ప్రజ్నేశ్‌ సంచలనం

9 Mar, 2019 01:06 IST|Sakshi

ప్రపంచ 69వ ర్యాంకర్‌పై గెలుపు

కాలిఫోర్నియా: కెరీర్‌లో తొలిసారి మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నమెంట్‌ ఆడుతోన్న భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ సంచలనంతో శుభారంభం చేశాడు. ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో ఈ చెన్నై క్రీడాకారుడు రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రజ్నేశ్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 7–6 (7/5), 6–4తో ప్రపంచ 69వ ర్యాంకర్‌ బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. 89 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ కీలకదశలో పాయింట్లు సాధించి ఫలితాన్ని శాసించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన ప్రజ్నేశ్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు.

మూడేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 18వ ర్యాంక్‌లో నిలిచిన బెనోయిట్‌ పెయిర్‌... 2017 వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో, 2015 యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. తాజా ప్రదర్శనతో ప్రజ్నేశ్‌ 80వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. ‘నా కెరీర్‌లోమరో గొప్ప విజయమిది. కీలక సమయంలో ఈ గెలుపు లభించింది. వింబుల్డన్‌ టోర్నీలో నేరుగా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు చేరువయ్యాను. మేటి ఆటగాళ్లపై విజయాలు సాధిస్తే నాలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ అని ప్రజ్నేశ్‌ అన్నాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ నికోలజ్‌ బాసిలాష్‌విలి (జార్జియా)తోప్రజ్నేశ్‌ ఆడతాడు.    

మరిన్ని వార్తలు