కోటాలో ఇలాంటివి కామన్‌..

7 Sep, 2019 08:14 IST|Sakshi

ముంబై ఐఐటీలోని యాభై శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు చీటింగ్‌ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు.. – 2014, ఆగస్టు – టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వే
దేశంలో ప్రతి గంటకు ఓ స్టూడెంట్‌ ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు.– 2018, మార్చి – ఎకానమిక్‌ టైమ్స్‌
దేశంలోని మొత్తం ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌లో కేవలం 7 శాతం మందే ఉద్యోగానికి అర్హులు..– యాస్పైరింగ్‌ మైండ్స్‌ స్టడీ – 2016, జూలై – ఇండియా టుడే
ఇండియన్‌ మార్కెట్‌లో కోచింగ్‌ సెక్టార్‌ విలువఅక్షరాలా 45 వేల కోట్ల రూపాయలు..– 2008, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌
దేశంలో 297 నకిలీ టెక్నికల్‌ కళాశాలలు, 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు తేల్చింది
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)...– 2017, మార్చి – హిందుస్తాన్‌ టైమ్స్‌

ఈ డేటా విద్యకు సంబంధించిన సీరియస్‌ వ్యాసానికి నాందీప్రస్తావన కాదు.. తల్లిదండ్రుల కలలు, ఆశలు, ఆశయాల సాధనకు పిల్లలనుపరీక్షపెడితే వచ్చిన ఫలితం!! జీ5లో స్ట్రీమ్‌ అవుతున్న ‘వై చీట్‌ ఇండియా’ అనే సినిమా చూపించిన ప్రాక్టికాలిటీ! డాక్టర్, ఇంజనీర్‌ అనే ‘పుట్టుమచ్చ’తో ఉన్న పిల్లల కోసం ఎంసెట్,ఐఐటీ కోచింగ్‌ సెంటర్లు పోటీలునిర్వహిస్తున్నాయి.. చతికిలబడుతున్న విద్యార్థుల రాతను మెరిట్‌ స్టూడెంట్స్‌తో రీరైట్‌ చేయిస్తున్నాయి.. నకిలీ సర్టిఫికెట్స్‌తో పేరెంట్స్‌ కలను సాకారం చేస్తున్నాయి! ఇలాంటి రియల్‌ సిస్టమ్‌ అందించిన నకలు చీటీయే వై చీట్‌ ఇండియా!!

ఆ కథే ఇక్కడ...
రాకేశ్‌ సింగ్‌ ఉరఫ్‌ రాకేశ్‌... ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లో విఫలమవుతాడు. అతని అన్న.. మెడికల్‌ ఎంట్రెన్స్‌ సీట్‌ సంపాదించి డాక్టర్‌ అవుతాడు. దాంతో ఆ ఇల్లు రాకేశ్‌కు అవమానాల పుట్టిల్లు అవుతుంది. అతని ఆసక్తులు, అభిరుచులకు ఆ ఇంట్లో విలువ ఉండదు. చివరకు పెళ్లి కూడా అతని ఇష్టానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఏ ఎంట్రెన్స్‌ అయితే తనను ఫెయిల్యూర్‌గా నిలబట్టిందో ఆ ఎంట్రెన్స్‌కు సంబంధించిన కోచింగ్‌ సెంటర్‌ పెట్టి సక్సెస్‌ సాధించాలనుకుంటాడు. సాధిస్తాడు కూడా! ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీలాంటి పట్టణంలో ఎంసెట్, ఐఐటీ, ఎంబీఏ  కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తూంటాడు. పిల్లలను ఐఐటీ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఏంబీఏ గ్రాడ్యుయేట్స్‌గా చూడాలనుకునే తల్లిదండ్రుల ఆశయాలను క్యాష్‌ చేసుకుంటూంటాడు. సీట్‌ గ్యారెంటీ అనే ట్యాగ్‌లైన్‌తో పేరెంట్స్‌కు భరోసా కల్పిస్తుంటాడు. మిగిలిన శిక్షణాకేంద్రాల్లోలా మెరిట్‌ స్టూడెంట్స్‌ని కాకుండా సాధారణ విద్యార్థులనూ చేర్చుకుంటాడు. వీళ్ల కోసం డబ్బు అవసరం ఉన్న మెరిట్‌ స్టూడెంట్స్‌తో ఎంట్రెన్స్‌ పరీక్షలు రాయించి సీట్‌ తెప్పిస్తాడు. అలాగే అకడమిక్స్‌లో కూడా పరీక్షలు రాయించి పాస్‌ చేయిస్తూంటాడు. ఈ పద్ధతిలో దేశమంతా వ్యాపారం చేస్తూంటాడు. అలా ఝాన్సీలో సత్యేంద్ర అనే విద్యార్థి రాకేశ్‌ కంట్లో పడ్తాడు.

