పాప నోట్లో పుండ్లు...  తగ్గేదెలా?

2 Jan, 2018 00:29 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా పాప వయసు ఆరేళ్లు. మొన్నీమధ్య గొంతునొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. పాపకు గొంతులో ఇన్ఫెక్షన్‌లా కొంచెం ఎర్రబారింది. ఏమీ తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. 
– వైదేహి, ఖమ్మం 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... 
∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్‌ స్ట్రెస్‌), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్‌), ∙విటమిన్‌లు, పోషకాల లోపం... (ముఖ్యం విటమిన్‌ బి12, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, జింక్‌ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్‌ ఇన్ఫెక్షన్‌లు (ప్రధానంగా హెర్పిస్‌ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా)  ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్‌ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేకరకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) వస్తుంటాయి. మీరు లెటర్‌లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు  విటమిన్‌ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్‌తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు.  ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా  వాడే మందులు, యాంటిసెప్టిక్‌ మౌత్‌ వాష్‌లు, విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో చాలా అరుదుగా స్టెరాయిడ్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. 

 గోడకున్న సున్నం తింటున్నాడు
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇంట్లో పెచ్చుల్లా లేచిన సున్నాన్ని తింటున్నాడు. క్లాస్‌లో చాక్‌పీసులు కూడా తింటున్నాడని వాడి టీచర్‌ చెబుతున్నారు. వాడు తెల్లగా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఆ వయసులో ఉండాల్సినంత బరువు లేదు. మందులు వాడినా బరువు పెరగడం లేదు. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తెలియజేయండి. 
– సుధారాణి, టెక్కలి 

మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో పైకా అంటారు. అంటే... ఆహారంగా పరిగణించని నాన్‌–న్యూట్రిటివ్‌ వస్తువులను పదే పదే తినడం, ఆ అలవాటును దీర్ఘకాలం కొనసాగించడం అన్నమాట. ఈ కండిషన్‌ ఉన్న పిల్లలు ప్లాస్టర్, బొగ్గు (చార్‌కోల్‌), మట్టి, బూడిద, పెయింట్, బలపాలు, చాక్‌పీసులు లాంటివి తింటుంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా రెండేళ్లలోపువారు తమ పరిసరాలను తెలుసుకోవాలనే ఆసక్తితో నాన్‌–న్యూట్రిటివ్‌ వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెద్ద పిల్లల్లోనూ ఇదే లక్షణం ఉంటే... అలాంటి కండిషన్‌ను తేలికగా తీసుకోకూడదు. ఈ కండిషన్‌ ఉన్నపిల్లల్లో  చాలా సాధారణమైన సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన మానసిక రుగ్మతల వరకు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినప్పటికీ సాధారణంగా... కుటుంబంలో సంబంధాలు సవ్యంగా లేకపోవడం, పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కొన్ని మానసిక సమస్యలు, ఐరన్‌ లోపం, కడుపులో నులిపురుగుల వంటివి ఈ సమస్యకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లల్లో రక్తహీనత కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం. మీ అబ్బాయికి రక్తహీనత కూడా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కంప్లీట్‌ బ్లడ్‌పిక్చర్‌తో పరీక్షతో పాటు, రక్తంలో లెడ్‌ పాళ్లు ఉన్నాయేమో అని పరీక్ష చేయించడం చాలా ప్రధానం. ఆహారం విషయానికి వస్తే మాంసాహారంలో కాలేయం, కోడిగుడ్లు, కూరగాయల్లో బీన్స్, సోయాబీన్, పప్పుధాన్యాలు, బ్రకోలీ, మస్టర్డ్, పాలకూర, రాగి వంటి వాటిల్లో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. మీరు మీ అబ్బాయికి పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు కొద్దిగా కొవ్వుపాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. అదేవిధంగా విటమిన్‌–సి ఎక్కువగా ఉన్న తాజా పండ్లు ఎక్కువగా తినిపించాలి. 
మీరు ఒకసారి మీ అబ్బాయికి కడుపులోని నులిపురుగులు పోవడానికి మందులు వాడటం కూడా అవసరం. మీరు మీ పిల్లల వైద్యనిపుణుణ్ణి సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. 

బాబుకు  పాస్‌ పోసేటప్పుడు నొప్పి... 
మా బాబుకి  పదేళ్లు. యూరిన్‌ పోసేటప్పుడు ఫ్రీగా కాకుండా కొంచెం, కొంచెంగా పోస్తుంటాడు. కొన్నిసార్లు పాస్‌ పోసేటప్పుడు నొప్పిగా ఉందంటాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇన్‌ఫెక్షన్‌ ఉందని టాబ్లెట్స్‌ రాసిచ్చారు. అవి వాడినన్ని రోజులు తగ్గి, మళ్లీ మొదలవుతోంది. ఈ మధ్య సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తే తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – రియాజుద్దిన్, గుంటూరు 
మీరు చెప్పిన దాన్ని బట్టి్ట మీ బాబుకి యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ ఉందని చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ పిల్లల్లో కూడా తరుచుగా చూస్తుంటాం. ఇది అబ్బాయిల్లో ఒక శాతం ఉంటే అమ్మాయిల్లో 3–5 శాతం ఉంటుంది. అనేక కారణాల వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తు ఉండవచ్చు. ఉదా. సరైన విసర్జన అలవాట్లు లేకపోవడం (ఇంప్రాపర్‌ టాయిలెట్‌ ట్రెయినింగ్‌), బిగుతు దుస్తులు వంటి సాధారణ అంశాలు కాక....  యూరినరీ ట్రాక్ట్‌లో అబ్‌నార్మాలిటీస్, వాయిడింగ్‌ డిస్‌ ఫంక్షన్, వియు రిఫ్లక్స్, బ్లాడర్‌కు ఉండే న్యూరలాజికల్‌ సమస్యలు, యూరెథ్రల్‌ అబ్‌స్ట్రక్షన్, మలబద్ధకం వంటి రిస్క్‌ ఫ్యాక్టర్ల వల్ల పిల్లల్లో కూడా యూరిన్‌ ఇన్ఫెక్షన్‌లు వస్తుండవచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు యూరిన్‌ పరీక్షలతో పాటు కెయుబి, అల్ట్రాసౌండ్, ఎంసీయూజీ అనే టెస్ట్‌లు చేయించడం చాలా ప్రధానం. ఈ పరీక్షలు చెయ్యడం వల్ల ఎనటమికల్‌ సమస్యలేమయినా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి యూరాలజిస్టును కలిసి తగిన సలహా, చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు