అనురాగదీపం

1 Mar, 2015 23:42 IST|Sakshi
అనురాగదీపం

అనాథలైన పసిపిల్లలను లాలించే తల్లి, ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే అక్క, అవసాన దశలో శరణాలయాల పాలైన వృద్ధులకు ప్రేమను పంచే బిడ్డ. బాధల్లో ఉన్న వారికి  సేవ చేయడం, ఆత్మస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వరంగల్‌కు చెందిన కరుకాల అనితారెడ్డి. వరంగల్ నగరం కేంద్రంగా ‘అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రభుత్వం, దాతల నుంచి పైసా సాయం ఆశించకుండా సొంతగా సమకూర్చుకున్న నిధులతో పదిహేనేళ్లుగా సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. తన సేవాకార్యక్రమాల గురించి ఆమె మాటల్లోనే...
తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ
 
చిన్నతనంలో కష్టాలు అంటే ఏంటో తెలిసేది కాదు. నాగార్జునసాగర్‌లో కాన్వెంట్ స్కూల్‌లో చదివే రోజుల్లో మా అమ్మ నాలుగు గిన్నెల లంచ్ బాక్స్‌లో ఆహార పదార్థాలు పెట్టేది. ఓ రోజు నా టిఫిన్ బాక్స్‌లో సగం భోజనాన్ని పడేసేందుకు వెళ్తుంటే... పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ అమ్మాయి ‘పడేయొద్దు నేను తింటాను’ అంటూ అడిగింది. ఆ రోజు ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆకలిని తట్టుకోవడం ఎంత కష్టమో తెలిసింది. ఆ స్కూల్లో చదివినన్ని రోజులు నా లంచ్‌బాక్స్‌ను ఆ అమ్మాయితో పంచుకునేదాన్ని. అలా సేవాగుణం అలవడింది.
 
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ
అనురాగ్ హెల్పింగ్ సొసైటీని 2003లో స్థాపించాను. దీని ద్వారా నిరంతరాయంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి సందర్భంగా మా నాన్న ఇచ్చిన కానుకలు, స్థిరాస్థిని మూలధనంగా ఉంచి దానిపై వచ్చే వడ్డీతో అనురాగ్ సొసైటీ ద్వారా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. ప్రతీ ఏడాది వివిధ సేవాకార్యక్రమాల కోసం  నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయల వ్యయం అవుతోంది.
 
స్పందించే గుణం ఉండాలి
పండగలు, ముఖ్యమైన దినోత్సవాలు వచ్చినప్పుడు అనాథలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారి మధ్య వేడుకలు నిర్వహిస్తాను. తెలిసిన కుటుంబాలకు చెందిన వ్యక్తులను ఒప్పించి వారి కుంటుబాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ముఖ్యమైన వేడుకలను అనాధ శరణాలయాల్లో జరుపుకునే విధంగా వారిని ఒప్పిస్తాను.

దీనివల్ల  అనాథలు, వృద్ధులు, ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు స్వంత కుటుంబాలకు దూరమయ్యామనే బాధ కొంతైనా తగ్గుతుంది. వీటితోపాటు ఇళ్లలో ఫంక్షన్లు, కిట్టీపార్టీలు జరిగిన సందర్భాల్లో అవసరాలకు పోను మిగిలిన ఆహార పదార్థాలను తీసుకెళ్లి శరణాలయాల్లోని పిల్లలకు సమకూరుస్తాను. అనాథ శరణాలయం చేరిన పిల్లలకు బారసాల, అన్నప్రాశన వంటి జరిపి వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటారు.
 
పరిశుభ్రత, పర్యావరణం
ఓ సంక్షేమ హాస్టల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాన్లు పాడవడమో, దుప్పట్లు చిరిగిపోవడమో జరిగితే వాటిని ప్రభుత్వ నిధులతో మళ్లీ మళ్లీ ఏర్పాటు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఈ తరహా లోపాలను గుర్తించిన వెంటనే అక్కడికి ఫ్యాన్లు, దుప్పట్లు అందిస్తాను. పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా వరంగల్ నగరంలో ఉన్న 50 మురికివాడల్లో అనురాగ్‌శుద్ధ్ అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాను. పర్యావరణ పరిరక్షణ, నేత్ర, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్యశిబిరాలు, స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు మూడు వేల ఐదువందలకు పైగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాను.
 
ఆపన్నులకు హెల్త్‌కార్డులు
వరంగల్ నగరంలో ఉన్న వైద్యులతో మాట్లాడి అనాథలు, వృద్ధులు, ఆపదలో ఉన్న మహిళలకు ఉచితంగా హెల్త్‌కార్డులు ఇప్పించాను. ఈ కార్డులతో నగరంలోని ఆస్పత్రులలో కన్సల్టేషన్ ఫీజు లేకుండా వైద్యసాయం పొందవచ్చు. అవసరమైన ఔషధాలను అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ద్వారా అందిస్తాం. కుష్టు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు సమకూర్చడంతో పాటు వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మనోస్థైర్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. విధివంచితులుగా స్వధార్, సర్వీస్‌హోమ్‌లకు చేరే మహిళలు స్వావలంబన సాధించేందుకు వీలుగా వారికి కుట్టుమిషన్లు, అల్లికలు, మగ్గంవర్కు, సాఫ్ట్ టాయిస్ తయారీ యంత్రాలను సొసైటీ ద్వారా అందిస్తాం. వృత్తివిద్యలో నైపుణ్యం ఉన్నవారికి ఆసక్తి ఉన్నవారితో దుకాణాలు సైతం పెట్టిస్తాం.
 
సేవ కార్యక్రమాలు నిర్వహించేందుకు డబ్బుల కంటే ఇతరుల కష్టాలు చూసి స్పందించే గుణం ఉండటం ముఖ్యం. మన చుట్టూ ఉన్న సమాజంలో వృద్ధులు, వికలాంగులు, అనాథలు, మహిళలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి చేతనైనంతగా సాయపడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
 - అనితారెడ్డి

అనాధలు, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, కరుకాల అనితారెడ్డి,

 

మరిన్ని వార్తలు