సత్యేంద్ర స్టోరీ..
సత్యేంద్ర ఉరఫ్‌ సత్తూ... ఒక ప్రభుత్వ గుమాస్తా కొడుకు. అతనికి ఒక అక్క నూపుర్‌. కూతురిని బరువుగా.. కొడుకుని గారంగా చూసే కుటుంబానికి వారసుడు. నూపూర్‌కు ఎంబీఏ చేయాలనుంటుంది. ఆడపిల్లకు డిగ్రీ కన్నా ఎక్కువ చదువెందుకని వారించి డబ్బుతోపాటు తన ఆశనూ కొడుకు చదువుకి పెట్టుబడిగా పెడ్తాడు. కొడుకు ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేయాలని కోటాలోని పేరున్న కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తాడు. టూత్‌ పేస్ట్‌ అయిపోయినా అబ్బాయి షాప్‌కి వెళ్లి టైమ్‌ వేస్ట్‌ చేయకుండా ఆ టైమ్‌ను నాలుగు సమ్స్‌ను సాల్వ్‌ చేసుకోవడానికి వినియోగించుకోవాలని.. పేస్ట్, సబ్బు, షాంపూలాంటివి తెచ్చిపెట్టడానికి హాస్టల్లో అదనంగా ఒక మనిషినీ ఏర్పాటు చేస్తాడు (కోటాలో ఇలాంటివి కామన్‌). సెకన్లను కూడా సమ్స్‌తో కాలిక్యులేట్‌ చేసుకుంటూ అరక్షణం కూడా వృథా కానివ్వకుండా కష్టపడి చదివి ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంక్‌ సంపాదిస్తాడు సత్తూ. అలా తదుపరి చదువుకోసం సన్నాహాల్లో ఉండగా రాకేశ్‌కు తారసపడ్తాడు ఒక సినిమా హాల్లో. సత్తూ, అతని స్నేహితులను సినిమా థియేటర్‌లో స్థానిక నేత అండ్‌ గ్యాంగ్‌ ఇబ్బంది పెడ్తూంటే వాళ్లను ఎదిరించి సత్తూ దృష్టిలో హీరో అవుతాడు రాకేశ్‌. ఆ పరిచయంలోనే సత్తూ ఐఐటీ ర్యాంకర్‌ అని తెలుస్తుంది రాకేశ్‌కి. కాలేజ్‌లు ఓపెన్‌ అయ్యేదాకా.. తన దగ్గర ఉద్యోగం చేసేందుకు అవకాశమిస్తాడు రాకేశ్‌. ఆ వలలో పడ్తాడు సత్తూ. అతని తండ్రినీ ఒప్పిస్తాడు రాకేశ్‌.

అసలు కథ మొదలు..
రాష్ట్రాల ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లు, ఇతర ప్రవేశ పరీక్షలు, సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌.. ఇలాంటి వాటన్నిటికీ  ఆయా ప్రాంతాల్లో, కాలేజీల్లోని విద్యార్థుల తరపున పరీక్షలు రాసేందుకు సత్తూని పంపిస్తూంటాడు రాకేశ్‌. డబ్బులూ బాగానే ముట్టజెప్తూండడంతో సత్తూ తండ్రి కూడా అదేదో మంచి ఉద్యోగమని సంబరపడ్తూంటాడు. ఆ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన సత్తూ కోల్‌కతాలో ఉన్నప్పుడు డ్రగ్స్‌కి అలవాటు పడి.. వ్యసనంగా మార్చుకుంటాడు. ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాలవుతాడు. అప్పటికీ సత్తూ తండ్రికి అసలు విషయం తెలియదు. ఆసుపత్రి ఖర్చంతా రాకేశే భరిస్తాడు. అయితే సత్తూకి గాడ్‌ఫాదర్‌గా, బాస్‌గా, స్నేహితుడిగా ఇంటికి వస్తూన్న రాకేశ్‌ ఆకర్షణలో పడ్తూంది సత్తూ సోదరి నూపుర్‌. అతని పట్ల పెంచుకున్న ప్రేమతో తండ్రి చూసిన సంబంధాలనూ కాదంటుంది. ఆ విషయం రాకేశ్‌కూ అర్థమవుతుంది. సత్తూ ఆసుపత్రి పాలయినప్పడు చెప్తాడు తను వివాహితుడినని. మౌనంగా ఊరుకుంటుంది నూపుర్‌. సత్తూ కోలుకున్నాక నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ ఇచ్చి ఖతార్‌లో ఒక ఉద్యోగం చూపించి అతణ్ణి  అక్కడికి పంపించేస్తాడు రాకేశ్‌.

