-

సహకార ‘భారత్‌ ఆర్గానిక్స్‌’!

21 Nov, 2023 09:27 IST|Sakshi

సహకార రంగంలో పాల ఉత్పత్తులకు కొండగుర్తుగా మారిన ‘అమూల్‌’ బ్రాండ్‌ మాదిరిగానే ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయానికి ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ బ్రాండ్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆవిష్కరించింది. ప్రకృతి /సేంద్రియ వ్యవసాయదారులు దేశవ్యాప్తంగా పండిస్తున్న ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులకు ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ బ్రాండ్‌ ఇక చిరునామాగా మారనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల అధీకృత మూలధనంతో ‘నేషనల్‌ కోఆపరేటివ్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సిఓఎల్‌)’ పేరిట ఓ మెగా మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ ఏర్పాటైంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పిఓల) నుంచి పంట దిగుబడులను ఎన్‌సిఓఎల్‌ కొనుగోలు చేస్తుంది. వాటిని శుద్ధి చేసి, విలువను జోడిస్తుంది. ఆ సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ పేరిట దేశవిదేశాల్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, రాజ్మా అమూల్‌ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. 2024 జనవరి నుంచి మరో 14 రకాలు కూడా అమ్ముతారు. లాభాల్లో 50%ను రైతులకు తిరిగి చెల్లించనున్న ఈ మెగా ఆర్గానిక్‌ మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌ గురించి కథనం..

సేంద్రియ / ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయక ఆహారోత్పత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటోంది. 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ/ప్రకృతి సాగుతో ప్రపంచంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులలో 16 లక్షల మంది మన దేశీయులే. అయినప్పటికీ, విశ్వ విపణిలో మన సేంద్రియ ఉత్పత్తుల వాటా మాత్రం 2.7% మాత్రమే. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పిఓ) నుంచి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి, ప్రాసెస్‌ చేసి, మార్కెట్‌ చేయడానికి దేశంలో తగినన్ని ప్రభుత్వ /సహకార రంగంలో సదుపాయాలు లేకపోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. 

రసాయనిక అవశేషాల్లేని పంటలు పండించే రైతుల్లో చాలా మందికి ఆ పంట దిగుబడులను మంచి ధరకు అమ్ముకోవటం సమస్యగా మారింది. అదేమాదిరిగా, పూర్తిగా నమ్మదగిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించే దేశవ్యాప్త వ్యవస్థ కూడా ఇన్నాళ్లూ కొరవడింది. ఇప్పుడు ఆ కొరత తీరనుంది.

రూ.500 కోట్ల అథీకృత మూలధనం
ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు మూడు అతిపెద్ద మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌లను కేంద్ర సహకార శాఖ ఇటీవల నెలకొల్పింది. సర్టిఫైడ్‌ విత్తనాలు/దేశీ వంగడాల పరిరక్షణ, సరఫరా కోసం ఒకటి.. సహకార కళాకృతులు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరొకటి.. ఈ కోవలోనిదే ‘నేషనల్‌ కోఆపరేటివ్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సిఓఎల్‌)’ కూడా. రూ.500 కోట్ల అథీకృత మూలధనంతో ఎన్‌సిఓఎల్‌ ఏర్పాటైంది. మల్టీ–స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ 2002 కింద నమైదైంది. దేశంలోని 5 ప్రధాన సహకార సంఘాలు, సంస్థలు 

సేంద్రియ/ప్రకృతి రైతులకు సౌలభ్యకరమైన, ఆధారపడదగిన, శక్తివంతమైన, సహకార మార్కెటింగ్‌ వ్యవస్థను అందించటంతో పాటు.. దేశంలోనే కాదు విదేశాల్లోని వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన సేంద్రియ సహకార ఆహారోత్పత్తులను ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ బ్రాండ్‌ ద్వారా అందుబాటులోకి తేవటమే ఎన్‌సిఓఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థలకు మార్కెట్‌లోకి ప్రత్యక్ష ప్రవేశం కల్పించడం ద్వారా ఉత్పత్తులపై రాబడిని పెంచడం ఎన్‌సిఓఎల్‌ లక్ష్యం. బలమైన బ్రాండ్‌తో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించటం ద్వారా సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన రాబడిని పొందుతారు. సంబంధిత మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును నిర్వహించడం ద్వారా ఎన్‌సిఓఎల్‌ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. 

