త్రీమంకీస్ - 54

11 Dec, 2014 23:41 IST|Sakshi
త్రీమంకీస్ - 54

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 54
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 అక్కడ నించి పోలీసులు గోడ చాటుకి వెళ్ళాక ముగ్గురు మిత్రులకి ఓ ఆడ కంఠం వినిపించింది.
 ‘‘పదండి. పదండి.’’
 కపీష్ కనుగుడ్లు మాత్రం తిప్పి రుధిరని చూసి ఆశ్చర్యపోయాడు.
 ‘‘మేం ముగ్గురం విగ్రహాలం కదలం’’ వానర్ చెప్పాడు.
 ‘‘రుధిరా! నువ్వు ఇక్కడేమిటి ఇలా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘ఆ సొరంగంలోంచి తప్పించుకుని వచ్చిన వాళ్ళల్లో మా అన్న కూడా ఉన్నాడు. వాళ్ళందరి కోసం ఓ వేన్‌ని తెచ్చాను. నా కళ్ళ ముందే వారిని పోలీసులు బంధించారు. తర్వాత మీరు రావడం చూసి మీకు సహాయం చేద్దామని ఆగాను. మీకీ సొరంగం రహస్యం ఎలా తెలిసింది? దారిలో మాట్లాడుకుందాం. ముందు కదలండి.’’
 ‘‘ఎక్కండి. ఇది మన బండే’’ వేన్ దగ్గరకి వచ్చాక రుధిర చెప్పింది.
 అంతా అందులోకి ఎక్కాక కపీష్ వారిని పరిచయం చేశాడు.
 ‘‘హలో అంకుల్. హలో అంకుల్’’ ఇద్దర్నీ విష్ చేసింది.
 ‘‘ఇక్కడ అంకుల్స్ ఎవరూ?’’ వానర్ అడిగాడు.
 ‘‘మిమ్మల్నే అంకుల్.’’
 ‘‘అదేమిటి? నా గొంతులో ముసలితనం ఉందా?’’
 ‘‘లేదంకుల్. నేను మీకన్నా బాగా చిన్నదాన్ని, మీరు నా కన్నా పెద్దవారు కదా అంకుల్. అందుకని.’’
 ‘‘వాళ్ళని అంకుల్ అనచ్చు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘సీట్‌కి తారంటుతోంది. ఏం అనుకోక’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఇందులో అనుకునేదేముంది? ఇది మనదైతేగా? కొట్టుకొచ్చిందే’’ రుధిర నవ్వింది.
   
 ఎస్సైకి గోడ వెనక ఎవరూ కనపడలేదు. ఓ కానిస్టేబుల్ చొక్కా వెనక భాగాన్ని చూస్తూ అడిగాడు.
 ‘‘నీ చొక్కాకి ఆ మరకేమిటి? ఇందాక లేదు.’’
 ‘‘ఏం మరక?’’
 ‘‘వెనక్కి తిరుగు... ఈ నల్ల మరక...’’ దాన్ని వేలితో రాసి వాసన చూసి ఎస్సై చెప్పాడు.
 ‘‘తారు మరక. ఎక్కడ అంటిందో అర్థమైంది. పదండి. ఆ ముగ్గురూ దొరికారు.’’
 ముందు ఎస్సై, అతని వెనక మిగిలిన ఇద్దరూ ఉత్సాహంగా పరిగెత్తారు. ఆ ముగ్గురూ ఇందాక పార్క్‌లో తాము విశ్రాంతి తీసుకున్న చోటికి వెళ్ళారు.
 ‘‘విగ్రహాలేవి?’’ ఓ కానిస్టేబుల్ అడిగాడు.
 ‘‘దొంగలు వాటిని ఎత్తుకెళ్ళినట్లున్నారు’’ రెండో కానిస్టేబుల్ చెప్పాడు.
 ‘‘కాదు. వాళ్ళే దొంగలు. ... కొడుకులు విగ్రహాల్లా నటించారు’’ ఎస్సై వాళ్ళని తిట్టాడు.
 ఆ బూతు మాటని ఆ రోజు ఎస్సై ఉపయోగించడం నూట ముప్ఫై రెండోసారి.
 ‘‘మనల్ని బురిడీలని చేస్తారా? వాళ్ళని లాకప్‌లోకి రానీండి. ఒక్కోక్కరి బొక్కలు విరగ్గొడతాను’’ హెడ్ కానిస్టేబుల్ ప్రతిజ్ఞ చేశాడు.
 ‘‘చూస్తారే? పదండి. వెతుకుదాం’’ ఎస్సై హూంకరించాడు.
 నేల మీద పడ్డ తారు పాదముద్రలని చూసుకుంటూ అక్కడి నించి ఆ షెర్లాక్ హోమ్స్ ముందుకి కదిలారు.
 పాదముద్రలని అనుసరించిన కానిస్ట్టేబుల్ అవి పేవ్‌మెంట్ మీద మాయం అవడంతో పైకి గాల్లోకి చూశాడు.
 ‘‘మళ్ళీ ఎలా మాయం అయ్యారు సార్?’’
 ‘‘ఆశ్చర్యపోక. వాళ్ళు పైకి వెళ్ళలేదు. ఇక్కడ వారి కోసం ఆగి ఉన్న వాహనం ఎక్కి వెళ్ళిపోయారు’’ చెప్పి ఎస్సై వైర్‌లెస్‌లో కంట్రోల్ రూంకి ఆ సమాచారం అందించాడు.
 16
 ఇంటికి వచ్చాక రుధిర వాళ్ళతో చెప్పింది.
 ‘‘రోతగా నిలువెత్తు బురద పురుగుల్లా కనిపిస్తున్నారు. ఎక్కడా తాక్కండి. సోఫాలో కూర్చోకండి. ఇవి ఎత్తుకు వచ్చినవి కావు. ముందు స్నానాలు చేయండి.’’
 ‘‘స్వచ్ఛ ఐతే మనల్ని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది కాదు. ఆమెని వదిలించుకుని తెలివైన పని చేశావు’’ వానర్ కపీష్‌ని మెచ్చుకున్నాడు.
 ‘‘స్వచ్ఛ ఎవరు?’’ రుధిర వెంటనే అడిగింది.
 ‘‘స్వచ్ఛ భారత్ వాళ్ళ గురించి వీడు మాట్లాడింది. ఇప్పుడదే కదా గాలి.’’
 ‘‘ముందు నువ్వు వెళ్ళు మర్కట్. నువ్వు ఎక్కువ తారు పూసుకున్నావు.’’
 ‘‘వీళ్ళలా కాదు. తెల్ల చర్మం కదా నాది.’’
 ముగ్గురూ రుధిర బాత్‌రూంలో స్నానాలు చేసి ఒంటి తారుని ఒదిలించుకోడానికి చాలాసేపు పట్టింది.
 ‘‘... వివిధ నేరాలతో పట్టుబడ్డ ఆ ముగ్గురి పేర్లూ కపీష్, మర్కట్, వానర్. ముగ్గురూ స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివిన పట్టభద్రులు. పోలీసులు వారి కోసం వెదుకుతున్నారు.’’
 ‘‘మన ఫొటో! మన ఫొటో టీవీలో వచ్చింది’’ వానర్ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా చెప్పాడు.
 
 (సొరంగంలో దొరికిన మ్యాప్‌లోని అడ్రస్
 త్రీమంకీస్‌కి దొరికిందా?)
 

మరిన్ని వార్తలు