కొన్నాళ్లకు..
తను తన విద్యావ్యాపారాన్ని ముంబైకీ విస్తరింపచేస్తాడు రాకేశ్‌. బిజినెస్‌ మూడు పరీక్షలు.. ఆరు ఫలితాలుగా విరాజిల్లుతూన్న తరుణంలో అక్కడే.. ముంబైలో నూపుర్‌  తారసపడ్తూంది రాకేశ్‌కు. అక్కడొక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తూంటుంది నూపుర్‌. తల్లిదండ్రులు, సత్తూ గురించి క్షేమసమాచారాలు తెలుసుకుంటాడు. మళ్లీ స్నేహం మొదలవుతుంది ఇద్దరి మధ్యా. ‘‘ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లో ఫెయిల్‌ అయిన నాకు.. గంతకు తగ్గ బొంత చాలని.. ఓ సంబంధం చూసి పెళ్లిచేశారు. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వండి వడ్డించడమే ఇంటి కోడలు బాధ్యత అని గాఢంగా నమ్మే ఆమె మా అమ్మానాన్నకు కోడలైంది తప్ప నాకు భార్య కాలేకపోయింది. నువ్వు కాస్త లేట్‌గా కనిపించావ్‌’’ అంటాడు నూపుర్‌తో. కళ్లల్లో నమ్మకం కురిపిస్తుంది ఆమె. ముంబైలో కోచింగ్‌ సెంటర్ల మాఫియాను ఎదుర్కోవాల్సి వస్తుంది రాకేశ్‌కు. ఆ సమయంలోనే నూపుర్‌కు ఆఫీస్‌లో హెరాస్‌మెంట్‌ మొదలవుతుంది. ‘‘వేరే ఉద్యోగం చూసుకో’ అని సలహా ఇస్తాడు రాకేశ్‌. ‘ఎంబీఏ’ పట్టాలేంది ఈ తరహా జాబ్‌ ఎక్కడ దొరుకుతుంది? అంటుంది నూపుర్‌. ‘‘ఎంబీఏ చెయ్యి మరి’’ అంటాడు. ‘‘ప్రిపరేషన్‌కు టైమ్‌ ఎక్కడుంది?’’ అంటుంది నూపుర్‌. ‘‘అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు ఎంట్రెన్స్‌ ఫీ అయితే కట్టు’’ అంటాడు. కడ్తుంది. తన వృత్తి, వ్యాపారంలో భాగంగా ఎంట్రెన్స్‌ ముందు రోజు పేపర్‌ లీక్‌ చేయిస్తాడు. ఆ లీక్‌ అయిన పేపర్‌ను నూపుర్‌కు తెచ్చిస్తాడు. ‘‘కరెక్ట్‌గా ఇదే పేపర్‌ వస్తుందన్న గ్యారెంటీ ఏంటీ?’’ అని అడుగుతుంది నూపుర్‌. రుజువు చూపిస్తుంటే అక్కడే కాపు కాసి ఉన్న పోలీసులు వచ్చి రాకేశ్‌ను అరెస్ట్‌ చేస్తారు. అప్పుడుగాని గ్రహించడు అది నూపుర్‌ పని అని.

ఎందుకు చేస్తుంది అలా?
సత్తూ ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్‌ నకిలీ అని తేలడంతో అతని మీద ఇండియన్‌ ఎంబసీలో కంప్లయింట్‌ చేస్తాడు అతని బాస్‌. చట్టపరమైన చర్యలు తీసుకొని అతణ్ణి ఇండియాకు పంపించేస్తారు. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు సత్తూ. దాంతో ఆ కుటుంబం కుప్పకూలి పోతుంది. రాకేశ్‌ కోసం ఎంక్వయిరీ చేసిన నూపుర్‌కు అతను ముంబైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమే ముంబైకి మకాం మారుస్తుంది. యాదృచ్ఛికంగా కలిసినట్టు.. అతణ్ణి ఇంకా ప్రేమిస్తున్నట్టు నటించి.. ఎప్పటికప్పుడు అతని కదలికలను గమనిస్తూ.. అతని ప్రణాళికలను తెలుసుకుంటూ..పోలీసులకు చేరవేస్తుంది. అతను చేస్తున్న దందాను సరైన సాక్ష్యాధారాలతో పట్టించడానికి. అందులో భాగమే ఎంబీఏ నాటకం. విద్యావ్యవస్థలోని ఏ లొసుగులను రాకేశ్‌ వాడుకొని దాన్నో వ్యాపారంగా మలిచి.. తన తమ్ముడిలాంటి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడో.. ఆ లొసుగులనే ఉపయోగించుకొని అతణ్ణి పట్టించి తన పగ తీర్చుకుంటుంది నూపుర్‌.– సరస్వతి రమ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా