట్‌ను తయారు చేసి విమర్శలు ఎదుర్కొన్నా అన్ని రకాల జానర్స్‌లో కంటెంట్‌ తయారు చేస్తాను... దేనికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు అనే ధోరణిలో ముందుకు దూసుకుపోతోందామె. అందుకే ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 

అంతర్జాతీయ గుర్తింపు
అమెరికాలోని ‘ఇంటర్నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ప్రతి సంవత్సరం అమెరికా బయటి దేశాలలో టెలివిజన్‌ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డు’లను బహూకరిస్తుంది. ఇవి టెలివిజన్‌ ఆస్కార్స్‌లాంటివి. ఈ అవార్డులు భారతీయులకు వరించడం తక్కువ. వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో విశిష్టమైన ‘డైరెక్టరేట్‌ అవార్డు’ను ఈ సంవత్సరానికి ఏక్తా కపూర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా. అకాడెమీ సీఈవో బ్రూస్‌ ప్రైస్నర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ మాస్‌ ప్రేక్షకులను, సౌత్‌ ఏసియా ప్రేక్షకులను ఏక్తా కపూర్‌ తన  సీరియళ్ల ద్వారా చేరగలిగింది. టెలివిజన్‌ రంగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉంది’ అని కొనియాడారు. న్యూయార్క్‌లో అవార్డు అందుకున్న ఏక్తా ‘ఈ అవార్డు నా మాతృదేశం కోసం’ అంటూ భావోద్వేగానికి గురైంది. 

విభిన్న వ్యక్తిత్వం
ఏక్తా కపూర్‌ టెలివిజన్‌ రంగంలో (1995) అడుగు పెట్టే సమయానికి అదంతా పురుష ప్రపంచం. తండ్రి జితేంద్ర (నటుడు) దగ్గర 50 లక్షలు తీసుకొని ‘బాలాజీ టెలి ఫిల్మ్స్‌’ కింద కొన్ని పైలట్‌ ప్రాజెక్ట్స్‌ తీస్తే అన్నీ రిజెక్ట్‌ అయ్యాయి. దాంతో 50 లక్షలూ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె ‘మానో యా మానో’, ‘హమ్‌ పాంచ్‌’ సీరియల్స్‌తో హిట్స్‌ మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ‘కె’ అక్షరం సెంటిమెంట్‌తో మొదలెట్టిన ‘క్యూంకి సాస్‌భీ కభీ బహూ థీ’ టెలివిజన్‌ చరిత్రను తిరగరాసింది. ఇది పొందినంత టిఆర్‌పి మరే సీరియల్‌ పొందలేదు. ‘కహానీ ఘర్‌ ఘర్‌ కీ’, ‘పవిత్ర రిష్టా’, ‘కుంకుమ్‌ భాగ్య’ లాంటి 134 సీరియల్స్‌ ఇప్పటి వరకూ తీసింది. పెద్ద పెద్ద సెట్లు, మహిళా పాత్రధారులకు ఖరీదైన చీరలు, ఆభరణాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఏక్తా మొదలుపెట్టి మొత్తం దేశంలో అదే ట్రెండ్‌ ఫాలో అయ్యేలా చేసింది.

సరోగసి ద్వారా 
ఏక్తా వివాహం చేసుకోలేదు. కాని 2019లో సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. కొడుక్కి తండ్రి పేరు ‘రవి కపూర్‌’ అని పెట్టుకుంది. అవార్డు వేదిక మీద ఏక్తా మాట్లాడుతూ ‘మా నాన్నకు, నేనిక్కడ ఉంటే నా కొడుకు కోసం బేబీ సిట్టింగ్‌ చేస్తున్న మా అన్నయ్య తుషార్‌కపూర్‌కు కృతజ్ఞతలు’ అంది. ప్రస్తుతం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆల్ట్‌ బాలాజీ కోసం ఏక్తా ఎక్కువగా కంటెంట్‌ను తయారు చేస్తోంది.

(చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే)
 

మరిన్ని వార్తలు