బిడ్డకు రక్తం పంచబోతున్నారా?

31 Oct, 2019 03:01 IST|Sakshi

గర్భిణులలో రక్తహీనత

మన దేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉందని ఒక అంచనా. ఓ మోస్తరు రక్తహీనత దీర్ఘకాలం కొనసాగినా రకరకాల అనర్థాలు వస్తాయి. అయితే గర్భవతుల్లో రక్తహీనత వల్ల ఇటు కాబోయే తల్లికీ, అటు పుట్టబోయే బిడ్డకూ ప్రమాదమే.కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అనీమియా కేసులు ఎక్కువే... మరీ ముఖ్యంగా గర్భవతుల్లో. కాబట్టి ఈ రక్తహీనత వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని అధిగమించడానికి మార్గాలను తెలుసుకుందాం.

రక్తంలోని ఎర్రరక్తకణాలుగాని, దానిలో ఉండే పిగ్మెంట్‌ అయిన హీమోగ్లోబిన్‌గాని లేదా రెండూగాని తక్కువ అయితే వచ్చే సమస్యను రక్తహీనత (అనీమియా) అంటారు. కారణాలను బట్టి రక్తహీనతల్లో చాలా రకాలున్నాయి. గర్భిణుల్లో 90 శాతం రక్తహీనత ఐరన్‌ లోపం వల్ల, 5 శాతం ఫోలిక్‌ యాసిడ్‌ లోపం వల్ల ఏర్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం రక్తంలో 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్‌ ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా పరిగణించాలి.

గర్భిణుల్లో రక్తహీనత ఎందుకు ఏర్పడుతుందంటే?
గర్భిణుల్లో మామూలు మహిళల కంటే 40 శాతం (అంటే 1 నుంచి 2 లీటర్లు) ఎక్కువగా రక్తం వృద్ధి అవుతుంటుంది. గర్భంలో ఎదిగే బిడ్డకు ఆహారం, ఆక్సిజన్‌ సమృద్ధిగా అందడానికి వీలుగా ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది. గర్భం ధరించిన నాలుగో నెల నుంచి మహిళల్లో రక్తం వృద్ధి చెందడం మొదలువుతుంది. ఎనిమిదో నెల నిండేసరికి ముందున్న దానికంటే రక్తం 40–50 శాతం పెరుగుతుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్న స్త్రీకైనా గర్భం వచ్చిన 5–6 నెలలకి రక్తంలోని ప్లాస్మా పెరగడం వల్ల హీమోగ్లోబిన్‌ శాతం తగ్గుతుంది. రక్తం పట్టడానికి తగిన ఆహారం, ఐరన్‌ మాత్రలు వాడేవారిలో మళ్లీ కొద్దివారాల్లోనే హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. అలా తీసుకోని వారిలో హీమోగ్లోబిన్‌ శాతం మరింత తగ్గుతుంది.  

రుతుస్రావం కూడా మరో కారణం...
రుతు సమయంలో సాధారణంగా ఐదు రోజుల పాటు రక్తస్రావం అయ్యే మహిళల్లో నెలకు 45 సి.సి. రక్తం కోల్పోతేæ15 మి.గ్రా. ఐరన్‌ను కోల్పోయినట్లే. అంతకంటే ఎక్కువ బ్లీడింగ్‌ అయ్యేవారిలో ఇంకా ఎక్కువగా ఐరన్‌ తగ్గిపోతుంది. వీరు సరిగా ఆహారం తీసుకోకపోతే రక్తహీనత కలగవచ్చు. ఇక అప్పటికే రక్తహీనతతో ఉన్న మహిళ గర్భం ధరిస్తే... అనీమియా తీవ్రత మరింత పెరగవచ్చు.

రక్తహీనత నివారణ / చికిత్స...
►21 ఏళ్లకంటే ముందర గర్భం రాకుండా చూసుకోవాలి.
►గర్భం దాల్చిన తర్వాత నాల్గవ నెల నుంచి పౌష్టికాహారంతో పాటు రోజూ ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ ఉన్న మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి
►నులిపురుగులు, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ వంటివి ఉంటే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి
►కాన్పుకి, కాన్పుకి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండేట్లు జాగ్రత్త పడటం వల్ల ఐరన్‌ నిలువలు పెరిగి మరో కాన్పుకు రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు.

