గంగరాజు పాలు గరిటెడైనను...

4 Jul, 2014 12:44 IST|Sakshi
గంగరాజు పాలు గరిటెడైనను...

తెల్లవారగానే పాలకార్డు పుచ్చుకుని పాల బూత్‌కి వెళ్తే పాలు దొరుకుతాయి!
 కాని ఆ ఇంటికి ఏ కార్డూ తీసుకువెళ్లక్కర్లేదు... అర్ధరాత్రి ఒంటి గంటకైనా సరే ఆ ఇంటికి వెళ్లి తలుపు త డితే చాలు.. పాల వంటి స్వచ్ఛమైన చిరునవ్వుతో తలుపులు
 తెరుచుకుంటాయి... మనకు కావలసిన కల్తీ లేని పాలు దొరుకుతాయి...
 మూడు తరాలుగా పాల వ్యాపారాన్ని సేవా దృక్పథంతో నడుపుతూ
 పాల గంగరాజుగా పేరు పొందారు ఆయన...
 తరవాతి తరం కూడా అదే పేరుతో అ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు.

 
రాజమండ్రి టి.నగర్‌లోని ఆ వీధిలోకి అడుగు పెడుతుండగానే ఆమడ దూరం నుంచే కమ్మటి వాసనలు కమ్ముకు వస్తుంటే... అప్రయత్నంగానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల గంగరాజు డైరీ. తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ కూడా గంగరాజు పాలకోవా తిన్నవారే.
 
ఇలా మొదలైంది...: పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి  పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు.
 
పాల బండి వచ్చిందంటే...: విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. ‘‘మా నాన్నగారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరు రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. మా నాన్నగారు అందులో వుండేవారు.
 
మిగులు పాలతో మొదలైంది వ్యాపారం: పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు. అలా మా తాతగారు పశివేదలలో ఉండగానే నాన్నగారు రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్‌కు మకాం మార్చారు. తాతగారు పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. ’’ అంటూ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు గోవిందు.
 
స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్...:
గంగరాజు డైరీలో... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు.  గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్‌లో ఆర్డర్ ఇచ్చి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు.
 
ఇదో కుటుంబ పరిశ్రమ: మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. ‘‘లీటరు 30 పైసల రేటుతో ప్రారంభమైన మా పాల సేకరణ ఇప్పుడు 52 రూపాయల ధరలో కొనసాగుతోంది’’ అంటూ తమ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతారు గోవిందు.వీరు తయారుచేసే పాలకోవా విదేశాలలో ఉన్నవారిని సైతం ఆకర్షిస్తోంది.

 అమ్మ చేతి పాలకోవా...
 ‘‘ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. మా అమ్మ సత్యవతి అలా మిగిలిన పాలతో కోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. అమ్మ చేతి ఆ స్వచ్ఛమైన పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులు కోవాను పోస్టు ద్వారా తెప్పించుకుంటున్నారంటే అది అమ్మ చేసిన కమ్మని పాలకోవా మహిమే!’’
 - గోవిందు
 
- దేవళ్ల సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి
 ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి

 

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా