క్రోధం తొలగించుకోవాలి

2 Oct, 2015 23:59 IST|Sakshi
క్రోధం తొలగించుకోవాలి

విద్య - విలువలు
 
నాకు పిల్లలని ఉద్దేశించి మాట్లాడడం అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకనీ అంటే ఒకటే కారణం... అందులో నా కర్తవ్యం ఒకటి ఉంది... నేను వయస్సులో మీకన్నా పెద్దవాణ్ణి. నేనూ మీలానే చదువుకున్నాను. ఉద్యోగం చేశాను. గృహస్థాశ్రమంనిర్వహిస్తున్నాను.ఎంతోమందితో సత్సంబంధాలు నెరపాను. నా అనుభవాన్ని మీకు చెబితే రేప్పొద్దున మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
 
ఒకసారి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వేదపాఠశాల వైపు వెళుతున్నారు. పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ, మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు. ఆయన ఇద్దరు పిల్లలను పిలిచి ‘‘ఏరా మీరిలా ఆడుకుంటున్నారు. మీకు పాఠం చెప్పవలసిన ఉపాధ్యాయుడు రాలేదా?’’ అని అడిగారు.  ఒక పిల్లాడు అన్నాడు. ‘‘గురువుగారు రాలేదండీ - ఇంకా’’ అన్నాడు. రెండోపిల్లాడు అన్నాడు ‘‘మా గురువుగారు వచ్చి పాఠం చెబుతున్నారండి. మేమే బయటికి వచ్చి ఆడుకుంటున్నాం’’ అన్నాడు. దీంతో పరమాచార్య సంకటస్థితిలో పడ్డారు. నిజానిజాలు తేల్చుకోవడానికి ఆ పిల్లలను వెంట బెట్టుకొని పాఠశాలలోకి వెళ్ళి వాకబు చేశారు. అక్కడివారు వీళ్ల గురువుగారు రాలేదని చెప్పారు. అప్పుడు ఆయన ‘‘ఎందుకిలా చెప్పావ్’’ అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు. ‘‘శిష్యుడు తమకు అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి ప్రతిష్ఠ కాపాడాలి. గురువుగారంటే సాక్షాత్తు ఈశ్వరుడని మీరే ఒకనాడు అనుగ్రహ భాషణంలో చెప్పారు. రోజూ వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చొని చదువుకోకుండా బయటికొచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది. ఆ పాపం నాది. ఇప్పుడు మా గురువుగారి మీద మీకు కోపం వస్తే, నేను చాలా పాపం మూట కట్టుకున్నవాణ్ణి అవుతాను. గురువుగారి ప్రతిష్ఠ నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నామీద వేసుకున్నాను. గురువుగారి ప్రతిష్ఠ నిలబెట్టడం కోసం చిన్న అబద్ధం ఆడడం చేత దోషం రాదు అని మీరే చెప్పారు. కాబట్టి నేను దోషం చేయలేదు అనే అనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘గురువంటే నీకర్థమైంది రా నిజంగా’’ అన్నారు. పరమాచార్య స్వామివారు.
 
ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఒకటుంది. ఒకరు చెబితే వినకపోవడం. సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడికొక్కడికే ఉన్నది. కాని దురదృష్టం ఏమంటే నేటి రోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే చాలా గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట బీష్మద్రోణకృపాచార్యుల వంటి వారున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడు... అంటే ఒకటే కారణం చెబుతారు పెద్దలు. మహర్షులందరూ చెప్పారు ఒకచోట కూర్చోబెట్టి, ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల ఇలా పాడైపోతావు. కాబట్టి మా మాట విను. నీవు ఇలా చెయ్యకు’’ అన్నారు. అంటే ఆయనన్నాడు.
 ‘‘జానామి ధర్మం నచమే ప్రవృత్తిః, జానామి అధర్మం నచమేనివృత్తిః’’ మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను. ఈ మాట అనడానికి మనుష్య జన్మ అక్కరలేదు. ఇది చెడు అని తెలిస్తే చెయ్యకుండా నిగ్రహించుకోవడానికే మనుష్యుని జన్మ. ఇది చెడు అని చెప్పినా చెయ్యకుండా ఉండలేనూ అన్నాడంటే అతడు పశువు కన్నా హీనం. ఇది చాలా ప్రమాదకరం.

నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. సామాజిక స్పృహ అంటే నేను మీకు ఒక విషయాన్ని మనవి చేస్తున్నా. జాగ్రత్తగా వినండి. రేప్పొద్దున మీరు ఉద్యోగాలు చేశాక మీ జీతాల్లోంచి ట్రస్టులు పెట్టండి. మీరు పిల్లలని చదివించండి. మీరు దేశానికి సేవ చేయండి. ఇలా నేను ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకు లేను అని మీరంటారేమో. అది మీరు చేసి తీరుతారు అని నా నమ్మకం. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికి అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి.

ఒక పెద్ద చందన వృక్షం ఉంది. దాంట్లోంచి ఒక కొమ్మ విరుద్దాం అంటే దానిపై పెద్ద త్రాచుపాము ఉంది. ఎవరైనా పొరపాటున చందనవృక్షం దగ్గరికి వెడతారా? ఒక చింత చెట్టు కింద ముళ్లుంటే తుడుచుకుని పడుకొంటారు కానీ చందన వృక్షం దగ్గరికి వెళ్లరు. అది చందన వృక్ష దోషమా? లేక చందన వృక్షం నల్లత్రాచుపాముని కలిగి ఉన్న దోషమా? ఒక నల్లత్రాచు చందన వృక్షం చేరింది. చందన వృక్షం దేనికీ పనికి రాకుండా పోయింది. కేవలం కోపం కారణంగా ఇంట్లో శాంతి ఉండదు. తను పనిచేస్తున్న ఆఫీసులో శాంతి ఉండదు. మీరు ఇవాళ బీటెక్ చదవొచ్చు. యం.టెక్ చదవొచ్చు. రేపొద్దున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. కానీ మీరు కోపాన్ని పెంచుకుంటే, ఎవరు చెప్పినా వినిపించుకోకపోతే, మీరే ఎందుకూ పనికి రాకుండాపోతారు. కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది. కోపం మీలోనే ఉంటుంది. మీలోనే ఉన్న కోపం అవకాశం కోసం ఎదురు చూస్తూంటుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసాండీ మీ వ్యక్తిత్వం దెబ్బతిన్నది అనే భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. నాకు చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏమిటి అంటే నా యందు లోపాలు చాలా ఉన్నాయి. అనడానికి గుర్తు. నేనెంతటి వాడిని అనుకున్నవాడు పోనీలెద్దు అందరూ ఒక్కలా ఉంటారా? అని క్షమించి విడిచిపెడతాడు. లేదా అలా ఉండకూడదమ్మా తప్పు. దానివల్ల నీవేం ప్రయోజనం సాధిస్తావు. నీవు పాడైతే నా మనస్సుకు బాధగా ఉంటుంది. అలా ప్రవర్తించకు అని చెబుతాడు. కోపం లేకపోతే అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తిత్వం దెబ్బతిని కోపం వచ్చినవాడు ఎంతటి పాపమైనా చేస్తాడు.

కోపావేశం వచ్చినటువంటి వాడు గురువుగారిని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పనులు చేసేసి జీవితపర్యంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప, నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్ఠివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు, కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దం ముందు మీకు మీరు నిలబడి చూసుకోండి. బ్లడ్‌ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు దేవాలయంలోకి వెళ్లి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే... మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తుకు వస్తుంది. ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు. ఉద్రేకపడిపోతుంటారు. ఆ సమయంలో అతనిక మనుష్యుడు కాడు, రాక్షసత్వం ఆవహించేస్తుంది.

నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు? ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టవచ్చు. పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తనెలా విడిచిపెడుతుందో ‘‘యథోరగస్తతం! జీర్ణం సవైపూర్ణాం పురుషముచ్యతే’’ అంటుంది రామాయణం. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు, తన కోపాన్ని తను పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు. మీకందులో సందేహం ఏమీలేదు. ఎందుకో తెలుసా... పదిమంది అతనితో మాట్లాడగలుగుతారు. అసలు కోపమన్నది లేకపోయేసరికి మీరు ఇంకొకరి మాటలో ఉన్న ఔన్నత్యాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించే అలవాటవుతుంది. తద్వారా మంచి ప్రణాళిక అందడానికి అవకాశం ఉంటుంది.
 
 

మరిన్ని వార్తలు