నమస్తే.. మేడమ్‌!

22 Mar, 2018 00:06 IST|Sakshi
తరతరాలకు మేలు జరిగేలా గిరిజనుల సంక్షేమం కోసం శోభనా రనాడే సేవలందించారు 

బిగ్‌ లైఫ్‌

ప్రస్తుతం శోభనా రనాడే పుణె శివాజీనగర్‌లో ఉన్న హెర్మన్‌ జమైన్‌ సోషల్‌ సెంటర్‌ తరఫున  వీధి బాలలకు చదువు, పోషకాహారం, ఆరోగ్యం, కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తున్నారు. 

ఎందరో మహిళలకు ఆమె జీవితం ఒక చక్కని పుస్తకం. ప్రతి పేజీలోనూ ఆమె సంతకం ఉంటుంది. ఆ సంతకం వెనుక గాంధీజీ ఆశయాల స్ఫూర్తి ఉంటుంది. అణగారిన వర్గాల మహిళల ఉన్నతి కోసం పాటుపడిన జీవితం ఉంటుంది. ఆమే.. శోభనా రనాడే. అత్యున్నత పద్మభూషణ్‌ అందుకున్నారు. లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ను దక్కించుకున్నారు. ఇప్పుడు ‘జమ్నాలాల్‌ బజాజ్‌ ఫౌండేషన్‌’ కు నామినేట్‌ అయ్యారు. ఈ 93 ఏళ్ల వయసులోనూ సమాజసేవలో తరించాలని తపించిపోతున్నారు. ప్రధానంగా గిరిజన బాలికలు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.

గాంధీజీని కలిశారు
శోభనా రనాడే సుమారు 50 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్నారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఆవిడ మనసు ఆర్ద్రతతో నిండిపోయేది. ఎంతో మంది మహిళలు, బాలలు నిరక్షరాస్యులుగా ఉండటం ఆమెను కలిచివేసేది. వీధిబాలలు తిండి కోసం కుక్కలతో పోట్లాడటం, మహిళలు అత్యాచారాలకు గురికావడం చూసి ఆమె హృదయం ద్రవించిపోయేది. వాళ్లకేదైనా చేయాలని సంకల్పించుకుంది. çపుణె అగాఖాన్‌ గాంధీ మెమోరియల్‌ సొసైటీలో, నేషనల్‌ ట్రయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఉమన్‌లో పని చేసిన అనుభవం ఆమె సంకల్పానికి బలం చేకూర్చింది. మొదట 1942లో తన 18వ ఏట, శోభన పుణెలోని అగాఖాన్‌ ప్యాలెస్‌లో మహాత్మాగాంధీని స్వయంగా కలిశారు. 

వినోభాతో నడిచారు
1955లో శోభన లక్ష్యసాధనకు ఒక మార్గం దొరికింది. అస్సాంలోని ఉత్తర లఖింపూర్‌కి వినోబాభావేతో కలసి పాదయాత్ర చేయడానికి వెళ్లారు. అప్పుడు ఆమె వయసు 31. ఆ పరిసరాలలో నివసిస్తున్న అనాథ బాలలను చూసి, వారి కోసం అక్కడ ఏదైనా ఒకటి ప్రారంభించాలనుకున్నారు. ముప్పై మంది పిల్లలతో శిశునికేతన్‌ ప్రారంభించారు. వారికి చదువు నేర్పడంతో పాటు, సకల సౌకర్యాలు కల్పించారు. ఆమెలోని సేవా భావం చూసిన కొందరు సంపన్నులు, శిశు నికేతన్‌ నిర్వహణ కోసం చందాలు ఇచ్చి, ఒక ట్రస్ట్‌ ఏర్పాటుచేశారు. నేటికీ ఆ సంస్థ ఎంతో చక్కగా నడుస్తోంది. అక్కడ ఉండగానే, డిగ్‌బోయ్‌ జిల్లాలో మొట్టమొదటి బాలల సంక్షేమ పాఠశాల ప్రారంభించారు శోభన. 

గిరులలో తిరిగారు
అస్సాంలో కొన్నేళ్లు ఉండి నాగాలాండ్‌ వెళ్లారు శోభన. అక్కడ కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ‘ఆదిమజాతి సేవా సంఘ్‌’ నెలకొల్పి నాగా గిరిజన మహిళలకు అల్లికలలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కోహిమాలో ఖాదీ భాండార్‌ ప్రారంభించి, గిరిజన మహిళలు రూపొందించిన వస్తువులను విక్రయించారు. అక్కడ ఉంటూనే, అరుణాచల్‌ ప్రదేశ్‌లో మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు. 
ఈశాన్య రాష్ట్రాలలోని వెనుకబాటుతనాన్ని కళ్లారా చూసిన శోభన వారి అభ్యున్నతికి తన వంతుగా కృషి చేశారు. తర్వాత పుణె తిరిగి వచ్చారు.

నేర్పించారు.. నిలబెట్టారు
శోభన పుణెలోని పురందర్‌ తాలూకా సస్వాద్‌లో ఉన్న కస్తూర్బా గాంధీ నేషనల్‌ ట్రస్ట్‌కి ట్రస్టీగా  కూడా వ్యవహరించారు. ఈ ట్రస్ట్‌ పదకొండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో ఆరు ఎకరాలు వ్యవసాయానికి కేటాయించారు శోభన. మిగిలిన ఐదు ఎకరాలలో ఆశ్రమానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు నిర్వహించేవారు. అందులోనే, బాలగృహలో 40 మంది మహిళలకు ఆవాసం ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించి, ఉపాధి విద్యలు నేర్పించారు. ఆశ్రమంలోనే ఓ మూల కూరలు పండించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు, వృత్తి విద్యలలోనూ, గ్రామీణ పరిశ్రమలలోను అక్కడి మహిళలకు శిక్షణ ఇప్పించారు. టైలరింగ్, పిండి రుబ్బటం, పిండి వంటలు తయారుచేయటం, నగలు తయారుచేయటం నేర్పించారు. వీటి ద్వారా ఈ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. వారి కాళ్ల మీద వారు నిలబడ్డారు. 
– రోహిణి
(జమ్నాలాల్‌ బజాజ్‌ ఫౌండేషన్‌ అందించిన వివరాల ఆధారంగా)

మరిన్ని వార్తలు