Deficiency Anemia-Iron Rich Foods: రక్తహీనతతో బాధపడుతున్నారా? మీ డైట్‌లో ఇవి చేర్చుకోండి

10 Nov, 2023 16:55 IST|Sakshi

మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, హీమోగ్లోబిన్‌ తక్కువ శాతంలో ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రధాన ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌. మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు మోసుకెళ్లి అందించేంది ఇదే.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.మోగ్లోబిన్‌ లెవల్స్ పడిపోయిన వారిలో రక్తం శరీర అవయవాలకు అందక శరీరం చచ్చుబడిపోయేలా మారుతుంది.మరి రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం.

రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్‌  ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. 

► బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్‌–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు.

► అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్‌ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

► దానిమ్మ, బీట్‌రూట్‌లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. 

► నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు.

►  రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్‌ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్‌రూట్‌ లో ఐరన్, ప్రొటీన్‌ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది.

►  రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.

►  కిస్‌మిస్‌ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది.

► రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది.
► అంజీర్‌ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది.
► లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది.
► ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది.


 

మరిన్ని వార్తలు