ఉద్యోగాల్లో భారతీయులు హ్యాపీ...

2 Jun, 2016 23:51 IST|Sakshi
ఉద్యోగాల్లో భారతీయులు హ్యాపీ...

 జపనీయులు అన్‌హ్యాపీ!
 
రోటీ కప్‌డా ఔర్ మకాన్... ఇవి మూడు ఉంటే భారతీయులు సంతోషంగా ఉంటారని నిన్న మొన్నటి వరకూ అనుకున్నాం. కాని భారతీయులు ఉద్యోగాన్ని కోరుకుంటారని, తమ ఉద్యోగాలను బాగా ప్రేమిస్తారని తాజా సర్వేలో వెల్లడయ్యింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఇడెన్‌రెడ్’ అనే కార్పొరెట్ సర్వీసుల సంస్థ 2016 సంవత్సరానికిగాను 15 దేశాలలో ఉద్యోగుల మానసిక సంతృప్తి గురించి 14,000 మందితో ఒక సర్వే నిర్వహించింది. ‘మీరు మీ ఉద్యోగంతో సంతోషంగా ఉన్నారా’ అనే ప్రశ్నకు జవాబు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది. అన్ని దేశాల కంటే భారతీయులే నూటికి 88 శాతం మంది సంతోషంగా ఉన్నట్టు జవాబు ఇచ్చారు.

ఒత్తిడి కలిగించే సోమవారాలు, పీడించే బాస్‌లు, ఇబ్బంది పెట్టే పని వాతావరణం ఇవన్నీ ఎలా ఉన్నా చేస్తున్న ఉద్యోగంలో సంతోషం వెతుక్కోవడం ముఖ్యంగా చేస్తున్న ఉద్యోగంతో భావోద్వేగపరమైన సంతృప్తి వెతుక్కోవడం చేస్తున్నారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. పనితో సంతోషంగా ఉన్న ఆ తర్వాతి దేశాలలో మెక్సికో, అమెరికా, చిలీ దేశాలు ఉన్నాయి. అయితే శ్రమకు విలువిచ్చే దేశంగా భావించే జపాన్‌లోని ఉద్యోగులు మాత్రం చాలా నిస్పృహగా ఉన్నారు. నూటికి 44 శాతం మంది మాత్రమే తాము తమ ఉద్యోగాలతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. అయితే తాము సంతృప్తిగా పని చేయాలంటే ‘మంచి పని వాతారణం’ ఉండాలని కోరుకుంటున్న దేశాలలో జపాన్, టర్కీ, చైనా, ఇటలీలు ఉన్నాయి.

తాము చేస్తున్న పనికి ‘మంచి గుర్తింపు ప్రోత్సాహం’ ఉండటం ప్రధానమని జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం అన్నాయి. సర్వేలో పాల్గొన్న చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత దొరికే లబ్ధి గురించి శ్రద్ధ పెట్టాలని కోరారు. అలాగే ఎక్కువ మంది ఎప్పటికప్పుడు పనిలో నైపుణ్యాలు పెంచుకునే ట్రైనింగ్ ఇస్తూ పురోభివృద్ధి సాధించే వీలును సంస్థలు కల్పించాలని కోరారు.  రిపోర్ట్

మరిన్ని వార్తలు