దక్షిణాది తొలి సభ్యత్వం
ఏదైనా సహకార సంఘం లేదా వ్యక్తుల సంఘం (సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ అనుమతించిన విధంగా) ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం పొందవచ్చు. దాదాపు 2,000 సహకార సంఘాలు ఇప్పటికే ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వాన్ని పొందిన ఘనత ఎఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ‘ఎం.నిట్టపుట్టు గిరిజన రైతు సేవా మరియు ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ’కి దక్కింది. ఎన్‌సిఓఎల్‌ మెంబర్‌షిప్‌ సర్టిఫికెట్‌ను అమిత్‌షా నుంచి సొసైటీ సీఈవో పి. గంగరాజు అందుకున్నారు. సభ్యత్వ ధృవీకరణ అందుకున్న తొలి ఐదుగురిలో ఈయన ఒకరు కావటం విశేషం.  

అతిపెద్ద బ్రాండ్‌ కానున్న ‘భారత్‌ ఆర్గానిక్స్‌’
రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్‌ ఫుడ్‌ బ్రాండ్‌గా ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ రూపుదాల్చుతుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్‌ ఆవిర్భావ సభలో కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. భూసారం, సేంద్రియ ఆహారోత్పత్తుల పరీక్షల కోసం ప్రతి జిల్లా, తహసీల్‌లో నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌(ఎన్‌పిఓపి) గుర్తింపు పొందిన లేబరేటరీలు ఏర్పాటు కానుండటం విశేషం. 

ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం
నేషనల్‌ కోఆపరేటివ్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సిఓఎల్‌) ఆవిర్భావంతో సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ ఆహారోత్పత్తుల మార్కెటింగ్‌ వ్యవస్థ జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం అవుతుండటం ఆనందదాయకం. మార్కెటింగ్‌ సదుపాయం పెరిగితే ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరగటానికి వీలవుతుంది. ఎన్‌సిఓఎల్‌ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ రైతు సాధికార సంస్థ నోడల్‌ ఏజన్సీగా పనిచేస్తోంది. ఎన్‌సిఓఎల్‌లో వ్యక్తిగతంగా రైతులు సభ్యులుగా చేరలేరు. 1964 సహకార చట్టం, 1995 మాక్స్‌ చట్టం కింద రిజిస్టరైన ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాలు, ఎఫ్‌పిఓలు (కంపెనీ చట్టం కింద నమోదైన ఎఫ్‌పిఓలు అర్హులు కాదు), మండల మహిళా సమాఖ్యలు ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరొచ్చు.

కనీస మద్దతు ధర లేదా మార్కెట్‌ ధరలో ఏది ఎక్కువ ఉంటే దాని మీద అదనంగా 10–15 శాతం ప్రీమియం చెల్లించి ఎన్‌సిఓఎల్‌ కొనుగోలు చేస్తుంది. లాభాల్లో 50% సభ్యులకు తిరిగి చెల్లిస్తుంది. ఏపీలో ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్‌పిఓలు /సహకార సంఘాలు /మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్చుతున్నాం. ప్రస్తుతానికి ప్రాసెసింగ్‌ చేసిన బియ్యం, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, రాజ్మా గింజలను ఎన్‌సిఓఎల్‌ కొనుగోలు చేస్తున్నది. వచ్చే జనవరి నుంచి 20 రకాల సేంద్రియ ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని అమూల్‌ సంస్థ ఆవరణలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఎన్‌సిఓఎల్‌ నెలకొల్పనుంది.

అమూల్‌ ఆర్గానిక్స్‌ బ్రాండ్‌తో ఈ ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. భారత్‌ ఆర్గానిక్స్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాదిలో సఫల్, మదర్‌ డెయిరీ, అమూల్‌ రిటైల్‌ ఔట్‌లెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయం ప్రారంభమైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్‌ ఆవిర్భావ సభలో ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన 55 మంది ప్రతినిధులం పాల్గొన్నాం. ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్‌పిఓలు, సహకార సంఘాలు, మాక్స్‌ చట్టం కింద నమోదైన మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విస్తారంగా జరుగుతున్న ఏపీ నుంచే ఎక్కువ సభ్యులు చేరే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఎన్‌సిఓఎల్‌లో చేరదలచిన సంస్థలు మమ్మల్ని సంప్రదించవచ్చు. 
– బొడ్డు ప్రభాకర్‌ (97714 63539), 
మార్కెటింగ్‌ హెడ్, 
రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.
prabhakar@ryss.ap.gov.

త్వరలో ఆన్‌లైన్‌ విక్రయాలు
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయోత్పత్తులను సహకార సంఘాలు, ఎఫ్‌పిఓల నుంచి కనీస మద్దతు ధరకన్నా కొంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎన్‌సిఓఎల్‌ పొందే నికర లాభాల్లో 50 శాతం మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తాం. ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ బ్రాండ్‌తో ప్రజలకు రిటైల్‌గా ఆన్‌లైన్‌లో విక్రయించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరదలచిన సహకార సంఘాలు, ఎఫ్‌పిఓలు, మండల సమాఖ్యలు ఏ రాష్ట్రం వారైనప్పటికీ ఈ కింది మెయిల్‌ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. 
– కోదండపాణి, మేనేజింగ్‌ డైరెక్టర్, 
నేషనల్‌ కోఆపరేటివ్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ 
(ఎన్‌సిఓఎల్‌), న్యూఢిల్లీ. 

cooporganics@gmail.com

వినియోగదారుల సందేహాలకు తావుండదు
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులను కొనేటప్పుడు వినియోగదారులు వీటిని ఎవరు, ఎక్కడ పండించారు? నిజంగా ఆర్గానిక్‌గానే పండించారా అనే సందేహాలు వస్తుంటాయి. ఎన్‌సిఓఎల్‌ ద్వారా ‘భారత్‌ ఆర్గానిక్స్‌’ సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఈ సందేహాలు తీరిపోతాయి. మా గిరిజన సహకార సంఘం దక్షిణాది నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వం పొందటం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్కెటింగ్‌ సమస్యలు తీరిపోతాయి. ఎఎస్‌ఆర్‌ లల్లా జి. మాడుగుల మండలంలో 3683 మంది గిరిజన రైతులు మా సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2012 మంది సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ రైతులు. కాఫీ, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, అల్లం, రాజ్మా ఎగుమతుల కోసం విక్రయిస్తున్నాం.

ఇతర పంట దిగుబడులను స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నాం. ప్రభుత్వ ధరకన్నా ఎక్కువ ధరనే రైతులకు చెల్లిస్తున్నాం. గత ఏడాది రూ. 4 కోట్ల కాఫీ, మిరియాలు విక్రయించాం. ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్, ఉద్యానశాఖ తోడ్పాటుతో 10 టన్నుల గోదాములు నిర్మించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరిన మా రైతులు 20 మంది మేఘాలయ వెళ్లి అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నారు. గత ఏడాది మా సొసైటీకి జాతీయ జైవిక్‌ ఇండియా పురస్కారం కూడా లభించింది. ఎన్‌సిఓఎల్‌ ద్వారా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. 
– పి. గంగరాజు (63018 76177), సీఈఓ, 
ఎం.నిట్టపుట్టు గిరిజన రైతుల సొసైటీ, అరకు, ఎఎస్‌ఆర్‌ జిల్లా 

 

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు

(చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా)

మరిన్ని వార్తలు