మిత్రుడి ఒడి – తల్లి ఒడి

30 Dec, 2018 00:56 IST|Sakshi

బౌద్ధసంఘంలో అగ్రభిక్షువుల్లో సారిపుత్రుడు, మౌద్గల్యాయనులు ముఖ్యులు. చిరకాలంగా మంచి మిత్రులు కూడా. వారిద్దరూ కలసిమెలసి ఉండటం చూసి, ఈర్ష్యనొందిన ఒక వ్యక్తి వారిద్దరి మధ్య తగవులు పెట్టాలనుకున్నాడు. ఒకరి మీద ఒకరికి చెప్పాడు. అలా వీలైనప్పుడల్లా చెప్తూనే ఉండేవాడు. అతని విషయం బుద్ధునికి తెలిసింది. ఒకరోజున భిక్షువులందరూ ఉన్న సమయంలో ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక సింహం, ఒక పులి ఒకే గుహలో అన్యోన్యంగా కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. వాటి దాపున ఉన్న బొరియలో ఒక నక్క కూడా ఉండేది. సింహం, పులి వేటాడి తెచ్చి, తినగా మిగిలిన మాంసాన్ని తిని జీవించేది. ఎంతో వినయం నటిస్తూ సింహానికి, పులికి సేవలు చేస్తూ ఉండేది.

అలా కొన్నాళ్లకు అది దుక్కలా బలిసింది. ఒకరోజున అది ఇలా ఆలోచించింది. నేను ఎన్నో జంతువుల మాంసాల్ని రుచి చూశాను. సింహం, పులి మాంసాల్ని రుచి చూడలేదు. ఈ రెండింటికి తగవు పెట్టి, చంపుకునేలా చేసి, వీటి మాంసాన్ని తినాలి’’ అనుకుని సింహం దగ్గరకు వెళ్లి– ‘‘మహాశయా! మీకూ పులికీ మధ్య గొడవలేమైనా వచ్చాయా ఏమిటి?’’అంది. ‘‘ఎందుకలా అడిగావు?’’ అడిగింది సింహం.‘‘శరీర రంగులోనూ, బలంలోనూ, అందంలోనూ, శౌర్యంలోనూ నాలో ఒక వంతుకు కూడా సరిపోదు సింహం అని అందే ఆ పులి’’ అన్నది. ‘‘ నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పులి మిత్రుడు అలాంటి వాడు కాదు. నీవు మా మధ్య వుండ తగవు, వెంటనే వెళ్లిపో’’ అని కసిరి కొట్టింది సింహం. నక్క చెప్పిన మాటలు పులితోకూడా చెప్పలేదు సింహం.

 మరునాడు నక్క పులి దగ్గరకు వెళ్లి సింహానికి చెప్పినట్టే చెప్పింది. పులి కూడా నక్కను తరిమి కొట్టింది. కానీ వచ్చి– ‘‘మిత్రమా! నా గురించి ఇలా అన్నావా?’’ అని అడిగింది. అప్పుడు సింహం– పులి మిత్రమా! ఆ నక్కది దుష్టబుద్ధి. నాకూ అలాగే చెప్పింది. నీకు ఒక మాట చెప్తాను విను. మైత్రి అంటే... ఎవరెన్ని కొండీలు చెప్పినా నమ్మనిది. ఒక బిడ్డ తల్లి ఒడిలో తలపెట్టి ఎంత నిర్భీతిగా నిదురిస్తాడో, ఒక స్నేహితుని ఒడిలో తలపెట్టి మరో స్నేహితుడు అంత నిర్భీతిగా నిదురించేది. అదీ అసలైన మైత్రి’’ అని చెప్పగా– ‘‘మిత్రమా! నన్ను క్షమించు. ఇలా అన్నావా? అని వచ్చి అడగడం నా తప్పే’’ అని క్షమాపణలు కోరింది. ఈ కథ విన్న సారిపుత్రుడు, మౌద్గల్యాయనులూ ఆ వ్యక్తిని దూరం పెట్టారు. మరణించేవరకూ మిత్రులుగా జీవించారు. 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

మరిన్ని వార్తలు