నిజమైతే.. నమ్మించే పనే లేదు

9 May, 2018 00:21 IST|Sakshi

చెట్టు నీడ

అబద్ధానికున్న గుణమే అది. ఏనాటికైనా నశిస్తుంది. నిజమన్నది తాత్కాలికంగా నశించినట్లు కనిపించినా, ఏ వైపు నుంచో మెల్లిగా తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది.  ఓ వెలుగు రేఖ భూమిపై విచ్చుకున్నట్లు! 

నిజం అన్నది కొన్నిసార్లు మనం విన్నదానికి భిన్నంగా ఉంటుంది. అంటే అది అబద్ధం అని. పెద్దపెద్దవాళ్ల విషయంలో అబద్ధాలు చాలా త్వరగా ప్రచారం అవుతాయి. ఆ ప్రచారపు అబద్ధాలు ఎన్నాళ్లు జీవంతో ఉంటాయన్నది, ప్రచారం చేసేవాళ్ల హోదా, స్థాయిలను బట్టి కాస్త అటు ఇటుగా ఉంటుంది తప్ప, నిజాలుగా అవి ఏనాటికీ స్థిరపడిపోవు. అబద్ధానికున్న గుణమే అది. ఏనాటికైనా నశిస్తుంది. నిజమన్నది తాత్కాలికంగా నశించినట్లు కనిపించినా, ఏ వైపు నుంచో మెల్లిగా తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది. ఓ వెలుగు రేఖ భూమిపై విచ్చుకున్నట్లు! 

ఏదైనా ఒకటి ప్రచారంలోకి వచ్చినప్పుడు అది అబద్ధమా? నిజమా అన్నది తేలేలోపు అబద్ధం నిజమైతే బాగుండని ఆశించే వాళ్లు, అది నిజమే కనుకైతే అబద్ధమైపోవాలని ఆకాంక్షించే వాళ్ల మధ్య నిజానిజాల ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ రెండు వాదనల మధ్య ఎవరు బలంగా నిలబడ్డారు, ఎవరు బలహీనమైపోయారు అనే దానితో నిమిత్తం లేకుండా అంతిమ సత్యానికే ఆ ఘర్షణ దారితీస్తుంది. గాంధీజీ కాంగ్రెస్‌ లేని భారతదేశాన్ని ఆకాంక్షించారని కొన్నాళ్లుగా రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు దగ్గరపడ్డాయి కనుక ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. గాంధీజీ అలా అనలేదని, ఆయన కోట్‌ ను, మిస్‌ కోట్‌ చేశారని వ్యతిరేక పక్షం వాదిస్తోంది. ఇందులోని సత్యాసత్యాలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం. దారీతెన్నూ లేని ఘర్షణ ఇది. ‘‘నువ్వు నిజం అంటున్నదానిని ముందు నువ్వు నమ్మాలి. అలా కాకుండా నమ్మించడానికి పంపే సందేశం అయితే కనుక ఆ నిజం తిరస్కారానికి గురవుతుంది’’ అనేవారు గాంధీజీ. నిజమే కదా! 

>
మరిన్ని వార్తలు