రోమియో.. జూలియట్‌

1 Oct, 2019 13:20 IST|Sakshi

ఇటలీ దేశంలోని వెరోనా నగరం కాపులేట్స్‌, మాంటెక్‌ అనే రెండు సంపన్న కుటుంబాల మధ్య వైరంతో అల్లకల్లోలం అవుతుంటుంది. ఈ నేపథ్యంలో వెరోనా పట్టణపు యువరాజు రెండు కుటుంబాలను హెచ్చరించి వారి మధ్య గొడవలు జరగకుండా ఆపుతాడు. యువరాజు ఆజ్ఞతో ఇరుకుటుంబాలు గొడవలు పడకుండా మిన్నకుండిపోతాయి. మాంటెక్‌ వంశానికి చెందిన రోమియో.. రోసాలిన్‌ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. రోసాలిన్‌కు ప్రేమ అంటే గిట్టదు! అందుకే రోమియోను దూరంగా పెడుతుంది. రోమియో మాత్రం ఆమె ప్రేమను పొందటం కోసం పరితపిస్తుంటాడు. ప్రతినిత్యం సోదరుడి వరుసైన బెన్‌ వోలియోను, ముసలివాడైన మోర్కుషియోలను వెంటబెట్టుకుని ఆమె వెనకాలే తిరుగుతుంటాడు. ఓ రోజు రొసాలిన్‌.. స్నేహితురాలి విందుకు వెళ్లిందని తెలుసుకున్న రోమియో మారువేషంలో అక్కడకు వెళతాడు. ఆ విందులో మొట్టమొదటిసారి కపులేట్స్‌ వంశానికి చెందిన జూలియట్‌ను చూస్తాడు. 

తొలిచూపులోనే జూలియట్‌  అందానికి దాసోహం అంటాడు. రొసాలిన్‌ను మరిచిపోయి జూలియట్‌ ప్రేమలో మునిగితేలుతుంటాడు. ఆ విందు ఆఖరి దశలో ఉండగా రోమియో జూలియట్‌కు తన ప్రేమ విషయం చెబుతాడు. జూలియట్‌ కూడా రోమియోను చూడగానే ప్రేమలో పడిపోతుంది. మొదట కొంచెం బెట్టుచేసినా తర్వాత అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఆ తర్వాత రోమియో జూలియట్‌లకు తమ కుటుంబాల మధ్య ఉన్న వైరం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూలియట్‌ను పారిస్‌ అనే యువకుడికిచ్చి వివాహం చేయటానికి నిశ్చయం జరుగుతుంది. జూలియట్‌ నిస్సహాయ పరిస్థితిలో పడుతుంది. అదే రోజు రాత్రి రోమియో, జూలియట్‌లు కలుసుకుంటారు. తమ ఈ సమస్యకు పెళ్లే పరిష్కారంగా భావించి ఫ్రాయర్‌ లారెన్స్‌ అనే ఒక మత బోధకుడి సహాయంతో భార్యాభర్తలవుతారు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. 

రెండు కుటుంబాలను ఐక్యం చేయాలనే ఉద్ధేశ్యంతోనే లారెన్స్‌ ఈ పెళ్లి జరిపిస్తాడు. అందుకే రోమియో జూలియట్‌ల పెళ్లి సంగతిని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచుతాడు. ఈ తర్వాత చోటుచేసుకునే కొన్ని సంఘటనల కారణంగా రోమియో! జూలియట్‌కు అన్న వరుసయ్యే టైబల్డ్‌ అనే వ్యక్తిని చంపేస్తాడు. రోమియో చేసిన పనిని తప్పుబట్టిన జనం అతడ్ని మహారాజు దగ్గరకు తీసుకువెళతారు. అతడికి ఉరిశిక్ష విధించాలని మహారాజుకు విన్నవిస్తారు. దీంతో రోమియో అక్కడినుంచి తప్పించుకుని పారిపోతాడు. రోమియో.. టైబల్డ్‌ను చంపిన విషయం జూలియట్‌కు తెలుస్తుంది. అయినప్పటికి ఆమె అతన్ని తప్పుబట్టక అతడి కోసం వెతికిస్తుంది. రోమియో మాత్రం ఎవరికంటా పడకూడదని అన్ని నగరాలు తిరుగుతుంటాడు. 

 ప్రియురాలిని కలుసుకోలేని పరిస్థితిలో రోమియో మనోవేదనకు గురవుతాడు. చివరకు అతడు లారెన్స్‌ ఊరైన ‘‘మంటువ’’కు చేరుకుంటాడు. మరో వైపు జూలియట్‌కు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతారు ఆమె కుటుంబసభ్యులు. దీంతో జూలియట్‌ సమస్య పరిష్కారం కోసం లారెన్స్‌ను ఆశ్రయిస్తుంది. అతడు ఓ ఉపాయం చెబుతాడు.. ఓ రసాయనం ద్వారా ఆమెను 48 గంటలు శవంలా పడుండేలా చేస్తానని, ఇటాలియన్‌ సంప్రదాయం ప్రకారం 48 గంటలు శవాన్ని ఖననం చేయరు కాబట్టి.. 48 గంటల తర్వాత జూలియట్‌ మామూలు మనిషిగా మారినపుడు ఆమెను అక్కడినుంచి తప్పించి రోమియో దగ్గరకు చేరుస్తానని చెబుతాడు. ఇందుకు ఆమె ఒప్పుకుంటుంది. ఆ తర్వాత లారెన్స్‌ ఇచ్చిన రసాయనాన్ని తాగి నిస్తేజంగా మారిపోతుంది. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు ఆమె మరణించిందని భావించి శవాన్ని భద్రపరిచేందుకు సమాధి గృహానికి తీసుకెళతారు. లారెన్స్‌ .. రోమియోకు ప్రయోగం గురించి, చేయవలసిన పని గురించి లేఖ రాస్తాడు. అయితే అదేసమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రభలడంతో లేఖ రోమియోకు అందదు. కానీ, జూలియట్‌ చనిపోయిందన్న వార్త అతడికి తెలుస్తుంది. 

దీంతో అతడు గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ప్రేయసిలేని జీవితాన్ని ఊహించుకోలేక విషం తాగుతాడు. చివరిసారి జూలియట్‌ను చూడాలని నగర శివార్లలోకి వస్తాడు. అప్పుడు కపులేట్స్‌ వర్గంవారు అతడ్ని చుట్టుమడతారు. రోమియో వారిని ఎదురించి శవపేటిక దగ్గరకు వస్తాడు. అదే సమయంలో జూలియట్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న పారిస్‌ కూడా అక్కడకు వస్తాడు. లోపలికి ఎవ్వరినీ రానివ్వొద్దని ఆదేశాలు జారీచేస్తాడు. అయితే రోమియో అందరితో తలబడి ప్రేయసి శవాన్ని తాకబోతాడు. పారిస్‌ అడ్డుకోవటంతో ఆగ్రహించిన రోమియో అతన్ని చంపేస్తాడు. తర్వాత శవపేటికలో ఉన్న జూలియట్‌ శరీరాన్ని గుండెలకు హత్తుకుని, విలపిస్తూ ఆఖరిసారి ఆమెను ముద్దుపెట్టుకుని తుదిశ్వాస విడుస్తాడు. అప్పుడే జూలియట్‌ కళ్లు తెరుస్తుంది. ఆమెకు అక్కడి పరిస్థితి మొత్తం అర్థం అవుతుంది. జూలియట్‌ను బంధించటానికి సైనికులు ఆమెను సమీపిస్తుంటారు. జూలియట్‌.. రోమియో శరీరంపై పడి విలపిస్తూ అతని వద్ద ఉన్న కత్తిని గుండెల్లో పొడుచుకుని ప్రాణం తీసుకుంటుంది.

మరిన్ని వార్తలు