ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?

19 Nov, 2023 13:56 IST|Sakshi

‘సర్, చూడండీ.. అతను ఇక్కడే ఉన్నాడు. ఆ తలుపు చాటు నుంచి చూస్తున్నాడు’ అంది శోభ. నిజానికి అక్కడెవ్వరూ లేరు. అయినా ‘అతనెవరూ?’ అని అడిగాను. ‘తెలీదు సర్‌. కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఆఖరికి వాష్‌రూమ్‌కి కూడా. అందుకే స్నానం చేయడం కూడా మానేశా. ’‘ఎన్నాళ్ల నుంచీ ఇలా జరుగుతోంది? ’‘రెండు నెలల నుంచి సర్‌. ’‘ఇంకా ఏం జరుగుతోంది? ’‘నిన్ను చంపేస్తా అంటున్నారు సర్‌. ’‘ఎవరంటున్నారు? ’‘ఎవరో తెలియదు సర్‌. నాలోంచే మాటలు వినిపిస్తున్నాయి. చాలా భయమేస్తోంది. అందుకే ఎక్కడికీ వెళ్లడం లేదు. ’‘సర్లెండి. వాళ్లతో నేను మాట్లాడతాను’ అని ధైర్యం చెప్పా. 

శోభ ఒక గృహిణి. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అందమైన కుటుంబం. అయితే గత రెండు నెలలుగా శోభ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నారని, తనకు ఎవరో కనిపిస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడుతూ తన గది నుంచి బయటకు రావడంలేదు. మొదట సర్ది చెప్పాలని ప్రయత్నించిన భర్త తన ప్రయత్నాలు విఫలం కావడంతో కౌన్సెలింగ్‌ సెంటర్‌కు తీసుకువచ్చారు. శోభ డెల్యూజన్స్‌, హెలూసినేషన్స్‌తో బాధపడుతోందని అర్థమైంది. సైకో డయాగ్నసిస్‌ అనంతరం ఆమె స్కిజోఫ్రీనియాతో బాధపడుతోందని నిర్ధారించుకుని చికిత్సకోసం సైకియాట్రిస్ట్‌కు రిఫర్‌ చేశాను.  

తీవ్రమైన మానసిక రుగ్మత
స్కిజోఫ్రీనియా తీవ్రమైన మానసిక రుగ్మత. అది మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తూ ఆలోచనలు, జ్ఞాపకశక్తి, ప్రవర్తనలో జోక్యం చేసుకుంటుంది. దానివల్ల రోజువారీ జీవితం కష్టంగా మారుతుంది. ఇది లక్షకు 220 మందిలో కనిపిస్తుంది. ప్రాణాంతకం కాదు. కానీ ప్రమాదకరమైన, హానికరమైన ప్రవర్తనలకు దారితీయవచ్చు. మూడింట ఒక వంతు మందిలో లక్షణాలు కాలక్రమేణా తీవ్రం అవుతాయి. పదిశాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల సక్రమంగా చికిత్స చేయిస్తూ, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. 

మూడు ప్రధానకారణాలు..
స్కిజోఫ్రీనియాకు నిర్దిష్టంగా ఒక కారణమంటూ లేదు. వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, తీవ్రమైన ఒత్తిడి కారణాలు కాగలవు. అలాగే గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యం, తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. యుక్తవయసులో భారీగా గంజాయి వాడకం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంలో స్కిజోఫ్రీనియా ఉంటే వచ్చే ప్రమాదం ఎక్కువ.

స్కిజోఫ్రీనియాకు మూడు ప్రధాన కారణాలు:
1. సెల్‌–టు–సెల్‌ కమ్యూనికేషన్‌ కోసం మీ మెదడు ఉపయోగించే రసాయన సంకేతాలలో అసమతుల్యత.
2. పుట్టుకకు ముందు మెదడు అభివృద్ధి సమస్యలు.
3. మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్షన్లు నష్టపోవడం. 

శాశ్వత చికిత్స లేదు..
స్కిజోఫ్రీనియాను శాశ్వతంగా నయం చేసే చికిత్స లేదు. అయితే చికిత్సతో లక్షణాలను మేనేజ్‌ చేయవచ్చు. కొద్దిమంది పూర్తిగా కోలుకోవచ్చు. 

  • స్కిజోఫ్రీనియా చికిత్సలో సాధారణంగా యాంటీసైకోటిక్స్‌ మందులు ఉపయోగిస్తారు. ఇవి సెల్‌–టు–సెల్‌ కమ్యూనికేషన్‌ కోసం మెదడు స్రవించే రసాయనాలను అడ్డుకుంటాయి ∙కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (ఇఆఖీ) వంటి టాక్‌ థెరపీ పద్ధతులు పరిస్థితిని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. 
  • ఇతర చికిత్సలు పని చేయకపోతే వైద్యులు ఎలక్ట్రోకన్వల్సివ్‌ థెరపీ (ఉఇఖీ)ని సిఫార్సు చేయవచ్చు ∙స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. వైద్యులు చెప్పకుండా ఆపకూడదు 
  • నిర్దేశించినట్లుగా డాక్టర్‌ని సంప్రదించాలి. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా చర్చించాలి. 
  • ∙మద్యం, మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి ∙కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. 

ఐదు ప్రధాన లక్షణాలు..
స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వ్యక్తులు లక్షణాలను గుర్తించలేరు. కానీ చుట్టూ ఉన్నవారు గుర్తించవచ్చు. దీనికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు నెలకు పైబడి కనిపించినా వెంటనే సైకాలజిస్ట్‌ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. సైకోడయాగ్నసిస్‌తో పాటు వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ చేసుకోవాలి. 
1. కొన్ని నమ్మకాలు తప్పు అని చాలా సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవి నిజమేనన్న భ్రమలో ఉండటం.
2. ఎవరికీ వినిపించని స్వరాలను వినడం, ఎవరూ చూడలేని వాటిని చూడటం. అలాగే వాసన, రుచి చూడగలగడం.
3. ఆలోచనల్లో గందరగోళం వల్ల మాటల్లో కూడా స్పష్టత లేకపోవడం. అసంబద్ధంగా మాట్లాడటం.
4. చుట్టూ ఉన్న వ్యక్తులు ఊహించిన దానికంటే భిన్నంగా కదలడం లేదా ఎలాంటి కదలికలూ లేకుండా రాయిలా ఉండిపోవడం.
5. రోజువారీ పనులను చేయగల సామర్థ్యం తగ్గడం లేదా కోల్పోవడం. మాటల్లో, ముఖకవళికల్లో ఎలాంటి ఎమోషన్స్‌ చూపకపోవడం.  
6. ఇంకా పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, అనుమానించడం, భయపడటం, నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు.  

సైకాలజిస్ట్‌ విశేష్‌

(చదవండి: ఎక్స్‌ట్రీమ్‌ వెయిట్‌ లాస్‌ స్టార్‌ జస్ట్‌ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?)

మరిన్ని వార్తలు