Homeopathy: పశువ్యాధులకు హోమియోపతితో ఖర్చు తక్కువ.. వెంటనే ఫలితం

14 Nov, 2023 10:13 IST|Sakshi

పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్‌.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. 


సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. 

పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి?
     ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. 
     ► సైడ్‌ ఎఫెక్ట్స్‌ /దుష్ప్రభావాలు ఉండవు.  పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. 
    ►   ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. 
    ►  హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే.
    ►   ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు.
   ►   డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి     దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. 
   ►   కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం.
   ►   ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు.  

హోమియో మందులతో పొదుగువాపు మాయం!
రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్‌ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది.

ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్‌ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.

మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్‌ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్‌ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్‌ అనే హామియో మందులను వినియోగించాం. 

రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది!

ఒక హోటల్‌ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్‌ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్‌ ఇంజక్షన్లు, లివర్‌ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు.

అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్‌ వామిక, రుస్‌ టాక్స్‌ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది.  (పశువైద్యులు డాక్టర్‌ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) 

మరిన్ని వార్తలు