సవరించడానికి...
►రక్తహీనతకు గల కారణాలను గుర్తించి దాన్ని బట్టి చికిత్స చేయాలి.
►డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ మాత్రలు వాడాలి. బలంగా ఎదిగే పిల్లలతో ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం గర్భవతుల్లో రక్తహీనత సమస్యను తప్పనిసరిగా అధిగమించాల్సిన అవసరం ఉంది. అందుకే మహిళల్లో రక్తహీనతతోపాటు మరీ ముఖ్యంగా గర్భవతుల్లో అనీమియా సమస్యను నివారించడానికి సమాజం మొత్తం ఈ విషయంపై అవగాహన పెంచుకోవడం అవసరం.

గర్భవతుల్లో రక్తహీనత లక్షణాలు
►తీవ్రతను బట్టి లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. సాధారణంగా కనిపించేవి...
►అలసట;
►గుండెదడ;
►కళ్లుతిరగడం;
►తలనొప్పి;
►తలబరువుగా ఉన్నట్లు అనిపించడం;
►ఆయాసం;
►కొంచెం పనికే ఊపిరి అందకపోవడం;
►నిద్రపట్టకపోవడం;
►ఆకలిలేకపోవడం;
►కాళ్లూ, చేతులు మంటలు,  నొప్పులు;
►నోరు, నాలుకలో నొప్పి, పుండ్లు;
►నీరసం;
►బియ్యం, మట్టి తినాలనిపించడం;
►చర్మం మ్యూకస్‌పొరలు పాలిపోయి ఉండటం;
►కాళ్లవాపు;
►గుండె వేగంగా కొట్టుకోవడం;
►గోళ్లు పలచగా తయారవ్వడం, జుట్టు రాలిపోవడం.  

రక్తహీనతలో రకాలు
స్వల్పరక్తహీనత (మైల్డ్‌)      ...       8.7 గ్రా. నుంచి 10 గ్రా. ఉంటే
ఒకమోస్తరు రక్తహీనత (మోడరేట్‌)     ...  6.6 గ్రా. నుంచి 8.6 గ్రా. ఉంటే
తీవ్రమైన రక్తహీనత (సివియర్‌)    ...  6.5 గ్రా. కంటే తక్కువ

రక్తహీనతకు కారణాలు
►గర్భం వచ్చాక రక్తంలో జరిగే మార్పుల వల్ల హీమోగ్లోబిన్‌ పరిమాణం తగ్గడం.
►ఆర్థిక, సామాజిక కారణాల వల్ల పౌష్టికాహార లోపం కారణంగా ఇనుము, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12 లోపం.
►జంక్‌ఫుడ్‌ తీసుకోవడం.
►జీర్ణవ్యవస్థలో నులిపురుగులు ఉంటే అవి రక్తాన్ని పీల్చుకోవడం
►జీర్ణకోశంలోని కొన్ని సమస్యల వల్ల ఆహారం నుంచి ఐరన్‌ సక్రమంగా రక్తంలోకి చేరకపోవడం (కడుపులో అల్సర్లవంటి కారణాల వల్ల కూడా)
►రక్తవిరేచనాలు, మొలలు
►గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవసమయంలో రక్తస్రావం.
►దీర్ఘకాలంగా మలేరియా వ్యాధితో బాధపడుతున్నవారిలో ఎర్రరక్తకణాలు విరిగిపోవడం.
►దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, లక్షణాలేమీ బయటకు కనపడకుండా మూత్రవ్యవస్థలో బ్యాక్టీరియా చేరడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం.
►యువతులు 21 ఏళ్ల లోపు గర్భం ధరిస్తే ఐరన్, ప్రోటీన్స్‌ వంటివి బాలిక శరీరానికీ, గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుదలకూ... ఇలా ఇద్దరికీ అవసరం ఉంటుంది. కాబట్టి అవి సరైన పాళ్లలో అందక రక్తహీనత రావచ్చు.
►పుట్టుకతో వచ్చే థలసీమియా, సికిల్‌సెల్‌ డిసీజ్‌ వంటి వాటి కారణంగా.
►అరుదుగా వచ్చే ఎప్లాస్టిక్‌ అనీమియా, రక్తసంబంధిత వ్యాధుల వల్ల
►కాన్పుకి, కాన్పుకి మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవడం వల్ల
►క్షయ, కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు