టెన్షన్‌ ఆవిరి

9 Mar, 2019 01:07 IST|Sakshi

వేసవిలో మనమందరం ఉడుకుతాం. అందుకే దేవుడు వేసవి సృష్టించాడు.ఉడికితే మెత్తపడతాం. మెత్తటి బలాన్ని పుంజుకుంటాం.శరీరమంతా శుభ్రమైపోతుంది.  చెడు ఆవిరైపోతుంది.ఇడ్లీ జీర్ణించుకోవడం చాలా సులభం. వెంటనే బలాన్నిస్తాయి.ఈ పరీక్షల టైమ్‌లో టెన్షన్‌ని ఆవిరి చేసేస్తాయి.

బ్రెడ్‌ ఇడ్లీ
కావలసినవి
బ్రెడ్‌ స్లైసులు – 4 ఇడ్లీ రవ్వ –     ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; బేకింగ్‌ సోడా –    చిటికెడు; నూనె – కొద్దిగా

తయారీ
►బ్రెడ్‌ స్లైసుల అంచులు తీసేయాలి

►ఒక పాత్రలో బ్రెడ్‌ను పొడిపొడిగా చేసి వేయాలి

►ఒక కప్పు ఇడ్లీ రవ్వ జత చేయాలి

►ఉప్పు, పెరుగు జత చేయాలి

►తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టి అరగంటసేపు పక్కన ఉంచాలి 

►బేకింగ్‌ పౌడర్‌ జత చేసి కలపాలి

​​​​​​​​​​​​​​►ఇడ్లీరేకులకు కొద్దిగా నూనె పూయాలి

​​​​​​​►ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేయాలి

​​​​​​​►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి

​​​​​​​►పది నిమిషాల తరవాత దింపేయాలి

​​​​​​​►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి.

అటుకుల ఇడ్లీ
కావలసినవి: ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; అటుకులు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్‌ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఇడ్లీ రేకులకు రాయడానికి తగినంత

తయారీ
​​​​​​​► ఒక పాత్రలో ఉప్పుడు బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి బాగా కడిగి, నీళ్లు ఒంపేయాలి

​​​​​​​►అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి, నీళ్లు ఒంపేయాలి

​​​​​​​►ఒక పాత్రలో వీటిని అన్నిటినీ వేసి తగినన్ని నీళ్లలో సుమారు ఆరు గంటలపాటు నానబెట్టాలి

​​​​​​​►నీళ్లు ఒంపేసి, నానబెట్టిన పదార్థాలను గ్రైండర్‌లో వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా ఇడ్లీ పిండిలా రుబ్బుకుని, ఒక పాత్రలోకి తీసుకోవాలి

​​​​​​​►తగినంత ఉప్పు, పంచదార జత చేసి బాగా కలిపి, మూత పెట్టి సుమారు తొమ్మిది గంటలపాటు ఉంచాలి

​​​​​​​►ఇడ్లీ రేకులను శుభ్రంగా కడిగి, నెయ్యి లేదా నూనె పూసి, నానబెట్టిన పిండిని ఆ గుంటలో వేసి, ఇడ్లీ స్టాండులో ఉంచి స్టౌ మీద ఉంచాలి

​​​​​​​►సుమారు పావు గంట తరవాత దింపేయాలి

​​​​​​​►కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

సాబుదానా ఇడ్లీ
కావలసినవి: సగ్గుబియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; బేకింగ్‌ సోడా – పావు టీ స్పూను; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్‌ స్పూను; నూనె – కొద్దిగా

తయారీ
​​​​​​​►సగ్గు బియ్యం, ఇడ్లీ రవ్వలను విడివిడిగా కడగాలి

​​​​​​​►ఒక పాత్రలో పెరుగు వేయాలి

​​​​​​​►కడిగి ఉంచుకున్న సగ్గుబియ్యం, ఇడ్లీరవ్వల మిశ్రమం వేసి బాగా కలపాలి

​​​​​​​►తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి

​​​​​​​►మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి (మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి)

​​​​​​​►కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి, మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి

​​​​​​​►ఇడ్లీ రేకులలో వేసుకునే ముందు కొద్దిగా బేకింగ్‌ సోడా జత చేయాలి

​​​​​​​►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూయాలి

​​​​​​​►ప్రతి గుంటలోను కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి, ఆపైన ఇడ్లీ పిండి వేయాలి

​​​​​​​►ఇడ్లీ స్టాండులో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి

​​​​​​​►పది నిమిషాల తరవాత దింపేయాలి

​​​​​​​►కొద్దిగా చల్లారాక ఇడ్లీలను ప్లేట్లలోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటాయి.

రవ్వ ఇడ్లీ
కావలసినవి: నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చిసెనగ పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; క్యారట్‌ తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ
​​​​​​​►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి

​​​​​​​►పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి

​​​​​​​►మంట బాగా తగ్గించి, రవ్వ వేసి దోరగా వేయించి దింపేయాలి

​​​​​​​►బాగా చల్లారాక పెరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి

​​​​​​​►తగినన్ని నీళ్లు జతచేయాలి

​​​​​​​►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, గుంటలలో జీడిపప్పు పలుకులు వేయాలి

​​​​​​​►ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేయాలి

​​​​​​​►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి

​​​​​​​►పది నిమిషాల తరవాత దింపేయాలి

​​​​​​​►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి.

సేమ్యా ఇడ్లీ
కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; నూనె – ఒక టీ స్పూను; సేమ్యా – అర కప్పు; పెరుగు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; బేకింగ్‌ సోడా – అర టీ స్పూను

పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – కొద్దిగా; నూనె – తగినంత; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ
​​​​​​​►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి

​​​​​​​►అదే బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక సేమ్యా వేసి దోరగా వేయించి తీసేయాలి

​​​​​​​►ఒక పాత్రలో... వేయించిన రవ్వ, వేయించిన సేమ్యా, పెరుగు వేసి కలియబెట్టాలి

​​​​​​​►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఇంగువ వేసి వేయించాలి

​​​​​​​►పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కరివేపాకు వేసి కలపాలి  

​​​​​​​►పసుపు జత చేసి బాగా కలిపి దింపేయాలి

​​​​​​​►నానబెట్టుకున్న సేమ్యా మిశ్రమానికి జత చేయాలి

​​​​​​​►కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి

​​​​​​​►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జతచేసి, మూత పెట్టి అరగంటసేపు వదిలేయాలి

​​​​​​​►ఇడ్లీలు వేసే ముందు బేకింగ్‌ సోడా జత చేయాలి

​​​​​​​►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, గుంటలలో జీడిపప్పు పలుకులు వేసి, ఆపైన గరిటెడు పిండి వేయాలి

​​​​​​​►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి

​​​​​​​►పది నిమిషాల తరవాత దింపేయాలి

​​​​​​​►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి.

కాంచీపురం ఇడ్లీ
కావలసినవి: బియ్యం – అర కప్పు; ఉప్పుడు బియ్యం – అర కప్పు; మినప్పప్పు – అర కప్పు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; అరటి ఆకులు – తగినన్ని

తయారీ
​​​​​​​► బియ్యం, ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి

​​​​​​​►ఇందులోనే మెంతులు కూడా వేయాలి

​​​​​​​►మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి

►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ, జీడిపప్పు పలుకులు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, తీసేసి, ఇడ్లీ పిండిలో వేసి కలపాలి

►అల్లం తురుము, ఉప్పు జత చేసి కలపాలి

►అరటి ఆకులను పెనం మీద గోరు వెచ్చన చేసి పక్కన ఉంచాలి

►చిన్న చిన్న కప్పులు తీసుకుని వాటికి కొద్దిగా నూనె పూసి, ఆపైన అరటి ఆకు ముక్కలను (కప్పు ఆకారంలో) మడిచి, కప్పులో ఉంచాలి

►అందులో తగినంత పిండి వేయాలి

►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ పిండి వేసిన కప్పులను అందులో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి

►పది నిమిషాల తరవాత దింపేయాలి

►వేడి తగ్గాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకోవాలి

►కొబ్బరి చట్నీతో అందించాలి. 
​​​​​​​

మరిన్ని వార్తలు